విదేశీ విద్య‌ కోరుకుంటున్నారా? ఇవి తెలుసుకోవాల్సిందే!

ప్రముఖ ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ బ్యాంకులే కాకుండా విద్యా రుణం ఇవ్వ‌డానికి ఇత‌ర రుణ సంస్థ‌లు కూడా ఉన్నాయి.

Updated : 29 Aug 2022 17:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: త‌మ పిల్ల‌ల‌కు అత్యుత్త‌మ నాణ్య‌మైన విద్య‌ను అందించాల‌నేది ప్ర‌తి త‌ల్లిదండ్రుల కోరిక‌. స్వ‌దేశంలోనే కాకుండా విదేశాల‌లో కూడా త‌మ పిల్ల‌ల‌ను చ‌దివించ‌డానికి వెనుకాడ‌డం లేదు. విదేశాల్లో అత్యుత్త‌మ కాలేజీల్లో చ‌దివించి త‌మ పిల్ల‌ల‌ను ప్ర‌యోజ‌కుల‌ను చేయాల‌ని త‌ల్లిదండ్రులు ఆశిస్తుంటారు. విదేశీ విద్య‌కు భారీగానే ఖ‌ర్చ‌వుతుంది. ఒక విదేశీ విశ్వ‌విద్యాల‌యంలో చేర‌డానికి అవ‌కాశం పొంద‌డ‌మే కాకుండా, అక్క‌డ‌కు వెళ్ల‌డం, బ‌స చేయ‌డం, ఆహార ఏర్పాట్లు, రాక‌పోక‌లు మొద‌లైన వాటికి స‌రైన ఆర్థిక ప్ర‌ణాళిక అవ‌స‌రం. మీరు ద‌ర‌ఖాస్తు చేసుకున్న విశ్వ‌విద్యాల‌యాల‌లో మీకు అర్హ‌త ఉన్న ఏవైనా స్కాల‌ర్‌షిప్‌లు, గ్రాంట్ల కోసం ప్ర‌య‌త్నించాలి. స్కాల‌ర్‌షిప్‌లు, గ్రాంట్లు లేన‌ట్ల‌యితే ఒక విద్యార్థి విదేశాల్లో చ‌దువుకోవాల‌నే క‌ల‌ను నిజం చేసుకోవ‌డానికి కుటుంబ మ‌ద్దత‌న్నా ఉండాలి లేక విద్యా రుణం కోసం ప్ర‌య‌త్నించాలి.

విద్యారుణాలిచ్చే సంస్థ‌లు

ప్రముఖ ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ బ్యాంకులే కాకుండా విద్యా రుణం ఇవ్వ‌డానికి ఇత‌ర రుణ సంస్థ‌లు కూడా ఉన్నాయి. కుహూ ఎడ్యుఫిన్‌టెక్‌, లీప్ ఫైనాన్స్‌, ఇన్‌క్రెడ్‌, ప్రాడిజీ వంటి రుణ సంస్థ‌లు విదేశాల‌లో చ‌దువుకోవాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్న విద్యార్థులకు విద్యా రుణం అంద‌జేయ‌డానికి ముందుకు వ‌స్తున్నాయి. కుహూ ఎడ్యుఫిన్‌టెక్ అయితే గ్యారంటీలు, త‌న‌ఖాలు లేకుండా త‌ల్లిదండ్రుల ప్ర‌మేయం కూడా లేకుండా విద్యా రుణాల‌ను అంద‌జేస్తుంది.

ప‌న్ను మిన‌హాయింపులు

బ్యాంకుల ద్వారా పొందే విద్యా రుణం మొత్తం వ‌డ్డీ భాగం ఆదాయ‌పు ప‌న్ను నిబంధ‌న‌ల కింద మిన‌హాయింపు ఉంటుంది. మీరు ఆదాయ ప‌న్ను ప‌రిధిలో అధిక స్లాబ్‌లో ఉన్న‌ట్ల‌యితే ఆదాయంపై 30 శాతం ప‌న్ను చెల్లించే బ‌దులు 10-12 శాతం వ‌డ్డీతో విద్యా రుణాన్ని తీసుకోవ‌డం మంచిది.

ఇత‌ర ఖ‌ర్చుల‌ను గ‌మ‌నించాలి

వివిధ రుణ ఎంపిక‌ల‌ను చూస్తున్న‌ప్పుడు త‌క్కువ వ‌డ్డీ రేటు ఒక్క‌టే ప్ర‌ధాన అంశం కాదు. ప్రాసెసింగ్ ఫీజు, ఇన్సూరెన్స్ ఛార్జీలు, వ‌న్ టైమ్ ఛార్జీలు, ఫారిన్ ఎక్స్చేంజ్ రేటు మొద‌లైన‌వాటిని క‌లుపుకుని ఖ‌ర్చు మొత్తం ఎంత అనేది చూడాలి.

ఈఎంఐ ఎంత ఉండాలి?

ఎక్కువ కాల‌వ్య‌వ‌ధిని ఎంచుకుంటే, మొత్తం మీద ఎక్కువ వ‌డ్డీ చెల్లించాల్సి వస్తుందని విద్యార్థులు కాల వ్యవధి తగ్గించుకుని అధిక ఈఎంఐ మొత్తాన్ని ఎంచుకుంటుంటారు. కానీ, కెరీర్ ప్రారంభంలో త‌క్కువ ఆదాయం ఉంటుంది. కాబ‌ట్టి త‌క్కువ ఈఎంఐ ఉండ‌డమే మంచిది. డిఫాల్ట్ ప్ర‌మాదాన్ని త‌ప్పించుకోవచ్చు. త‌క్కువ ఈఎంఐ ఆర్థిక ఒత్తిడిని త‌గ్గిస్తుంది. క్రెడిట్ రేటింగ్ దెబ్బ‌తిన‌కుండా చూసుకోవ‌చ్చు. ఆదాయం పెరిగినప్పుడు బ్యాంకుతో చర్చించి మార్పులు చేసుకోవచ్చు.

ప్రాసెసింగ్ స‌మ‌యం

రుణ మంజూరుకు సంబంధించిన ప్రాసెసింగ్ స‌మ‌యం మ‌రొక ముఖ్య‌మైన అంశం. అనేక విశ్వ‌విద్యాల‌యాలు విద్యార్థులను త‌మ సీట్ల‌ను స‌మ‌యానికి రిజ‌ర్వ్ చేసుకోమ‌ని అడుగుతాయి. రుణ మంజూరుకి ఇది చాలా అవ‌స‌రం. రుణ పంపిణీకి బ్యాంకుల‌కు త‌గిన ప్రాసెసింగ్ స‌మ‌యం ఉంటుంది. విశ్వ‌విద్యాల‌యాలలో ఒకేసారి కాకుండా ట‌ర్మ్‌ల వారీగా ఫీజులు వ‌సూలు చేసే ప‌ద్ధ‌తి ఉంటుంది. బ్యాంకులు కూడా రుణాన్ని ఒకేసారి కాకుండా ట‌ర్మ్‌ల వారీగా అంద‌చేస్తాయి. విద్యార్థులకు దీనిపై స్ప‌ష్ట‌మైన అవ‌గాహ‌న అవ‌స‌రం.

రుణానికి ఎక్కువ బ్యాంకుల‌ని సంప్ర‌దించండి

ఒక‌టి కంటే ఎక్కువ రుణ సంస్థ‌ల‌కు ద‌ర‌ఖాస్తు చేయాలి. ఒక రుణ సంస్థ మీదే ఆధార‌ప‌డితే ఒక్కోసారి అనిశ్చితికి దారితీయొచ్చు. కొత్త ప్లాట్‌ఫార‌మ్‌లు విద్యార్థులకు 15 రోజుల‌లోపు గ్యారెంటీ, పూచీక‌త్తు లేకుండా రుణాల‌ను ఇస్తున్నాయి. అయితే, బ్యాంకుల‌తో పోలిస్తే ఫిన్‌టెక్ సంస్థ‌ల‌లో వ‌డ్డీ రేటు ఎక్కువ ఉంటుంది. గతంలో విద్యా రుణాల‌ని తీసుకున్న వారిని సంప్ర‌దిస్తే మంచిది.

సొంత పొదుపు కోసం ప్ర‌య‌త్నించాలి

త‌ల్లిదండ్రులు, విద్యార్థులు కూడా ఇప్పటి నుంచే ఈ విష‌యాల గురించి ఆలోచించ‌డం ప్రారంభించాలి. వీలైనంత త్వ‌ర‌గా పొదుపు చేయ‌డం ఒక మార్గం. విదేశీ ఉన్న‌త విద్య ఒక మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబానికి పెద్ద ల‌క్ష్యం. ఈ క‌ల‌ని తీర్చుకోవ‌డానికి, ఆర్థికంగా సుర‌క్షితంగా ఉండ‌డానికి సొంతంగా నిధిని క‌లిగి ఉండ‌డానికి త‌మ వంతు ప్ర‌య‌త్నాలు చేయాలి. అందుచేత వివిధ పథకాల్లో పెట్టుబడి పెట్టడం మంచిది. రిస్క్ పరిమితి, పెట్టుబడి విధానం, కాలపరిమితి లాంటి వాటి ఆధారంగా సుకన్య సమృద్ధి యోజన (ఆడ పిల్లల కోసం), పీపీఎఫ్, మ్యూచువల్ ఫండ్లు లాంటి పథకాలను ఎంచుకోవచ్చు. క్రమం తప్పకుండా వీటిలో దీర్ఘకాలం మదుపు చేయడం మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని