Car Loan: కారు కొనేందుకు ప్లాన్‌ చేస్తున్నారా? ముుందు ఈ రూల్‌ గురించి తెలుసుకోండి..

డౌన్ పేమెంట్‌ను 1 నుంచి 3 ఏళ్ల స్వ‌ల్ప‌కాలిక ల‌క్ష్యంగా ఏర్పాటు చేసుకుని త‌గిన పెట్టుబ‌డి మార్గం ద్వారా డ‌బ్బు స‌మ‌కూర్చుకోవ‌చ్చు. 

Published : 24 Jun 2022 15:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బ్యాంకులు తక్కువ వడ్డీకే సులభంగా రుణాలు మంజూరు చేస్తుండడంతోో ఖ‌రీదైన ల‌గ్జ‌రీ కార్ల‌ను కూడా నేడు సుల‌భంగా కొనుగోలు చేయ‌గ‌లుగుతున్నారు. అయితే, కారు రుణం (Car Loan) అనేది గృహ రుణం (Home Loan) త‌ర్వాత తీసుకునే పెద్ద రుణంగా చెప్పుకోవ‌చ్చు. పైగా ఇది త‌రుగుద‌ల ఆస్తి. కాలం గ‌డిచే కొద్దీ కారు విలువ త‌గ్గిపోతూ ఉంటుంది. కాబ‌ట్టి, సుల‌భంగా ల‌భించిన‌ప్ప‌టికీ త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోక‌పోతే న‌ష్ట‌పోవాల్సి వ‌స్తుంది.

కారు రుణాలు కొనుగోలు శ‌క్తిని పెంచుతున్నాయి. అయిన‌ప్ప‌టికీ అత‌డు/ఆమె ఆదాయం, బడ్జెట్, స్థోమ‌త‌ల‌ ఆధారంగా కారు కొనుగోలు చేయ‌డం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. కారు కొనుగోలుదారులు త‌మ వార్షిక ఆదాయంలో 50 శాతం మాత్ర‌మే కారు కొనుగోలుకు ఖ‌ర్చుచేయాలి. ఉదాహ‌ర‌ణ‌కు మీ వార్షిక ఆదాయం రూ.10 ల‌క్ష‌లు అనుకుంటే.. రూ.5 ల‌క్ష‌లు విలువైన కారును కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఇక్క‌డ కారు షో-రూమ్ ధ‌ర‌ను కాకుండా ఆన్-రోడ్ ధ‌ర‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల్సి ఉంటుంది.

కారు కొనుగోలుకు 20-4-10 రూల్..
20-4-10 థంబ్ రూల్ ప్ర‌కారం కారు ఆన్-రోడ్ ధ‌ర‌లో 20 శాతం డౌన్ పేమెంట్ చెల్లించాలి. రుణ కాల‌వ్య‌వ‌ధి గ‌రిష్ఠంగా 4 సంవ‌త్స‌రాలు ఉండాలి. అలాగే, కారు రుణ ఈఎంఐ మీ నెల‌వారీ ఆదాయంలో 10 శాతం దాట‌కూడ‌దు.

డౌన్ పేమెంట్‌..
కొత్త కారును కొనుగోలు చేసేట‌ప్పుడు కొన్ని బ్యాంకులు కారు ఆన్‌-రోడ్ ధ‌ర‌లో 100 శాతం వ‌ర‌కు రుణం ఆఫ‌ర్ చేస్తుంటే, మ‌రికొన్ని సంస్థ‌లు 90 శాతం వ‌ర‌కు రుణాన్ని ఆఫ‌ర్ చేస్తుంటాయి. అయితే, పూర్తిగా రుణంతోనే కారు కొనుగోలు చేయ‌డం వ‌ల్ల ఈఎంఐలు భారం అవుతాయి. అందువ‌ల్ల సాధ్య‌మైనంత వ‌ర‌కు డౌన్‌పేమెంట్ చెల్లించ‌డం మంచిది. క‌నీసం కారు ఆన్-రోడ్ ధ‌ర‌లో 20 శాతం మొత్తాన్ని డౌన్‌పేమెంట్‌గా చెల్లించాల‌ని ఈ నియ‌మం చెబుతుంది. డౌన్ పేమెంట్‌ను 1 నుంచి 3 ఏళ్ల స్వ‌ల్ప‌కాలిక ల‌క్ష్యంగా ఏర్పాటు చేసుకుని త‌గిన పెట్టుబ‌డి మార్గం ద్వారా డ‌బ్బు స‌మ‌కూర్చుకోవ‌చ్చు.

కాల‌వ్య‌వ‌ధి..

బ్యాంకులు కారు రుణాల‌ను గ‌రిష్ఠంగా 7 నుంచి 8 ఏళ్ల కాల‌పరిమితితో బ్యాంకులు అందిస్తున్నాయి. 8 ఏళ్ల కాల‌పరిమితిని ఎంచుకుంటే త‌క్కువ ఈఎంఐతో సుల‌భంగా రుణం చెల్లించ‌వ‌చ్చ‌ని భావిస్తారు. కానీ, రుణ కాల‌వ్య‌వ‌ధి పెరిగే కొద్దీ రుణంపై చెల్లించాల్సిన వ‌డ్డీ పెరిగిపోతుంది. అందువ‌ల్ల ఈఎంఐ పెరిగిన‌ప్ప‌టికీ త‌క్కువ కాల‌వ్య‌వ‌ధిని ఎంచుకోవ‌డం మంచిది. 20-4-10 థంబ్ రూల్ ప్ర‌కారం కారు రుణం కోసం 4 ఏళ్ల కాల‌వ్య‌వ‌ధిని ఎంచుకోవాలి.

ఈఎంఐ..
కారు రుణం కోసం చెల్లించే ఈఎంఐ నెల‌వారీ ఆదాయంలో 10 శాతం మించ‌కుండా చూసుకోవాలి. అంత‌కు మించితే ఇత‌ర ఆర్థిక ల‌క్ష్యాల కోసం చేసే పొదుపు మొత్తం త‌గ్గిపోయే ప్ర‌మాదం ఉంది. దీంతో దీర్ఘ‌కాలిక ల‌క్ష్యాల పెట్టుబ‌డులు దెబ్బ‌తినే ప్ర‌మాదం ఉంది. 

20-4-10 రూల్‌కు ఉదాహరణ..
ర‌మేష్ వార్షిక ఆదాయం రూ.15 ల‌క్ష‌లు అనుకుందాం. దానిలో సగం, అంటే దాదాపు రూ.7.50 ల‌క్ష‌ల‌తో కారు కొనుగోలు చేయ‌వ‌చ్చు. ర‌మేష్ రూ.7 ల‌క్ష‌ల‌తో కారు కొనుగోలు చేశాడ‌నుకుందాం. 20 శాతం.. అంటే రూ.1,40,000కి త‌క్కువ కాకుండా డౌన్‌పేమెంట్ చేయాలి. రుణం = రూ.5,60,000 (రూ.7,00,000 - రూ.1,40,000). రుణ కాల‌వ్య‌వ‌ధి.. 4 సంవ‌త్స‌రాలు అనుకుంటే..7 శాతం వ‌డ్డీ చొప్పున నెల‌కు రూ.13,410 ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. ఇది ర‌మేష్ నెల‌వారీ ఆదాయంలో 10 శాతం కంటే ఎక్కువ‌. థంబ్ రూల్ ప్ర‌కారం నెల‌వారీ ఆదాయంలో 10 శాతంలోపు ఈఎంఐ ఉండాలి. ఇత‌ర ఖ‌ర్చులు త‌గ్గించుకుని దీర్ఘ‌కాలిక ల‌క్ష్యాల‌కు ఆటంకం క‌లగ‌కుండా ఈఎంఐ చెల్లించ‌గ‌లిగేవారు ఇలా ఎంచుకోవ‌చ్చు. లేదంటే డౌన్‌పేమెంట్ పెంచుకోవ‌డం లేదా కొంచెం త‌క్కువ ధ‌ర‌లో కారును కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

పై ఉదాహ‌ర‌ణ‌లో రూ.1,40,000కి బ‌దులు రూ.2,00,000 వ‌ర‌కు డౌన్‌పేమెంట్ చేయ‌గ‌లిగితే రుణ మొత్తం రూ.5,00,000కి త‌గ్గుతుంది. దీంతో నెల‌వారీ ఈఎంఐ  రూ.11,973కి త‌గ్గుతుంది. ఇది ర‌మేష్ నెల‌వారీ ఆదాయంలో 10 శాతం కంటే త‌క్కువ‌. లేదంటే ర‌మేష్ కొంచెం త‌క్కువ ధ‌ర మోడ‌ల్ కారును ఎంచుకుని, అంటే రూ.6 ల‌క్ష‌ల విలువైన కారును ఎంచుకుని రూ.1,20,000 (20 శాతం) డౌన్‌పేమెంట్ చెల్లించి రూ.4.80 ల‌క్ష‌లు రుణం తీసుకున్నాడ‌నుకుంటే.. 4 ఏళ్ల కాల‌పరిమితికి గానూ నెల‌కు రూ. 11,494 ఈఎంఐ చెల్లించాలి. ఇది కూడా ర‌మేష్ నెల‌వారీ ఆదాయంలో 10 శాతం కంటే త‌క్కువే అవుతుంది.

కారు కొనుగోలుకు రుణం తీసుకునే వారు వీటితో పాటు ప్రాసెసింగ్‌ ఛార్జీలు వంటివి కూడా ప‌రిశీలించాలి. కొన్ని బ్యాంకులు కొంత స్థిర మొత్తాన్ని విధిస్తే, మ‌రికొన్ని బ్యాంకులు రుణ మొత్తాన్ని బ‌ట్టి ప్రాసెసింగ్ ఫీజును వ‌సూలు చేస్తాయి. అలాగే, ముందస్తు చెల్లింపు ఆలోచన ఉన్నట్టయితే కొనుగోలుకు ముందే ముందస్తు చెల్లింపు చార్జీల గురించి వాకబు చేయడం మంచిది. వీట‌న్నింటినీ దృష్టిలో ఉంచుకుని.. ఈఎంఐలు చెల్లించ‌గ‌ల సామ‌ర్థ్యాన్ని అనుస‌రించి కారు కొనుగోలు చేయ‌డం మంచిది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని