Pig butchering: పిగ్‌ బుచరింగ్‌.. కసాయిలు చేసే ఓ ‘రొమాంటిక్‌’ క్రిప్టో మోసం

డిజిటల్‌ లావాదేవీలు, ఆన్‌లైన్‌ చెల్లింపులు పెరుగుతున్న కొద్దీ కొత్త కొత్త మోసాలు పుట్టుకొస్తున్నాయి. ఇప్పటి వరకు హ్యాకింగ్ ద్వారా మన ఖాతాల్లోకి చొరబడ్డ దుండగులు ఇప్పుడైతే ఏకంగా మనతోనే మనల్ని మోసం చేయిస్తున్నారు.....

Published : 20 Feb 2022 18:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: డిజిటల్‌ లావాదేవీలు, ఆన్‌లైన్‌ చెల్లింపులు పెరుగుతున్న కొద్దీ కొత్త కొత్త మోసాలు పుట్టుకొస్తున్నాయి. ఇప్పటి వరకు హ్యాకింగ్ ద్వారా మన ఖాతాల్లోకి చొరబడ్డ దుండగులు ఇప్పుడైతే ఏకంగా మనతోనే మనల్ని మోసం చేయిస్తున్నారు. ముఖ్యంగా క్రిప్టో కరెన్సీపై ప్రజలకు పెరుగుతున్న మోజును సొమ్ము చేసుకుంటున్నారు. ‘పిగ్‌ బుచరింగ్ (Pig Butchering)‌’ అనే కొత్తరకం మోసం ద్వారా ఔత్సాహిక మదుపర్లను బురిడీ కొట్టిస్తున్నారు. ‘పిగ్‌ బుచర్‌’ అంటే పంది కసాయి అని అర్థం. ఈ రకం మోసానికి పాల్పడుతున్న దుండగులే ఈ పదాన్నీ సృష్టించినట్లు సమాచారం. అంటే బాధితుల్ని పందులుగా.. తమని తాము కసాయి వాళ్లుగా పేర్కొంటున్నారన్నమాట!

గత నెల అమెరికాకు చెందిన ఓ వ్యక్తి తన జీవితం మొత్తం కూడబెట్టుకున్న రూ.1.78 కోట్లను చేతులారా దొంగల చేతిలో పెట్టాడు. తాను ‘పిగ్‌ బుచరింగ్‌’ మోసానికి గురవుతున్నట్లు తెలుసుకోలేక కష్టపడి పొదుపు చేసుకున్న డబ్బును చేజేతులా పోగొట్టుకున్నాడు. గత ఏడాది పిగ్‌ బుచరింగ్‌ ద్వారా సింగపూర్‌లో ఏకంగా 190.9 మిలియన్ సింగపూర్‌ డాలర్ల (రూ.1059.33 కోట్లు) మోసం జరిగినట్లు ఓ నివేదిక వెల్లడించింది. 2019లో జరిగిన 36.9 మిలియన్‌ సింగపూర్‌ డాలర్లతో పోలిస్తే ఇది ఐదు రెట్లు. ఈ కొత్తతరం మోసం చైనాలోనే పురుడుపోసుకున్నట్లు సైబర్‌ నిపుణులు గుర్తించారు.

క్రిప్టోకరెన్సీ (Crypto Currency) పై ఇప్పటి వరకు నియంత్రణ లేదు. మరోవైపు దీని కింద జరుగుతున్న లావాదేవీలను పర్యవేక్షించేందుకు ఎటువంటి సంస్థ అందుబాటులో లేదు. ఫలితంగా దీనివల్ల మోసపోతున్న వారికి అందే సాయం కూడా తక్కువే అని చెప్పాలి. క్రిప్టో కరెన్సీ వ్యవహారాలు చాలా గోప్యంగా జరుగుతుంటాయి. కాబట్టి మోసగాళ్లను గుర్తించడం కూడా చాలా కష్టం. ఒకవేళ క్రిప్టోలో మదుపు చేయాలనుకున్నా.. ఇప్పటికే చేస్తున్నా.. ఈ తరహా మోసాలకు గురి కాకుండా జాగ్రత్త పడాలి.

ఈ మోసం ఎలా జరుగుతుందో చూద్దాం...

సందేశంతో తొలి అడుగు..

‘మీరు పెంపుడు జంతువుల సంరక్షణ కేంద్రంలో పనిచేసేవారా? నేను ఓ శునకాన్ని తీసుకోవాలనుకుంటున్నాను’ అని ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి అలెక్స్‌ (బాధితుడు)కి సందేశం వచ్చింది. రాంగ్‌ నెంబర్‌ అని చెప్పిన అలెక్స్‌.. ఆయనకున్న జ్ఞానంతో కొన్ని సలహాలు ఇచ్చాడు. అలా మొదలైన వారి పరిచయం రోజువారీ చాటింగ్‌ దశకు చేరుకుంది. సాన్నిహిత్యం పేరిట ఇక్కడొక కొత్తతరం క్రిప్టో స్కామ్‌కి నాంది పడింది. పిగ్‌ బుచరింగ్‌ డ్రామాకు ఇదే తొలి అడుగు.

గాఢమైన బంధం మధ్యలో క్రిప్టో...

బంధం కొంచెం గాఢంగా మారిన తర్వాత మాటల మధ్యలో క్రిప్టో కరెన్సీ మదుపు గురించి మాట్లాడతారు. తర్వాతి బిట్‌కాయిన్‌గా ఇదే మారబోతోందంటూ ఓ క్రిప్టోకరెన్సీ పేరు చెబుతారు. తనకు వీటి గురించి పెద్దగా తెలియదని అలెక్స్‌ చెప్పినప్పటికీ.. తాను ఇంత సంపాదించానని.. ఈరోజు ఈ కాయిన్‌ బాగా రాణించిందంటూ పదే పదే క్రిప్టోల గురించి మాట్లాతుంటారు. అలాగే అలెక్స్‌ను ప్రభావితం చేసి ఎలాగోలా క్రిపోలో మదుపు చేసేలా ప్రోత్సహిస్తారు. ఇది మోసంలో రెండో దశ.

నమ్మకంతో పెట్టుబడి పెట్టించి...

ఇక తర్వాతి దశలో భాగంగా క్రిప్టో ట్రేడింగ్‌కు కావాల్సిన అన్ని రకాల సాయం చేస్తారు. పైగా అలెక్స్‌తో పెట్టుబడి పెట్టించి లాభాలు వచ్చే వరకు సమయం కేటాయిస్తారు. ఈ క్రమంలో అలెక్స్‌కు లాభాలు కూడా వస్తాయి. దీంతో తన పెట్టుబడులను క్రమంగా పెంచుకుంటూ పోతాడు. కానీ, అకస్మాత్తుగా మోసగాళ్లు ఓ కొత్త ప్రతిపాదనతో ముందుకు వస్తారు. ఇది పిగ్‌ బుచరింగ్‌లో మూడో దశ.

తర్వాతి బిట్‌కాయిన్‌ ఇదే అంటూ...

తాను ఓ కొత్త కరెన్సీని గుర్తించినట్లు త్వరలో అదే  మరో బిట్‌కాయిన్‌గా మారబోతోందంటూ అలెక్స్‌ను నమ్మిస్తారు. అయితే, తనకు మాత్రమే ఓ కోడ్‌ తెలుసని ఆ ఖాతా ద్వారానే మదుపు చేయగలమని చెబుతారు. నమ్మించడం కోసం తన సొంత డబ్బుని కొంత అలెక్స్‌కి బదిలీ చేస్తారు. ఈ డబ్బుతోనే ట్రేడింగ్‌ చేయాలని కోడ్‌ను అలెక్స్‌కు చెబుతారు. దాంట్లో వచ్చిన లాభాల్ని తీసుకొని తన సొమ్మును తిరిగివ్వమని చెబుతారు. ఒక రెండు, మూడు లావాదేవీలు జరిగిన తర్వాత అలెక్స్‌కు పూర్తి నమ్మకం వచ్చేస్తుంది. అప్పటికే మోసగాళ్లు ఇచ్చిన సొమ్మును అలెక్స్‌ వారికి తిరిగిచ్చేస్తాడు. అసలు అవతలి వ్యక్తి తనని మోసం చేస్తోందన్న అనుమానం కూడా అలెక్స్‌కు రాదు.

వెంటనే లాభాలను తీసేసుకోండని...

తర్వాత కొన్ని రోజులకు త్వరలో ఈ కరెన్సీ పబ్లిక్‌లోకి రాబోతోందని.. వెంటనే లాభాలను స్వీకరించాలని అలెక్స్‌కి చెబుతారు. అయితే, ఖాతాలో ఉన్న తన డబ్బును తీసుకునేందుకు లక్ష డాలర్లు జమ చేయాల్సి ఉంటుందని.. అప్పుడే విత్‌డ్రా ఖాతా అన్‌లాక్‌ అవుతుందని నమ్మిస్తారు. అంతలోపు తన ఖాతాలో చాలా డబ్బు జమైనట్లు.. అడిగిన మొత్తం డిపాజిట్‌ చేసి విత్‌డ్రా చేసుకున్నట్లు కొన్ని వెబ్‌సైట్‌ స్క్రీన్‌షాట్లను చూపిస్తారు. ఆ మాయలో పడి అలెక్స్‌ కూడా లక్ష డాలర్లు జమ చేశాడు. కానీ, అన్‌లాక్‌ కాలేదు. అడిగితే.. వెబ్‌సైట్‌లో నిబంధనలు మారాయని.. మరికొంత సొమ్మును జమచేయాల్సి ఉంటుందని నమ్మిస్తారు. అలా చేసినా అకౌంట్‌ అన్‌లాక్‌ కాకపోవడంతో అసలు విషయం అలెక్స్‌కు బోధపడింది. కొద్దిరోజుల్లోనే వెబ్‌సైట్‌ కనబడకుండా పోయింది.

అంతా మోసగాళ్ల చేతిలోనే...

పిగ్‌ బుచరింగ్‌లో వెబ్‌సైట్‌ను పూర్తిగా మోసగాళ్లే ఆపరేట్‌ చేస్తారు. వారికి అనుగుణంగా.. మనల్ని నమ్మించేలా వాటిని నిర్వహిస్తుంటారు. మనం చేస్తున్న మదుపు క్రిప్టోలోకే వెళ్తోందని మనమనుకుంటాం. కానీ, నిజానికి అది మోసగాళ్ల ఖాతాలోకి వెళుతుంది. స్నేహం లేదా రొమాంటిక్‌ రిలేషన్‌షిప్‌ ద్వారా పిగ్‌ బుచరింగ్‌ ప్రారంభమవుతంది. తర్వాత క్రిప్టో కరెన్సీ, మదుపు, లాభాల గురించిన ప్రస్తావన వస్తుంది. అలా పైన చెప్పిన మోసం జరిగిపోతుంది. ఒకవేళ మీరెవరైనా.. క్రిప్టోలో మదుపు చేయాలనుకున్నా.. ఇప్పటికే చేస్తున్నా ఇలాంటి మోసాల నుంచి జాగ్రత్తగా ఉండాల్సిన అసవరం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని