Apple job: యాపిల్‌లో ఉద్యోగానికి ఈ నాలుగు లక్షణాలూ ఉండాల్సిందేనట!

యాపిల్‌ సంస్థలో ఉద్యోగంలో చేర్చుకునే వ్యక్తిలో ముఖ్యంగా నాలుగు లక్షణాలూ చూస్తామంటున్నారు ఆ కంపెనీ సీఈఓ టిమ్‌ కుక్‌.

Published : 03 Oct 2022 23:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒక వ్యక్తిని ఉద్యోగంలో నియమించుకునే విషయంలో ఒక్కో కంపెనీ ఒక్కో తీరున వ్యవహరిస్తుంది. ఒక కంపెనీ వ్యక్తి నైపుణ్యాన్ని పరిగణనలోకి తీసుకుంటే.. మరో కంపెనీ అతడి గుణగణాలను చూస్తుంది. ఇంకో కంపెనీ కేవలం అనుభవాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటుంది. ప్రపంచంలోనే టాప్‌ కంపెనీ అయిన యాపిల్‌ మాటకొస్తే.. తమ సంస్థలో  ఉద్యోగం ఇచ్చే ముందు ఆ వ్యక్తిలో ముఖ్యంగా నాలుగు లక్షణాలూ చూస్తామంటున్నారు ఆ కంపెనీ సీఈఓ టిమ్‌ కుక్‌. ఇటీవల ఇటలీకి చెందిన ఓ యూనివర్సిటీ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. యాపిల్‌ కంపెనీలో పనిచేసేందుకు ఉద్యోగికి ఉండాల్సిన లక్షణాలను బయటపెట్టారు.

యాపిల్‌ ఉద్యోగులను నియమించుకునేటప్పుడు ఆ వ్యక్తిలో కలిసి పనిచేసే తత్వం (collaborate), సృజనాత్మకత (creativity), తపన (curiosity), నైపుణ్యం (expertise) వంటి నాలుగు లక్షణాలూ ఉన్నాయో లేదో పరిశీలిస్తామని టిమ్‌ కుక్‌ చెప్పారు. తొలుత నలుగురితో కలిసి పనిచేయగలిగే గుణం ఉందో లేదో పరిశీలిస్తామన్నారు. ఎందుకంటే యాపిల్‌ ఉత్పత్తులన్నీ పరస్పర సహకారంతో రూపొందుతుంటాయన్నారు. ఏదైనా ఆలోచనను నలుగురితో పంచుకున్నప్పుడు.. భిన్న అభిప్రాయాల ద్వారా అది మెరుగైన ఆలోచనగా మారుతుందని టిమ్‌ కుక్‌ చెప్పారు. పరస్పర సహకారంతోనే యాపిల్‌ తమ ఉత్పత్తులను తయారుచేస్తోందన్నారు. మిగిలిన మూడు లక్షణాలూ కావాలంటే నలుగురితో కలిసి పనిచేయడం ముఖ్యమని చెప్పారు.

ఇక యాపిల్‌ తన అభ్యర్థులు ఎప్పుడూ విభిన్నంగా ఆలోచించేవారై ఉండాలని కోరుకుంటుందని టిమ్‌ కుక్‌  చెప్పారు. ఏదైనా సమస్యను పరిష్కరించేటప్పుడు ఒకే సిద్ధాంతానికి పరిమితమైపోకూడదని అన్నారు. చిన్న పిల్లలు ప్రశ్నలు అడిగినట్లు ఎప్పుడూ ఏదో కొత్తగా తెలుసుకోవాలన్న తపన ఉద్యోగుల్లో ఉండాల్సిందేనన్నారు. కలుపుగోలుతనం, సృజనాత్మకత, తపన ఈ మూడు.. కొత్త ఆలోచనలకు బీజం వేస్తాయని చెప్పారు. ఇక చివరగా వ్యక్తిలో చూసేది నైపుణ్యం అని టిమ్‌ కుక్‌ పేర్కొన్నారు. పైన పేర్కొన్న నాలుగు లక్షణాలూ యాపిల్‌లో పరస్పర పని సంస్కృతికి దోహదం చేస్తాయని ఆయన పేర్కొన్నారు. ఇదే యాపిల్‌ విజయానికి కారణమని అక్కడున్న విద్యార్థులకు టిమ్‌ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని