Health insurance: ఆరోగ్య బీమా ప్లాన్‌ను పోర్ట్‌ చేసే ముందు ఇవి గుర్తుంచుకోండి..

Health insurance Porting: ఆరోగ్య బీమా ప్లాన్‌ను ఒక సంస్థ నుంచి వేరొక బీమా సంస్థకు మార్చుకునేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. అవేంటో తెలుసుకోండి..

Published : 30 Dec 2022 16:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒక మొబైల్‌ నెట్‌వర్క్‌ సేవలు మనకిష్టం లేనప్పుడు వేరే మొబైల్‌ నెట్‌వర్క్‌కు మారినట్లే.. ఆరోగ్య బీమా (Health insurance)లో కూడా మెరుగైన సేవలు లభించే అవకాశం ఉన్నప్పుడు వేరొక సంస్థకు మారొచ్చు. దీన్నే 'పోర్టబిలిటీ'గా పేర్కొంటారు. ఆరోగ్య బీమా పాలసీని వివిధ కారణాల వల్ల ఒక బీమా కంపెనీ నుంచి మరొక బీమా కంపెనీకి పోర్ట్‌ చేసే ముందు కొన్ని ముఖ్యమైన అంశాలు గుర్తుంచుకోవాలి.

పాలసీ రకాన్ని చూడండి

అందుబాటులో ఉన్న వివిధ రకాల పాలసీలను పరిశీలించండి. ఉదాహరణకు, మీ వ్యక్తిగత పాలసీలో కుటుంబ సభ్యులను జోడించాలనుకుంటే.. ఫ్యామిలీ ఫ్లోటర్‌ లేదా బహుళ-వ్యక్తిగత పాలసీలు ఎంచుకోవచ్చు.

వెయిటింగ్‌ పీరియడ్‌

పాలసీని పోర్ట్‌ చేసేటప్పుడు ఇది చాలా కీలకం. మీరు ప్రస్తుత పాలసీలో 2 సంవత్సరాల వెయిటింగ్‌ పీరియడ్‌ పూర్తిచేసుకున్నట్లయితే, కొత్త పాలసీ దీన్ని పరిగణించాలి. దీనివల్ల కీలకమైన అనారోగ్యాలు బారిన పడినప్పుడు బీమా కవరేజీ కోల్పోకుండా ఉంటారు.

క్యుములేటివ్‌ బోనస్‌

పాలసీలను పోర్ట్‌ చేస్తున్నప్పుడు బీమాదారులు ఈ విషయాన్ని పట్టించుకోరు. మీ పాలసీలో క్యుములేటివ్‌ బోనస్‌ ఉందనుకుందాం. ఇది క్లెయిమ్‌ చేయకపోవడం వల్ల వచ్చే అదనపు ప్రయోజనం. ఇది పాలసీ ప్రీమియంలో తగ్గింపుగా ఉండొచ్చు. లేక అదనపు బీమా కవరేజీ ప్రయోజనాన్ని పొందొచ్చు. ఉదా: మీ ప్రస్తుత బీమా రూ.5 లక్షలు అనుకుందాం. మీరు ఉపయోగించని క్యుములేటివ్‌ బోనస్‌ రూ.1.50 లక్షలు ఉంటే.. కొత్తగా పోర్ట్‌ అయిన పాలసీలో బీమా మొత్తం కనీసం రూ.6.50 లక్షలు లేక అంతకంటే ఎక్కువ కలిగి ఉండాలి. భవిష్యత్‌లో క్లెయిమ్‌లు చేసే సందర్భంలో ఈ అదనపు ప్రయోజనాన్ని ఉపయోగించవచ్చు.

యాడ్‌-ఆన్‌ ఫీచర్లు

నో క్లెయిమ్‌ బోనస్‌ రివార్డు, ఆసుపత్రిలో వినియోగించే వస్తువుల కవరేజీ, బీమా మొత్తాన్ని పెంచడం వంటి యాడ్‌-ఆన్‌ ఫీచర్‌ల కోసం చూడండి. ఇవి మీ ప్రస్తుత పాలసీని మరింత సమగ్రంగా చేయడంలో సహాయపడతాయి. అయితే, ఈ యాడ్‌-ఆన్‌లు అదనపు ధరతో వస్తాయి. ఇప్పటికే మీరు వీటిని ఎంచుకుని ఉంటే, పోర్టింగ్‌ చేసుకునే పాలసీలో కూడా యాడ్‌ అయ్యేలా చూసుకోవాలి.

పోర్టింగ్‌ డాక్యుమెంటేషన్‌

బీమా పునరుద్ధరణ సమయానికి ముందుగానే మీ మునుపటి బీమా సంస్థకు పోర్టింగ్ గురించి తెలియజేయండి. బీమా మొత్తం, కవరేజీలో ఉన్న సభ్యులు, నో క్లెయిమ్‌ బోనస్‌ మొదలైన పాలసీ వివరాలను పోర్ట్ చేసుకునే సంస్థకు తెలుపాల్సి ఉంటుంది. మునుపటి 2 సంవత్సరాల పాలసీలు, ఇప్పటికే ఉన్న పాలసీల క్లెయిమ్‌ వివరాలు, పోర్ట్‌ చేయాల్సిన పాలసీ రకం మొదలైనవాటిని కూడా తప్పనిసరిగా సమర్పించాలి.

పోర్టబిలిటీ ఏ సమయంలో చేయాలి?

పోర్టబిలిటీ పునరుద్ధరణ సమయంలో మాత్రమే సాధ్యమవుతుంది. అలాగే, మీరు  పోర్ట్‌ చేయాలనుకున్నప్పుడు దాన్ని ముందుగానే ప్లాన్‌ చేయాలి. రెన్యువల్‌కు 45 రోజుల ముందే పోర్టింగ్‌ ప్రక్రియ ప్రారంభం కావాలి. ఎందుకంటే, ఏవైనా కారణాల వల్ల పోర్టింగ్‌ను ఇతర బీమా కంపెనీ అంగీకరించకపోతే, పాలసీని ప్రస్తుత బీమా కంపెనీలోనే పునురుద్ధరించుకుని పాలసీ ప్రయోజనాలను పొందడానికి మీకు ఇంకా సమయం ఉంటుంది. అంతేకాకుండా, గ్రేస్‌ పీరియడ్‌లో పోర్టబిలిటీకు ఆమోదం ఉండదు.

ప్రీమియం మాత్రమే చూడకూడదు

చాలా మంది పాలసీ పోర్ట్ చేసేటప్పుడు ప్రీమియం మాత్రమే చూస్తారు. తక్కువ ప్రీమియం మాత్రమే ఎల్లప్పుడూ ఉత్తమ ఎంపిక కాదు. మీ ఆరోగ్య సంరక్షణ అవసరాల కోసం మీకు అవసరమైన అన్ని కవరేజీలు, ఫీచర్లు, ఇతర ప్రయోజనాలను కొత్త బీమా సంస్థ అందిస్తుందో లేదో తనిఖీ చేయండి. లేకపోతే మీరు వైద్యపరమైన అత్యవసర పరిస్థితిలో చేతి డబ్బులు ఎక్కువ చెల్లించవలసి ఉంటుంది.

చివరిగా: ఆరోగ్య బీమా.. ఊహించని వైద్య అత్యవసర పరిస్థితుల నుంచి రక్షణ అందిస్తుంది. పోర్టబిలిటీకి సంబంధించిన విధానాలు చాలా సరళంగా ఉన్నప్పటికీ.. ఉత్తమ కవరేజీని పొందడానికి పోర్టబిలిటీకి ముందు పైన పేర్కొన్న అంశాలను గుర్తుంచుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని