Health Insurance: మ‌హిళ‌లు ఆరోగ్య బీమా తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన అంశాలు

మ‌హిళ‌ల‌ అవ‌స‌రాల‌కు అనుగుణంగా మార్కెట్లో ఆరోగ్య బీమా పాల‌సీలు అందుబాటులో ఉన్నాయి. 

Updated : 10 Dec 2021 14:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్ర‌స్తుత రోజుల్లో ఆరోగ్య బీమా లేకుండా వైద్య ఖ‌ర్చుల‌ను భ‌రించ‌డం అంత సులువు కాదు. కాబ‌ట్టి ప్ర‌తి ఒక్క‌రి ఆర్థిక ప్ర‌ణాళికలో ఆరోగ్య బీమా భాగం కావాలి. ఇందుకు మ‌హిళ‌లు మిన‌హాయింపు కాదు. ఇంత‌కు ముందుతో పోలిస్తే కొవిడ్ త‌ర్వాత ఆరోగ్య బీమా తీసుకుంటున్న మ‌హిళ‌ల సంఖ్య పెరిగిన‌ప్ప‌టికీ, పూర్తి స్థాయిలో ఇంకా తీసుకోవ‌డం లేదు. మ‌హిళ‌లు ఆరోగ్యం ప‌ట్ల శ్ర‌ద్ధ వ‌హించి ఆరోగ్య బీమాను త‌ప్ప‌నిస‌రిగా తీసుకోవాలి.

మ‌హిళ‌లు ఆరోగ్య బీమా తీసుకునే ముందు ప‌రిగ‌ణించాల్సిన అంశాలు..

వ‌య‌సు: ఎంత చిన్న వ‌య‌సులో బీమాను కొనుగోలు చేస్తే, అంత ఎక్కువ‌ ప్ర‌యోజ‌నాలు పొందొచ్చ‌ని చెబుతుంటారు నిపుణులు. కొనుగోలును ఆల‌స్యం చేయ‌డం వ‌ల్ల స‌రైన క‌వ‌రేజ్‌తో కూడిన పాల‌సీని కొనుగోలు చేయ‌లేక‌పోవచ్చు. పైగా ప్రీమియం కూడా ఎక్కువ‌గా ఛార్జ్ చేసే అవ‌కాశం ఉంది. ప్రీమియం నిర్ణ‌యించ‌డంలో వ‌య‌సు ప్ర‌ధాన పాత్ర పోషిస్తుంది. చిన్న వ‌య‌సులో వారికి ప్రీమియం త‌క్కువ‌గా ఉంటుంది. వ‌య‌సు పెరిగే కొద్దీ ప్రీమియం పెరగొచ్చు.

కుటుంబ వైద్య చ‌రిత్ర‌: ఆరోగ్య బీమా ప్రీమియం లెక్కించ‌డంలో పాల‌సీదారుని వైద్య చ‌రిత్ర కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. వ్య‌క్తి రిస్క్ ప్రొఫైల్‌ను అంచ‌నా వేసేందుకు బీమా సంస్థ‌ల‌కు వైద్య చ‌రిత్ర ఉప‌యోగ‌ప‌డుతుంది. క్యాన్స‌ర్‌, ఇత‌ర వంశపారంపర్య వ్యాధులు కుటుంబ వైద్య చ‌రిత్ర‌లో ఉంటే, అటువంటి వారికి ప్రీమియం పెరిగే అవ‌కాశం ఉంది.

జీవన‌శైలి: ఒక వ్య‌క్తి జీవన‌శైలి వారి శారీర‌క, మాన‌సిక ఆరోగ్య స్థితి గురించి చాలా విష‌యాల‌ను చెబుతుంది. కొంద‌రు మ‌హిళ‌లు ఇంటి వ‌ద్ద ఉంటారు.. మ‌రికొందరు ఉద్యోగం చేస్తుంటారు. ఇంకొంత మంది మ‌హిళ‌లు వృత్తి, వ్యాపారాలు చేస్తుంటారు. అంద‌రి జీవన‌శైలి ఒకేలా ఉండ‌దు. నివ‌సిస్తున్న‌ ప్ర‌దేశం, చేస్తున్న ప‌ని, ఆహార‌పు అల‌వాట్లు వంటివి జీవ‌న శైలి వ్యాధుల‌కు కార‌ణమయ్యే అవ‌కాశం ఉంది. అందువ‌ల్ల రిస్క్ ప్రొఫైల్‌ని అంచ‌నా వేయ‌డంలో జీవ‌న‌శైలిని ప‌రిగ‌ణ‌నలోకి తీసుకుంటారు.

జీవిత ద‌శ‌: రొమ్ము క్యాన్సర్, ఆర్థరైటిస్, ఓవేరియన్ పాలీసిస్టోసిస్ వంటివి ప్ర‌త్యేకంగా మహిళల్లో వివిధ జీవిత ద‌శ‌ల్లో క‌నిపించే ఆరోగ్య స‌మ‌స్య‌లు. మ‌హిళ‌ల జీవితంలో కీల‌క ద‌శ అయిన ప్ర‌సూతి స‌మ‌యంలో క‌లిగే వైద్య ఖ‌ర్చుల‌కు బీమా తోడ్పాటునందిస్తుంది. మీ జీవిత ద‌శ, అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు ఆరోగ్య బీమా పాల‌సీని ఎంచుకోవాలి.

మెడిక‌ల్ అసిస్టెన్స్‌: మెడిక‌ల్ అసిస్టెన్స్‌లో హాస్పిటలైజేషన్ ఛార్జీలు, అంబులెన్స్ ఛార్జీలు, గది అద్దె, ప్రీ, పోస్ట్ హాస్పిటల్ కవర్, నగదు రహిత సౌకర్యాలు మొదలైనవి ఉంటాయి. మీ అవ‌స‌రాలను బ‌ట్టి వివిధ రకాల రైడ‌ర్లు ఆరోగ్య బీమా పాల‌సీకి చేర్చి అద‌న‌పు ప్ర‌యోజ‌నాలు పొందొచ్చు.

స‌హ చెల్లింపులు: వైద్య ఖ‌ర్చుల‌ను మీరు, మీ బీమా సంస్థ క‌లిపి చెల్లించ‌డాన్ని ఆరోగ్య‌బీమా సహ చెల్లింపులు అని పిలుస్తారు. అంటే చికిత్స అవ‌స‌ర‌మైన‌ప్పుడు అయిన బిల్లులో కొంత భాగం బీమా చెల్లిస్తే, మిగిలిన‌ భాగం పాల‌సీదారుడు చెల్లించాలి. ఒక‌వేళ సహ చెల్లింపులతో కూడిన పాల‌సీ ఎంచుకుంటే మీరు ఎంత భాగం చెల్లించాల‌నేది తెలుసుకోండి.

వెయిటింగ్ పిరియ‌డ్‌: ఆరోగ్య బీమా పాలసీ తీసుకునే సమయానికి ఉన్న ముందస్తు ఆరోగ్య సమస్యలకు కొన్నాళ్ల‌పాటు వెయిటింగ్ పీరియ‌డ్ ఉంటుంది. అంటే, ఈ స‌మ‌యంలో పాల‌సీ తీసుకున్నా స‌రే బీమా వ‌ర్తించ‌దు. మహిళ‌ల విష‌యంలో ముఖ్యంగా ప్ర‌సూతి ఖ‌ర్చులు చెల్లించే పాల‌సీల‌కు 2 నుంచి 4 సంవ‌త్స‌రాల వ‌ర‌కు వెయిటింగ్ పిరియ‌డ్ ఉండే అవ‌కాశం ఉంది. కాబ‌ట్టి ప్లాన్‌ను కొనుగోలు చేసేటప్పుడు వెయిటింగ్ పిరియ‌డ్‌ను త‌ప్ప‌క తెలుసుకోవాలి.

క్లెయిమ్ సెటిల్‌మెంట్ నిష్పత్తి: అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో బీమా సంస్థ నుంచి ఏ విధంగా ప్ర‌యోజ‌నం పొందాలో తెలుసుకోవాలి. సెటిల్‌మెంట్ ప్రాసెస్ అన్ని బీమా సంస్థ‌ల‌కూ ఒకేలా ఉండ‌దు. త‌క్కువ ప‌త్రాల‌తో వేగంగా ప్రాసెస్ పూర్తి చేయ‌గ‌ల సంస్థ నుంచి పాల‌సీ కొనుగోలు చేయాలి. బీమా సంస్థ‌లు ఎన్ని క్లెయిమ్‌ల‌ను విజ‌య‌వంతంగా సెటిల్‌ చేశాయో చూడండి. క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేషియో 95 శాతం కంటే ఎక్కువ ఉన్న ఆరోగ్య బీమా సంస్థ‌ను ఎంచుకోవ‌డం మంచిది.

ప‌న్ను ప్ర‌యోజ‌నాలు: ఆరోగ్య బీమా పాల‌సీ ఆసుప‌త్రిలో చేరాల్సి వ‌స్తే ఆర్థికంగా అండ‌గా ఉండ‌డంతో పాటు ప‌న్ను ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది. ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం 1961, సెక్ష‌న్ 80డీ కింద ప్రీమియం చెల్లింపుల‌పై మిన‌హాయింపు పొందొచ్చు. మీతో పాటు పిల్లలు, తల్లిదండ్రులు ఇలా అందరికీ ఆరోగ్య బీమా ప్రీమియంలపై గరిష్ఠంగా రూ.1 లక్ష వరకు పన్ను మినహాయింపు పొందడానికి వీలుంటుంది.

చివరగా: ప్రతి స్త్రీ కుటుంబానికి జీవనాధారం కాకపోవచ్చు. అయితే దీనర్థం ఆమెపై ఆధార‌ప‌డిన స‌భ్యులు లేర‌ని కాదు. ప్ర‌స్తుత రోజుల్లో కుటుంబ‌ నిర్వహ‌ణ‌ ఒక పెద్ద బాధ్యత. భార్యాభర్తలు ఇరువురు సంపాదిస్తూ ఈ బాధ్యతను ఎంతో చ‌క్క‌గా నిర్వ‌ర్తిస్తున్నారు. అంటే కుటుంబ స‌భ్యుల బాధ్యత మ‌హిళ‌ల‌పై కూడా ఉంటుంది. అందువల్ల, మహిళలు త‌మ ఆరోగ్యం ప‌ట్ల శ్ర‌ధ్ధ వ‌హించాలి. బీమాను త‌ప్ప‌నిస‌రిగా తీసుకోవాలి. ప్ర‌స్తుతం మార్కెట్‌లో వివిధ రకాల బీమా పాలసీలు అందుబాటులో ఉన్నాయి. మ‌హిళ‌ల కోసం ప్ర‌త్యేక పాల‌సీలు అందిస్తున్నాయి బీమా సంస్థ‌లు. అయితే మీ అవ‌స‌రాలకు అనుగుణంగా త‌క్కువ ఖ‌ర్చుతో ఎక్కువ ప్ర‌యోజ‌నాల‌ను అందించే పాల‌సీల‌ను ఎంచుకోవ‌డం ముఖ్యం. ఏ ర‌క‌మైన పాల‌సీ మీకు అనువుగా ఉంటుందో తెలుసుకుని పాల‌సీని కొనుగోలు చేయాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని