Bakingo: రూ.2లక్షలతో ప్రారంభించి రూ.75కోట్ల టర్నోవర్‌.. బేకరీ వ్యాపారంలో ముగ్గురు మిత్రుల విజయమిది!

ఆన్‌లైన్‌ బేకరి వ్యాపారం ఆ ముగ్గురు మిత్రులకు కోట్లు కుమ్మరిస్తోంది. కేవలం రూ.2 లక్షలతో ప్రారంభించిన తమ వ్యాపారాన్ని అంచెలంచెలుగా విస్తరించుకుంటూపోతూ..

Updated : 01 Sep 2022 10:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆన్‌లైన్‌ బేకరీ వ్యాపారం ఆ ముగ్గురు మిత్రులకు కోట్లు కుమ్మరిస్తోంది. కేవలం రూ.2 లక్షలతో ప్రారంభించిన తమ వ్యాపారాన్ని అంచెలంచెలుగా విస్తరించుకుంటూపోతూ ఇప్పుడు రూ.75కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నారు. గురుగ్రామ్‌లో మొదలైన వారి వ్యాపారం ఇప్పుడు అనేక నగరాలకు విస్తరించి విజయవంతంగా ముందుకు సాగుతోంది. దిల్లీకి చెందిన హిమాన్షు చావ్లా శ్రేయ్‌ సెహ్‌గల్‌, సుమన్‌ పాత్రా ఈ ముగ్గురు కళాశాల మిత్రులు. నేతాజీ సుభాష్‌ యూనివర్సిటీలో విద్యనభ్యసించారు. 2006, 2007లో చదువు ముగిశాక కొన్నేళ్లపాటు ప్రైవేటు ఉద్యోగాలు చేశారు.

అయితే ఏదైనా సొంత వ్యాపారం ప్రారంభించాలని ఎప్పటి నుంచో భావించే ఈ మిత్రులు.. 2010లో రూ.2 లక్షలతో పుష్పగుచ్చాల వ్యాపారం మొదలుపెట్టారు. వాటితోపాటు కేకులను కూడా ఆన్‌లైన్‌లో విక్రయించేవారు. గురుగ్రామ్‌ వేదికగా మొదలుపెట్టిన ఈ బిజినెస్‌లో మంచి లాభాలే వచ్చాయని వ్యవస్థాపకుడు సుమన్‌ పేర్కొన్నారు. డెలివరీ, ఇతర పనులకు మొదట ఒకేఒక వ్యక్తిని నియమించుకున్నామని.. ప్రేమికుల దినోత్సవం లాంటి ప్రత్యేక రోజుల్లో సహ వ్యవస్థాపకులుగా ఉన్న హిమాన్షు, శ్రేయ్‌ కూడా డెలివరీలకు వెళ్లేవారంటూ సుమన్‌ చెప్పుకొచ్చారు. కొద్దికాలంలోనే మంచి లాభాలను గడించామని, అప్పుడే తమ వ్యాపారాన్ని మరింత విస్తరించాలని నిర్ణయించుకున్నట్లు ఆయన వెల్లడించారు.

ఈ ముగ్గురు కలిసి 2016లో కొత్త కంపెనీ కింద బేకింగో(Bakingo) పేరుతో ప్రత్యేక బ్రాండ్‌గా బేకరీ వ్యాపారాన్ని ప్రారంభించారు. గతంలో ఎలాగైతే మంచి రుచితోపాటు తాజా కేకులను విక్రయించేవారో.. అదే రకంగా భారీగా అమ్మడం మొదలుపెట్టారు. హైదరాబాద్‌ సహా పలు నగరాలకు తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. దిల్లీ, కోల్‌కతా, బెంగళూరు లాంటి పెద్ద నగరాల్లోనే కాదు.. మొహాలీ, సూరత్‌, పానిపట్ వంటి చిన్న నగరాల్లోనూ ఉత్తమ సేవలందిస్తున్నారు.

ఈ సంస్థకు చెందిన 30శాతం విక్రయాలు Bakingo వెబ్‌సైట్‌ నుంచి జరుగుతుండగా.. 70శాతం అమ్మకాలు స్విగ్గీ, జొమాటో లాంటి ఫుడ్‌ డెలివరీ యాప్‌ల దారా జరుగుతున్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరాన్ని Bakingo రూ.75 కోట్ల టర్నోవర్‌తో ముగించింది. 

ఈ సంస్థ ప్రస్తుతం 500 మందికిపైగా ఉద్యోగులను కలిగి ఉంది. బేకింగో ఈ సంవత్సరం దిల్లీలో తన మొదటి ఆఫ్‌లైన్ అవుట్‌లెట్‌ను ప్రారంభించి మరో మైలురాయిని అందుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని