Digital loans: ఆన్‌లైన్‌ రుణం తీసుకుంటున్నారా.. ఇవి తెలుసుకున్నాకే!

Digital loans: డిజిటల్ లోన్ యాప్‌ల ఆదరణ పెరుగుతున్న సమయంలో చాలామంది వీటిని ఉపయోగిస్తూ ఆన్‌లైన్‌లోనే రుణాలు తీసుకుంటున్నారు. అయితే రుణం తీసుకొనేముందు కొన్ని విషయాల పట్ల అవగాహన ముఖ్యం.

Updated : 15 Apr 2023 11:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒకప్పుడు రుణం (Bank Loan) తీసుకోవాలంటే బ్యాంకులకు వెళ్లాల్సి వచ్చేది. సంబంధిత పత్రాలు నింపి రుణం తీసుకోవడానికి కొన్ని రోజుల సమయం పట్టేది. అందుకే చాలా మంది ప్రైవేటు వ్యక్తుల వద్ద కాస్త వడ్డీ ఎక్కువైనా రుణాలు తీసుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. డిజిటల్‌ రుణాల (Digital Loans) పుణ్యమా అని కేవలం ఒక్క క్లిక్‌తోనే రుణాలు మంజూరవుతున్నాయి. క్షణాల్లో డబ్బు ఖాతాల్లో జమ అవుతోంది. ఈ రుణాలకు పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా ఈ తరహా కంపెనీలూ వందల సంఖ్యలో పుట్టుకొస్తున్నాయి. ఈ రుణాల వల్ల నష్టాలూ లేకపోలేదు. రుణాల తిరిగి చెల్లింపు విషయంలో రుణ గ్రహీతలను వేధించడం, రుణాల మాటున వ్యక్తిగత డేటా చోరీ వంటి ప్రమాదాలూ పొంచి ఉన్నాయి. పైగా సులువుగా దొరుకుతున్నాయి కదా అని ఎడాపెడా రుణాలు తీసుకుంటే క్రెడిట్‌ స్కోరుపైనా ప్రభావం పడుతుంది. కాబట్టి ఈ తరహా డిజిటల్‌ రుణాలు తీసుకునే ముందు కొన్ని విషయాలు తెలుసుకోవడం ముఖ్యం.

నిబంధనలు, షరతులు

మీరు రుణం తీసుకుంటున్న సమయంలో బ్యాంక్‌/ కంపెనీలు ఇచ్చే నిబంధనలు, షరతులను క్షుణ్ణంగా పరిశీలించండి. లోన్‌ నిబంధనలు, వడ్డీ రేట్లు, తిరిగి చెల్లించవలసిన సమయం, గడువులోగా డబ్బులు కట్టకుంటే ఎదుర్కోవలసిన పరిణామాలు, ముందస్తు చెల్లింపులకు పెనాల్టీలు వంటివన్నీ తెలుసుండాలి. ఇవన్నీ కంపెనీ తన నిబంధనలు, షరతుల్లో పేర్కొంటుంది. ఒకవేళ ఏదైనా విషయంలో స్పష్టత కొరవడితే కంపెనీని నేరుగా సంప్రదించండి.

సంస్థ ఎంపిక

డిజిటల్‌ రుణాలకు పెరిగిన ఆదరణ మూలంగా అనేక రుణయాప్‌లు పుట్టుకొచ్చాయి. దీంతో ఏ యాప్‌ను ఎంచుకోవాలో కష్టంగా మారింది. ఎప్పుడూ పేరున్న సంస్థలనే ఎంచుకోవడం మంచిది. అలాగే మెరుగైన కస్టమర్‌ సర్వీస్‌, రుణాల విషయంలో సందేహాలు నివృత్తి చేయడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని రుణ సంస్థను ఎంచుకోండి. ఈ విషయాల్లో ఏ సంస్థ మెరుగైన సేవలందిస్తోందో సరిపోల్చండి.

డేటా జాగ్రత్త సుమీ

డిజిటల్‌ రుణం తీసుకొనే సమయంలో మీరు వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని రుణదాతకు సమర్పించాల్సి ఉంటుంది. కాబట్టి రుణగ్రహీత డేటాను సంరక్షించటానికి సరైన భద్రత కలిగి ఉందా? వెబ్‌సైట్‌లో నిర్వహణ లోపాలు ఉన్నాయా? అనే అంశాలు తెలుసుకోవటం ముఖ్యం. మనం అందించే డేటాను వారు దేనికి వినియోగిస్తున్నారు? దాన్ని ఎలా భద్రపరుస్తున్నారో ప్రైవసీ పాలసీ ద్వారా స్పష్టంగా తెలుసుకోండి.

క్రెడిట్‌స్కోర్‌

డిజిటల్‌ రుణం తీసుకోవడంలో క్రెడిట్‌స్కోర్‌ (Credit Score) కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే రుణం తీసుకున్న ప్రతిసారీ దీనిపై ప్రభావం పడుతుంది. తక్కువ సమయంలో అనేక సార్లు రుణాలు తీసుకుంటే క్రెడిట్‌స్కోర్‌ తగ్గే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సులువుగా రుణం దొరుకుతుంది కదాని తక్కువ సమయంలో ఎక్కువ రుణాలు తీసుకోవడానికి ప్రయత్నించకండి. అలాగే, క్రెడిట్‌ రిపోర్ట్‌ను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోండి. ఏదైనా తప్పులుంటే సరిచేసుకున్నాకే రుణం కోసం ప్రయత్నించండి. 

చివరిగా: సులభంగా రుణం లభించినప్పటికీ అవసరం ఉన్నప్పుడే రుణం తీసుకోండి. తిరిగి చెల్లించగలమన్న ధీమా ఉన్నప్పుడే ముందడుగు వేయండి. మోసపూరిత యాప్‌ల విషయంలో అప్రమత్తంగా ఉండండి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని