Tim Cook: చైనాపై పొగడ్తల వర్షం కురిపించిన యాపిల్‌ సీఈఓ..!

అమెరికా టెక్ దిగ్గజం యాపిల్ సీఈఓ టిమ్ కుక్(Tim Cook).. చైనాలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Published : 25 Mar 2023 14:30 IST

షాంఘై: వాణిజ్య యుద్ధం మొదలుకొని.. సాంకేతికపరంగా, భౌగోళిక-రాజకీయపరమైన విషయాల్లో అమెరికా(America), చైనా(China) మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. ఈ సమయంలో చైనాలో పర్యటించారు అమెరికా టెక్ దిగ్గజం యాపిల్‌ సీఈఓ టిమ్ కుక్‌(Apple CEO Tim Cook). అలాగే డ్రాగన్‌ను ప్రశంసిస్తూ వ్యాఖ్యలు చేశారు. 

చైనా ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతోన్న చైనా డెవలప్‌మెంట్‌ ఫోరమ్‌లో పాల్గొనేందుకు టిమ్‌కుక్‌(Tim Cook) చైనా వెళ్లారు. ఉన్నతస్థాయి ప్రభుత్వ అధికారులు, ప్రముఖ సంస్థల సీఈఓలు దీనికి హాజరవుతున్నారు. ఈ క్రమంలో కుక్ మాట్లాడుతూ.. ‘చైనాలో వేగంగా ఆవిష్కరణలు జరుగుతున్నాయి. ఇవి మరింత వేగవంతమవుతాయని విశ్వసిస్తున్నా’ అని ఆయన వ్యాఖ్యానించినట్లు ఓ వార్తా సంస్థ పేర్కొంది.

అమెరికా, చైనా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో తమ ఉత్పత్తుల తయారీని చైనా వెలుపలికి తరలించాలని యాపిల్‌ భావిస్తున్న వేళ కుక్‌ నుంచి ఈ వ్యాఖ్యలు వెలువడటం గమనార్హం. ఇటీవల చైనా(China) అనుసరించిన కొవిడ్ జీరో వ్యూహం కారణంగా ప్రపంచంలో అతిపెద్ద ఐఫోన్ ఫ్యాక్టరీలో ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఈ పరిణామాల మధ్య ఆయన చైనాలో పర్యటిస్తున్నారు. ఇక శుక్రవారం కుక్‌(Tim Cook).. బీజింగ్‌లోని యాపిల్‌ స్టోర్‌ను సందర్శించిన చిత్రాలు అక్కడ వైరల్‌ అయ్యాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని