Income tax: మొద‌టి ఇల్లు కొంటున్నారా..ఈ మిన‌హాయింపు మార్చి 31 వరకు మాత్ర‌మే!

ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం సెక్ష‌న్ 80ఈఈఏ ప్ర‌కారం గృహ రుణం వ‌డ్డీ చెల్లింపుల‌పై రూ. 1.5 ల‌క్ష‌ల వ‌ర‌కు మిన‌హాయింపు పొందొచ్చు.

Updated : 10 Mar 2022 14:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గృహ రుణం ద్వారా మొద‌టిసారి ఇల్లు కొనుగోలు చేసేవారికి ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం 1960 సెక్ష‌న్ 80ఈఈఏ కింద ల‌భించే ప‌న్ను ప్ర‌యోజ‌నం ఏప్రిల్ 1, 2022 నుంచి నిలిచిపోనుంది. ‘అఫ‌ర్డ‌బుల్ హౌసింగ్ సెగ్మెంట్‌’లో (స‌ర‌స‌మైన ధ‌ర‌లో) ఇళ్ళ‌ను కొనుగోలు చేసేవారికి స‌హాయ‌ప‌డేందుకు 2019 బ‌డ్జెట్‌లో కేంద్ర ప్ర‌భుత్వం ఈ మిన‌హాయింపును ప్ర‌వేశ‌పెట్టింది. ఆ త‌ర్వాత బ‌డ్జెట్ 2020, 2021 వ‌రుసగా మ‌రో ఏడాది పాటు పొడిగిస్తూ వ‌చ్చింది. కానీ, 2022 బ‌డ్జెట్‌లో పొడిగింపునకు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు. అందువ‌ల్ల మార్చి 31, 2022 నాటికి గృహ రుణం మంజూరు లేఖ పొందిన (గృహ రుణ మొత్తం ఎఫ్‌వై 2023లో పొందిన‌ప్ప‌టికీ) మొద‌టి గృహ కొనుగోలుదారులు మాత్ర‌మే ఈ అద‌న‌పు ప్ర‌యోజ‌నాన్ని క్లెయిమ్ చేసుకోగ‌ల‌ర‌ని, ఆ త‌ర్వాత ఈ ప్ర‌యోజ‌నం వ‌ర్తించ‌క‌పోవ‌చ్చ‌ని.. ప‌న్ను, పెట్టుబ‌డి నిపుణులు చెబుతున్నారు.

సెక్ష‌న్ 80ఈఈఏ కింద ఎప్పుడు క్లెయిమ్ చేసుకోవ‌చ్చు?

ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం సెక్ష‌న్ 80ఈఈఏ ప్ర‌కారం గృహ రుణం వ‌డ్డీ చెల్లింపుల‌పై రూ. 1.50 ల‌క్ష‌ల వ‌ర‌కు మిన‌హాయింపు పొందొచ్చు. గృహ రుణ వ‌డ్డీ చెల్లింపుల‌పై సెక్ష‌న్ 24 (బి) కింద రూ.2 ల‌క్ష‌ల వ‌ర‌కు మిన‌హాయింపు ల‌భిస్తుంది. అయితే ఇక్క‌డ ఒక విష‌యం గుర్తుపెట్టుకోవాలి. ఒకే మొత్తంపై రెండు మిన‌హాయింపుల‌ను క్లెయిమ్ చేయ‌కూడ‌దు. మొద‌టిగా సెక్ష‌న్ 24(బి) క్లెయిమ్ చేసిన త‌ర్వాత మాత్ర‌మే మిగిలిన మొత్తంపై సెక్ష‌న్ 80ఈఈఏను క్లెయిమ్ చేసుకోవ‌చ్చు.

ఉదాహ‌ర‌ణ‌కి, గృహ రుణ వ‌డ్డీ కింద ఏడాదికి రూ.3.50 ల‌క్ష‌ల చెల్లిస్తున్నారనుకుందాం. అందులో రూ.2 ల‌క్ష‌లు సెక్ష‌న్ 24(బి) ప్ర‌కారం, రూ.1.50 ల‌క్ష‌లు సెక్ష‌న్ 80ఈఈఏ కింద క్లెయిమ్ చేసుకోవ‌చ్చు. ఒక‌వేళ గృహ రుణ వ‌డ్డీ కింద రూ. 1.50 ల‌క్ష‌లు వ‌డ్డీ చెల్లిస్తుంటే ఏదో ఒక సెక్ష‌న్ కింద మాత్ర‌మే క్లెయిమ్ చేసుకోవాలి. రెండింటి కింద క్లెయిమ్ చేయ‌కూడ‌దు. సెక్ష‌న్ 24(బి) కింద మొద‌ట‌గా క్లెయిమ్ చేసుకుని, మిగిలిన మొత్తంపై సెక్ష‌న్ 80ఈఈఏ ప్ర‌కారం క్లెయిమ్ చేసుకోవాల‌ని నిపుణులు సూచిస్తున్నారు.

ఎవ‌రు అర్హులు..

* ఏప్రిల్ 1, 2019- మార్చి 31, 2022 మ‌ధ్య‌లో గృహ రుణం మంజూరై ఉండాలి.

* ఆస్తి స్టాంప్ డ్యూటీ విలువ రూ.45 ల‌క్ష‌ల వ‌ర‌కు ఉండొచ్చు. (రూ.50 ల‌క్ష‌ల‌తో ఇల్లు కొనుగోలు చేసి..రూ.35 ల‌క్ష‌ల గృహ రుణం తీసుకుంటే కూడా సెక్ష‌న్ 80ఈఈఏ కింద మిన‌హాయింపు వ‌ర్తించ‌దు)

* మొద‌టిసారి ఇల్లు కొనుగోలు చేసిన పన్ను చెల్లిందారుల‌కు మాత్ర‌మే ఇది వ‌ర్తిస్తుంది.

* రుణం మంజూరు చేసిన తేదీ నాటికి ప‌న్ను చెల్లింపుదారుని పేరుపై ఎటువంటి నివాస గృహ ఆస్తి ఉండ‌కూడ‌దు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని