Income Tax Rules: జులై 1 నుంచి అమ‌ల్లోకి రాబోతున్న 3 ప‌న్ను నియ‌మాలు..

జులై 1,2022 నుంచి పాన్ - ఆధార్ అనుసంధానం కోసం రూ. 1000 చెల్లించాలి.

Updated : 30 Jul 2022 16:41 IST


ఇంటర్నెట్‌ డెస్క్‌: జులై 1 నుంచి ఆర్థిక సంవ‌త్స‌రం (2022-23) రెండో త్రైమాసికం ప్రారంభం కాబోతుంది. ఆదాయ‌పు ప‌న్నుకి సంబంధించి బ‌డ్జెట్ 2022లో ప్ర‌వేశ‌పెట్టిన కొన్ని నియ‌మాలు ఈ తేదీ నుంచే అమ‌ల్లోకి రాబోతున్నాయి. ప‌న్ను చెల్లింపుదారులు ఈ నియామ‌ల గురించి తెలుసుకోవ‌డం మంచిది. అవేంటో ఇప్పుడు చూద్దాం..

1. పాన్‌- ఆధార్ ఫీజు రెట్టింపు: ఆదాయ‌పు ప‌న్ను నియ‌మాల ప్ర‌కారం చెల్లింపుదారులు త‌మ పాన్ నంబ‌రును ఆధార్‌తో త‌ప్ప‌నిస‌రిగా అనుసంధానించాలి. ఒక వేళ ఇప్ప‌టి వ‌ర‌కు అనుసంధానించ‌క‌పోతే ఈ రోజే ఆ ప‌ని పూర్తి చేయండి. ఇప్పుడైతే రూ.500తో అనుసంధాన ప్ర‌క్రియ‌ను పూర్తిచేయ‌వ‌చ్చు. రేప‌టి నుంచి ఈ ఫీజు రెట్టింపు కానుంది. 2022 జులై 1 నుంచి రూ.1000 చెల్లించి పాన్‌ను ఆధార్‌తో అనుసంధానించుకోవాల్సి ఉంటుంది. పాన్‌-ఆధార్ అనుసంధాన గ‌డువు 2023 మార్చి 31తో ముగుస్తుంది. ఈ లోపు లింక్ చేయ‌క‌పోతే ఆ పాన్ కార్డులు ప‌నిచేయ‌వు. 

2. క్రిప్టో క‌రెన్సీపై టీడీఎస్‌: ప్ర‌భుత్వం క్రిప్టో క‌రెన్సీని 2022 బ‌డ్జెట్‌లో 30 శాతం ప‌న్ను ప‌రిధిలోకి తీసుకొచ్చింది. అదేవిధంగా రూ.10 వేల‌కి మించిన‌ అన్ని ‘వర్చువ‌ల్ డిజిటిల్ అసెట్ (వీడీఏ)' లావాదేవీల‌పై (క్రిప్టో క‌రెన్సీలు, నాన్-ఫంజిబుల్ టోకెన్స్ (ఎన్ఎఫ్‌టీలు)ల‌తో స‌హా) 1 శాతం టీడీఎస్ (మూలం వ‌ద్ద ప‌న్ను)ను ప్ర‌తిపాదించారు. ఇది 2022 జులై 1 నుంచి అమ‌లులోకి రానుంది. ఇక్క‌డ గ‌మ‌నించవ‌ల‌సిన విష‌యం ఏమిటంటే క్రిప్టో క‌రెన్సీ లావాదేవీలు జ‌రిపిన‌ప్పుడు లాభ, న‌ష్టాల‌తో సంబంధం లేకుండా టీడీఎస్ డిడ‌క్ట్ అవుతుంది.

3. సోష‌ల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, డాక్ట‌ర్ల‌కు కొత్త టీడీఎస్ రూల్‌: యూనియ‌న్ బ‌డ్జెట్ 2022లో వైద్యులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ల.. సేల్స్ ప్రమోషన్ ద్వారా పొందే ప్ర‌యోజ‌నాల‌పై 10 శాతం టీడీఎస్‌ని ప్రతిపాదించారు. ఇందుకోసం ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం 1961లో కొత్త సెక్ష‌న్ 194Rని ప్ర‌వేశ‌పెట్టారు. అయితే, ఒక ఆర్థిక సంవ‌త్స‌రంలో సేల్స్ ప్ర‌మోష‌న్స్ ద్వారా పొందిన వ‌స్తువుల విలువ‌ రూ.20 వేలు లేదా అంత‌కంటే ఎక్కువ ఉన్న‌ప్పుడు మాత్ర‌మే టీడీఎస్ వ‌ర్తిస్తుంది.

ఒక ప్రైవేట్ వైద్యుడు మెడిసిన్స్‌ త‌యారు చేసే సంస్థ నుంచి శాంపిల్స్‌ను స్వీకరిస్తున్నట్లయితే, అటువంటి అన్ని శాంపిల్ వ‌స్తువుల‌ విలువ‌ ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.20 వేల‌కు మించి ఉంటే, దానిపై 10 శాతం టీడీఎస్ వ‌ర్తిస్తుంది. ప్రైవేట్‌ ఆసుపత్రిలో డాక్టర్ ఉద్యోగం చేస్తుంటే.. 10 శాతం టీడీఎస్ విధిస్తారు. ఇది ప్ర‌భుత్వ సంస్థ‌ల‌కు వ‌ర్తించ‌దు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు