Credit Card: క్రెడిట్‌ కార్డు.. కొత్తగా తీసుకుంటున్నారా?

Credit Card: ఉద్యోగంలో చేరగానే... మొదటి నెల వేతనం రాకముందే క్రెడిట్‌ కార్డును ఇస్తామంటూ బ్యాంకులు ముందుకొస్తుంటాయి. కార్డు వినియోగదారులను ఆకట్టుకునేలా రకరకాల పేర్లతో కొత్త కార్డులనూ అందిస్తున్నాయి.

Updated : 26 May 2023 09:59 IST

ఉద్యోగంలో చేరగానే... మొదటి నెల వేతనం రాకముందే క్రెడిట్‌ కార్డు (Credit Card)ను ఇస్తామంటూ బ్యాంకులు ముందుకొస్తుంటాయి. కార్డు వినియోగదారులను ఆకట్టుకునేలా రకరకాల పేర్లతో కొత్త కార్డులనూ అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తొలిసారి క్రెడిట్‌ కార్డు తీసుకునే వారు ఏయే అంశాలను పరిశీలించాలి.. తెలుసుకుందాం.

న చేతిలో డబ్బు లేకున్నా.. అప్పటికప్పుడు కొనుగోళ్లు చేసేందుకు క్రెడిట్‌ కార్డు (Credit Card) ఉపయోగపడుతుంది. వ్యక్తుల ఆదాయం, క్రెడిట్‌ స్కోరు, రుణ చరిత్ర ఇలాంటివన్నీ క్రెడిట్‌ కార్డు విషయంలో కీలకం. అదే సమయంలో కార్డు వచ్చాక బిల్లులను ఎలా చెల్లిస్తున్నారన్నది క్రెడిట్‌ స్కోరుపై ప్రభావాన్ని చూపిస్తుంది. ఇప్పుడే ఉద్యోగంలో చేరిన వారికి ఎలాంటి రుణాలు ఉండే అవకాశం లేదు. కాబట్టి, క్రెడిట్‌ కార్డు (Credit Card) విషయంలో కొన్ని పరిమితులు ఉంటాయి. కొంతమంది వాయిదాల్లో మొబైల్‌ ఫోన్లు కొనడంలాంటివి చేసి ఉండొచ్చు. వారికి ఇప్పటికే కొంత క్రెడిట్‌ స్కోరుంటుంది. రుణాలు తీసుకొని, మంచి చెల్లింపుల చరిత్ర ఉన్న వారికి క్రెడిట్‌ కార్డు సులభంగానే లభిస్తుంది. క్రెడిట్‌ స్కోరు 750 దాటితే మీరు మంచి ఖాతాదారు కిందే లెక్క. ఆదాయం స్థిరంగా లేనివారు కార్డు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి వారు సాధారణ క్రెడిట్‌ కార్డు బదులు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ ఆధారిత క్రెడిట్‌ కార్డును పరిశీలించాలి.

* మీకు కార్డు ఎందుకు అవసరం? రోజువారీ ఖర్చుల కోసమా? లేదా ఆన్‌లైన్‌ కొనుగోళ్లకు ఉపయోగించుకుంటారా? ముందు నిర్ణయించుకోండి. కార్డు తీసుకునేటప్పుడే మీ అవసరం ఏమిటి? తీసుకుంటున్న కార్డు మీకు ఆ మేరకు ప్రయోజనమేనా అన్నది తెలుసుకోవాలి.

* ఆన్‌లైన్‌లో ఎక్కువగా కొనుగోళ్లు చేస్తుంటే.. అధికంగా రాయితీలను అందిస్తున్న కార్డు ఏదో పరిశీలించండి. కొత్తతరం బ్యాంకులు పలు ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తున్నాయి. క్రెడిట్‌ కార్డుల (Credit Card)నూ తొందరగానే ఇస్తున్నాయి. ఆయా బ్యాంకుల వెబ్‌సైట్లలో వివరాలు చూడండి.

* కార్డు తీసుకున్నప్పుడు ఖర్చు విషయంలో కాస్త ఆచితూచి వ్యవహరించాలి. ఎప్పుడో భవిష్యత్తులో ఉపయోగపడతాయని కొనుగోళ్లు చేయొద్దు. ఇప్పటికిప్పుడు మీకు ఏది అవసరమో వాటినే కొనాలి.

* ఎలక్ట్రానిక్‌ వస్తువులు, ఆహార డెలివరీ సంస్థలు, ఇతర కొన్ని బ్రాండ్లతో ఒప్పందం కుదుర్చుకొని కార్డులు రాయితీలు ఇస్తుంటాయి. ఇవి ఎంత మేరకు మీకు అవసరం అన్నది ముఖ్యం. కార్డు ఉంది కదా అని అనవసరంగా డిస్కౌంట్ల ఉచ్చులో చిక్కుకోవద్దు.

* కార్డు తీసుకునేటప్పుడు బ్యాంకులు ఎలాంటి వార్షిక రుసుము ఉండదు అని చెబుతుంటాయి. కానీ, దీనికి కొన్ని నిబంధనలు వర్తిస్తాయి. ఏడాదిలో నిర్ణీత మొత్తంలో కొనుగోళ్లు చేసినప్పుడు మాత్రమే ఈ ప్రయోజనం అందుతుంది.

* ప్రముఖ బ్రాండ్లతో కలిసి బ్యాంకులు కో-బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డు (Credit Card)లను అందిస్తున్నాయి. మీరు ఆయా బ్రాండ్లను ఎక్కువగా వాడితేనే ఈ తరహా కార్డులతో మీకు ఉపయోగం.

* గడువు తేదీలోపు బిల్లులు చెల్లించినప్పుడే క్రెడిట్‌ కార్డు వల్ల ప్రయోజనం ఉంటుంది. కనీస చెల్లింపు, బిల్లు బాకీ పడటంలాంటి సందర్భాల్లో అధిక వడ్డీని చెల్లించాల్సి వస్తుంది.

* క్రెడిట్‌ కార్డు (Credit Card)ను ఉపయోగించి ఎట్టి పరిస్థితుల్లోనూ నగదు తీసుకోరాదు. దీనిపై వార్షిక వడ్డీ 36-40 శాతం వరకూ విధించే అవకాశం ఉంది.

* మీ దగ్గర ఇప్పటికే క్రెడిట్‌ కార్డుంటే మరీ అవసరమతైనే రెండో కార్డు తీసుకోండి. తక్కువ పరిమితి ఉన్న రెండుమూడు కార్డులకన్నా.. అధిక పరిమితి ఉన్న ఒక కార్డే ఉత్తమం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని