Updated : 15 Jun 2022 14:33 IST

Car loan: కారు లోన్‌ తీసుకుంటున్నారా? ఏమేం పరిశీలించాలి..?

ఇంటర్నెట్‌ డెస్క్‌: కార్లు కొనుగోలు చేసేవారిలో స‌గానికిపైగా మ‌ధ్య‌, ఎగువ మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గీయులే ఉంటున్నారు. అన్ని ఆదాయ వ‌ర్గాల‌కూ స‌రిప‌డే కారు మోడ‌ల్స్ మార్కెట్‌లో అందుబాటులో ఉండ‌టం వల్ల కూడా కారు కొనుగోలుకు ఆసక్తి చూపేవారు ఎక్కువ‌య్యారు. ముగ్గురు, న‌లుగురు ఉండే కుటుంబం మోటార్ వెహిక‌ల్‌పై క‌లిసి ప్ర‌యాణం చేయ‌లేకపోవడం, వాయు కాలుష్యంతో ఇబ్బంది పడేవారు కారు కొనుగోలుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ముఖ్యంగా కారు కొనుగోలు చేసేవారు బ్యాంకు లోన్‌ తీసుకోవడం సర్వసాధారణమైపోయింది. మీ క్రెడిట్ స్కోర్‌, ఆదాయం అర్హ‌త ప్ర‌మాణాల‌కు అనుగుణంగా ఉంటే కొత్త కారుకు రుణం ల‌భించ‌డం చాలా సులువు. కాబట్టి ఒకవేళ మీరు కారు రుణం తీసుకోవాలనుకుంటే ముందుగా ఈ విషయాలు పరిశీలించండి.. 

వ‌డ్డీ రేటు: కారు రుణంపై ప్ర‌ముఖ బ్యాంకుల వ‌డ్డీ రేట్లు 7% నుంచి మొద‌ల‌వుతున్నాయి. కానీ కారు రుణంపై వ‌డ్డీ మీ క్రెడిట్ స్కోర్‌, ఆదాయం, రుణ కాల వ్య‌వ‌ధి, కారు మోడ‌ల్‌, డౌన్ పేమెంట్ మొద‌లైన‌వాటి మీద ఆధార‌ప‌డి ఉంటుంది. మీరు అతి త‌క్కువ వ‌డ్డీ రేట్లకు రుణం పొందాల‌నుకుంటే అందుబాటులో ఉన్న అన్ని కారు రుణ వ‌డ్డీ రేట్ల‌ను ఆన్‌లైన్‌లో త‌నిఖీ చేయాలి. బ్యాంకులు చ‌ల‌న‌, స్థిర వ‌డ్డీ రేట్ల ఎంపిక‌ల‌తో కారు రుణాల‌ను అందిస్తాయి. మార్కెట్లో పెరుగుతున్న వ‌డ్డీ రేట్ల ట్రెండ్‌ను బ‌ట్టి స్థిర వ‌డ్డీ రేటు రుణాన్ని ఎంచుకోవ‌చ్చు.

మీ క్రెడిట్ స్కోర్ చూసుకోండి: కారు రుణం కోసం దర‌ఖాస్తు చేసే ముందు మీ క్రెడిట్ స్కోర్ చూసుకోవ‌డం మ‌రిచిపోవ‌ద్దు. అధిక క్రెడిట్ స్కోర్ క‌లిగి ఉంటే.. అది ఆక‌ర్ష‌ణీయ‌మైన వ‌డ్డీ రేటుతో కారు రుణాన్ని పొంద‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. మీ క్రెడిట్ స్కోర్ స‌రైన స్థాయిలో లేకుంటే మీ స్కోర్‌ను మెరుగుప‌ర‌చుకోవ‌డానికి దిద్దుబాటు చ‌ర్య‌లు తీసుకోవాలి. మీ ప్ర‌స్తుత రుణాల‌ను గ‌డువు తేదీలోగా చెల్లించ‌డం, మీ క్రెడిట్ వినియోగ నిష్ప‌త్తిని త‌గ్గించుకోవ‌డం లాంటి చ‌ర్య‌లు మీ క్రెడిట్ స్కోర్‌ను మెరుగుప‌ర‌చ‌డంలో స‌హాయ‌ప‌డతాయి. మీ క్రెడిట్ స్కోర్ స‌రైన స్థాయికి మెరుగుప‌డిన త‌ర్వాత రుణం కోసం దర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. మెరుగైన క్రెడిట్ స్కోర్ అంటే 750 లేదా అంత‌కంటే ఎక్కువ ఉండాలి.

రుణానికి స‌రైన కాల వ్య‌వ‌ధి: త‌క్కువ ఈఎంఐ మొత్తాల‌ను చెల్లించాల‌నుకుంటే ఎక్కువ రుణ కాల వ్య‌వ‌ధిని ఎంచుకోవచ్చు. అలా చేస్తే ఎక్కువ వ‌డ్డీని చెల్లించాల్సి ఉంటుంది. మీరు ఎక్కువ మొత్తాన్ని ఈఎంఐ రూపంలో చెల్లిస్తే త‌క్కువ కాల వ్య‌వ‌ధిని ఎంచుకోవ‌చ్చు. సాధార‌ణంగా బ్యాంకులు కారు రుణాన్ని తిరిగి చెల్లించ‌డానికి 7 సంవ‌త్స‌రాల వ‌ర‌కు అనుమ‌తిస్తాయి.

రుణంపై వ‌ర్తించే రుసుములు: కొన్ని బ్యాంకులు కారు రుణంపై త‌క్కువ వడ్డీని వ‌సూలు చేస్తాయి. కానీ అదే స‌మ‌యంలో వారు అధిక ప్రాసెసింగ్ రుసుములు, కారు రుణంతో అనుసంధానం ఉన్న ఇత‌ర రుసుములు వ‌సూలు చేయొచ్చు. కాబ‌ట్టి త‌క్కువ వ‌డ్డీ రేటుకు కారు రుణాన్ని ఎంచుకోవ‌డం ద్వారా మీరు ఆదా చేసే దానికంటే ఎక్కువ రుసుములు చెల్లించాల్సి ఉంటుంది. కాబ‌ట్టి త‌క్కువ వ‌డ్డీ రేటుతో పాటు తక్కువ ఛార్జీలు విధించే బ్యాంకుల‌ను ఎంచుకోవాలి.

తిరిగి చెల్లింపు సౌల‌భ్యం: కారు రుణాన్ని కాల‌ప‌రిమితి కంటే ముందుగా చెల్లించాల‌నుకున్నా, ముంద‌స్తుగా రుణ ఖాతాను మూసివేయాల‌నుకున్నా మీకు రుణాన్ని ఇచ్చిన బ్యాంకు ప్రీపేమెంట్ రుసుముల‌ను విధించొచ్చు. బ్యాంకును ఎంచుకున్న‌ప్పుడు వారు ఏదైనా ముంద‌స్తు చెల్లింపు లేదా ప్రీ-క్లోజ‌ర్ జ‌రిమానాల‌ను విధిస్తున్నారో, లేదో ముందుగానే చూసుకోవాలి. కారు రుణ ముంద‌స్తు చెల్లింపుపై అతి త‌క్కువ జ‌రిమానాను వ‌సూలు చేసే బ్యాంకులో రుణం తీసుకోవ‌డం మంచిది.

బ్యాంకు సేవ‌లు, ప్రాసెసింగ్ స‌మ‌యం: క‌నీస డాక్యుమెంటేష‌న్‌తో కారు రుణం కోసం దర‌ఖాస్తు చేయ‌డం సుల‌భం అవుతుంది. మీరు మీ రుణ వివ‌రాల‌ను ఆన్‌లైన్‌లో యాక్సెస్ చేయ‌గ‌ల‌గాలి. మీ రుణ ఖాతాకు ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవ‌లు ఉండాలి. కారు రుణం కోసం దర‌ఖాస్తు చేయాల‌ని ఆలోచ‌న చేసిన‌ప్పుడు ఇవ‌న్నీ ముఖ్య‌మైన పాత్ర పోషిస్తాయి. కొన్ని బ్యాంకులు  కొన్ని నిమిషాల్లో రుణ ప్రాసెస్‌ను పూర్తి చేస్తాయి. మ‌రికొన్ని బ్యాంకులు రుణాన్ని మంజూరు చేయ‌డానికి రోజులు ప‌ట్ట‌వ‌చ్చు. ఖాతా స్టేట్‌మెంట్‌లు, ఆన్‌లైన్ బ్యాంకింగ్ వంటి సౌక‌ర్యాల వంటి సేవ‌ల కోసం మీకు ఎప్ప‌టిక‌ప్పుడు బ్యాంకు స‌హ‌కారం అవ‌స‌రం. రుణం చెల్లించ‌డానికి చాలా సంవ‌త్స‌రాలు ప‌డుతుంది. అన్ని ఏళ్లు వీలైనంత బ్యాంకు స‌హ‌కారంతో ముందుకు వెళ్లాలి. కాబ‌ట్టి మీకు తోడ్పాటు అందించే బ్యాంకుతోనే క‌ల‌వాలి.

రుణ మొత్తం అర్హ‌త‌, డౌన్ పేమెంట్: రుణ అర్హ‌త‌, డౌన్ పేమెంట్ (రుణ మొత్తంలో మీరు క‌ట్టాల్సిన సొమ్ములు) బ్యాంకు బ్యాంకుకి మారొచ్చు. మీకు సౌక‌ర్య‌వంతంగా ఉండే డౌన్ పేమెంట్‌ను స్వీక‌రించే బ్యాంకును ఎంచుకోండి. సుల‌భంగా పాటించే అర్హ‌త‌, నిబంధ‌న‌ల‌ను చూసుకోండి. కొన్ని బ్యాంకులు కొన్ని సంద‌ర్భాల్లో కారు ధ‌ర‌లో 100% రుణాన్ని ఇవ్వ‌వ‌చ్చు. మ‌రికొన్ని చాలా త‌క్కువ రుణాన్ని ఇవ్వొచ్చు.

రుణ ఒప్పంద డాక్యుమెంట్‌ను చ‌ద‌వండి: మీరు రుణ దర‌ఖాస్తు చేసిన‌ప్పుడు కారు రుణం చాలా ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపించ‌వ‌చ్చు. కానీ త‌ర్వాత స‌మ‌స్య‌ల్లో ఇరుక్కోవ‌చ్చు. మీరు అలాంటి ప‌రిస్థితిని నివారించాల‌నుకుంటే రుణ ఒప్పందానికి సంబంధించిన డాక్యుమెంట్‌ని జాగ్ర‌త్త‌గా చ‌ద‌వాలి. బ్యాంకులు తర‌చుగా వ‌డ్డీ రేటును స‌వ‌రిస్తాయి. మీ రుణానికి వ‌ర్తించే ఛార్జీలు ఏమిటనేవి ముందుగానే డాక్యుమెంట్‌లో ప‌రిశీలించుకోవాలి.

కారు రుణాల‌కి ప్ర‌త్యామ్నాయం: కొన్నిసార్లు వ్య‌క్తులు, బ్యాంకుల ద్వారా కారు రుణ అర్హ‌త ప్ర‌మాణాల‌ను అందుకోవ‌డంలో విఫ‌ల‌మ‌వ్వొచ్చు. అటువంటి వారు కారు కొనుగోలు కోసం డ‌బ్బును ఏర్పాటు చేసుకోవ‌డానికి సెక్యూరిటీల‌పై రుణాలు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, బంగారంపై రుణాలు వంటి వారి అవ‌కాశాల‌ను బట్టి నిర్ణ‌యాలు తీసుకోవ‌చ్చు.

కారు డీల‌ర్లు, బ్యాంక్‌ల‌తో రుణ ఒప్పందాలు: మీరు కారు రుణాన్ని ఖ‌రారు చేసే ముందు కారు డీల‌ర్‌కు ఏదైనా బ్యాంకుల‌తో వినియోగ‌దారుల రుణ ఒప్పందాలు ఉంటే ఆయా కారు డీల‌ర్ల వ‌ద్దే వాక‌బు చేయండి. కారు డీల‌ర్లు, బ్యాంకులు త‌ర‌చుగా రుణాల‌కు సంబంధించి భాగ‌స్వామ్య ఒప్పందాలు చేసుకుంటాయి. ఇందులో వారు నిర్దిష్ట కారు మోడ‌ళ్ల కోసం ఆక‌ర్ష‌ణీయ‌మైన వ‌డ్డీ రేట్లు, సుల‌భ‌మైన నిబంధ‌న‌ల‌తో రుణాల‌ను అందిస్తారు. అటువంటి ఏర్పాటు ఉంటే మీరు త‌క్కువ వ‌డ్డీ రేటు, సున్నా ప్రాసెసింగ్ రుసుములు మొద‌లైన ప్ర‌యోజ‌నాల‌ను పొందొచ్చు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని