House Rent: ఇంటి అద్దెను చెల్లించేటప్పుడు ఈ పద్ధతులు పాటిస్తే మంచిది

ఇంటి యజమాని అద్దెదారును ఖాళీ చేయించకుండా ఉండడానికి కొన్ని చిట్కాలు ఇక్కడ ఉన్నాయి.

Published : 22 Apr 2023 12:00 IST

ఇంటిని కొనుగోలు చేయలేని వారు, కొత్తగా ఉద్యోగ/వృత్తి జీవితం ప్రారంభించినవారు అద్దెకుండడం సహజమే. కానీ, ఇంటి యజమానితో ఇంటి అద్దె విషయంలో సరైన సంబంధాలు నిర్వహించాల్సి ఉంటుంది. ఇంటి యజమాని ఇల్లు ఖాళీ చేయించకుండా ఉండాలంటే..అద్దెదారుడు ముందు నుంచి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దీనికి ముఖ్యంగా అద్దెను చెల్లించేటప్పుడే అద్దెదారుడు కొన్ని పద్ధతులు పాటించాలి. దీనివల్ల ఇంటి యజమాని నోటిసు లేకుండా ఇంటిని ఖాళీ చేయించలేరు. అయితే, అద్దెకుండేవారికి కొన్ని ప్రతికూలతలు ఉంటాయి. వాటిని ఎలా అధిగమించాలో చూద్దాం.

చెల్లింపులు

అద్దె చెల్లింపుదారుడు చెక్‌, క్రెడిట్‌ కార్డు, డెబిట్‌ కార్డు, యూపీఐ లేదా ఆన్‌లైన్‌ బదిలీలు(IMPS, NEFT) లాంటి నగదు రహిత మోడ్‌ల ద్వారా అద్దె చెల్లించడానికి ప్రయత్నించాలి. నగదు రహిత ఛానెల్‌ ద్వారా అద్దె చెల్లించినప్పుడు, లావాదేవీ వెంటనే రికార్డు అవుతుంది. అద్దె చెల్లింపునకు రుజువుగా దాన్ని మీ వద్ద భద్రపరచుకోవచ్చు. మీరు ఇంటి యజమాని ఖాతాకు చెక్‌ ద్వారా చెల్లించినట్లయితే, మీ బ్యాంకు ఖాతా స్టేట్‌మెంట్‌..ఇంటి యజమాని పేరు, తేది, మొత్తాన్ని ప్రతిబింబిస్తుంది. అదే విధంగా, మీరు క్రెడిట్‌ కార్డు లేదా డిజిటల్‌ చెల్లింపుల ద్వారా చెల్లించేటప్పుడు ఖాతా స్టేట్‌మెంట్‌ సహాయకరంగా ఉంటుంది. అందువల్ల, అద్దె చెల్లించలేదనే మిషతో మిమ్మల్ని ఇంటి నుంచి వెంటనే ఖాళీ చేయించలేరు.

నగదు చెల్లిస్తున్నారా?

కొన్ని సందర్భాల్లో అద్దెదారులకు ఆన్‌లైన్‌ చెల్లింపు చేసే సదుపాయం ఉండకపోవచ్చు లేక తెలియకపోవచ్చు. చెక్‌ బుక్‌ కూడా లేకుండా ఉండొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో అద్దెను నగదు రూపంలో చెల్లించే విధానానికే మొగ్గు చూపించాల్సి ఉంటుంది. అంతేకాకుండా, కొన్ని సార్లు ఇంటి యజమానులు నగదు రహిత చెల్లింపును అంగీకరించడానికి సిద్ధంగా ఉండరు. తప్పనిసరి పరిస్థితిలో నగదు ఇచ్చినట్లయితే రశీదు ఇవ్వాలని యజమానిని అడగాలి. యజమాని తన బ్యాంకు ఖాతా వివరాలను అందించడానికి సిద్ధంగా ఉంటే, అతని ఖాతాలో నగదు డిపాజిట్‌ చేయవచ్చు. అద్దె రశీదుతో పాటు బ్యాంకు డిపాజిట్‌ స్లిప్‌ను మీ వద్ద రికార్డుగా భద్రపరచుకోవాలి.

ముందుగా అద్దె చెల్లించండి..

గడువు తేదీకి కొన్ని రోజులు లేదా వారాల ముందు అద్దె చెల్లించడం వల్ల ఎటువంటి నష్టం లేదు. సరైన తేదీకి ముందే అద్దె చెల్లించినందున ఇంటి యజమానికి అద్దెదారుపై సదభిప్రాయం ఏర్పడి ఇల్లు ఖాళీ చేయించే ఉద్దేశం మానుకోవచ్చు. ముందస్తు అద్దె చెల్లింపులు చేసిన తర్వాత యాజమాని నుంచి రసీదు పొందండి. ఇంటి యజమానితో అద్దె ఒప్పందం కుదుర్చుకున్న వ్యక్తి కాకుండా మరొకరి ఖాతా నుంచి ఇంటియజమాని ఖాతాకు డబ్బులు పంపించడం మంచిది కాదు.

ఆలస్య చెల్లింపులు వద్దు

మిమ్మల్ని ఇల్లు ఖాళీ చేయించే అవకాశాన్ని యజమానికి ఇవ్వకుండా ఉండడానికి అద్దె చెల్లింపులో జాప్యం ఉండకూడదు. అద్దె చెల్లించే తేదీకి ముందుగానే మీ మొబైల్‌ ఫోన్‌లో రిమైండర్‌ను సెట్ చేసుకోవచ్చు. జీతం గురించి ఎదురు చూడకుండా అద్దెకు సరిపడా నగదును ముందుగానే మీ ఖాతాలో భద్రపరచుకోవడం మంచిది. అద్దెకు ఇబ్బంది ఏర్పడినప్పుడు బ్యాంకుల్లో స్వల్ప మొత్తానికి ఉన్న ఎఫ్‌డీలను కూడా ఉపయోగించవచ్చు.

ఇంటిని సరిగ్గా నిర్వహించాలి..

ఇంటి యజమాని అద్దెదారుని అసమంజసంగా లేదా ముందస్తు నోటీసు లేకుండా ఖాళీ చేయించలేరు. అంటే, కనీసం 15 రోజులు ముందు నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. చట్టపరమైన తొలగింపులకు కొన్ని కారణాలు ఉండొచ్చు. అద్దెదారు వరుసుగా 2 నెలల పాటు అద్దె బకాయి చెల్లించని పరిస్థితుల్లో, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు ఇంటిని ఉపయోగించినప్పుడు, నివాస గృహాన్ని(అద్దె ఒప్పందంలో పేర్కొనని) వాణిజ్య అవసరాలకు ఉపయోగించినా లేదా యజమానికి తెలియజేయకుండా దాని నిర్మాణంలో మార్పులు చేసినా..యజమాని మిమ్మల్ని ఇంటి నుంచి ఖాళీ చేయించే అవకాశముంది. కాబట్టి, అద్దెకు తీసుకున్న ఆస్తిని జాగ్రత్తగా చూసుకోవడం ఎల్లప్పుడు మంచిది.

చివరిగా: ఇంటి యజమానితో మంచి అవగాహనను పెంపొందించుకొని, వివాదాలు లేకుండా పరస్పర అవగాహనతో సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించడం మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని