ముఖ్యమైన ఆర్థిక ప్రణాళిక చిట్కాలు

సరైన ఆదాయం లేని సంద‌ర్భాల్లో ఆర్థిక ప్రణాళికను రూపొందించుకోవడానికి కొన్ని చిట్కాలు

Published : 15 Apr 2021 12:38 IST

ఈ త‌రంలో చాలా మంది ప్ర‌జ‌లు వారి ఆకాంక్షలు, కలల సాకారానికి సొంత వ్యాపారాలను మొదలుపెట్టాలనే ఉద్దేశంతో, చేస్తున్న కార్పోరేట్ ఉద్యోగాలను సైతం వదిలేస్తున్నారు. ఏమైనప్పటికీ, వ్యాపారం మొదలు పెట్టిన ఆరంభ దశలో, ఆదాయం అంత అనుకూలంగా ఉండ‌క‌పోవ‌చ్చు. అలాంటి పరిస్థితుల్లో ఆర్థిక ప్రణాళికను రూపొందించుకోవడం చాలా కీల‌కం. ఒక క్ర‌మ‌ప‌ద్ధ‌తిలో ఆదాయం లేని సంద‌ర్భాల్లో ఏవిధంగా వ్యవ‌హ‌రించాలో కొన్ని ఆర్థిక చిట్కాలను తెలుసుకుందాం.

పొదుపు ఖాతాలో అత్యవసర నిధి:
స్వయం ఉపాధి కలిగిన వారు అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకుని దానిని పొదుపు ఖాతాలో ఉంచుకోవాలి. చాలా బ్యాంకులు తమ పొదుపు ఖాతాదారులకు 7 శాతం వరకు వడ్డీని అందిస్తున్నాయి, మీ నెలవారీ వ్యయాలను కనీసం 4 నుంచి 6 రెట్లు కేటాయించి అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. అలాగే అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే దీనిని ఉపయోగించుకోవాలి. పొదుపు ఖాతాలు రాబడితో పాటు నగదు లభ్యతను అందిస్తాయి. అందువల్ల స్వయం ఉపాధి కలిగిన వారు తమ స్వల్పకాలిక అవ‌స‌రాల‌ కోసం కొంత మొత్తాన్ని పొదుపు ఖాతాలో ఉంచుకోవ‌డం మంచిది.

స్వయం ఉపాధి కలిగిన వారు అత్యవసర నిధిని ఏర్పాటు చేయడం వలన అత్యవసర సమయాల్లో (తక్కువ ఆదాయం పొందిన సమయంలో లేదా ప్రమాదం సంభవించినప్పుడు లేదా తీవ్రమైన అనారోగ్యం) ఆర్థిక అవసరాలను తీర్చడంలో సహాయపడుతుంది. తద్వారా మీ వ్క‌యా వ్యాపారానికి సంబంధించిన పెట్టుబడులపై రాజీపడవలసిన అవసరం ఉండదు.

ఈక్విటీలో పెట్టుబడుల‌కు సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్:
కారు కొనుగోలు చేయడం, మూలధన నిధిని సమకూర్చుకోవడం, పిల్లల ఉన్నత విద్య, వివాహం, పదవీ విరమణ మొదలైన మధ్య, దీర్ఘకాలిక లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి తగిన సమయంలో చెప్పుకోదగ్గ మొత్తం అవసరమవుతుంది. దీర్ఘకాలిక లక్ష్యాల కోసం ఫిక్స్డ్ డిపాజిట్లు, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్లు, పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్ల కంటే ఈక్విటీలు మేలైనవిగా ఉంటాయి. ఎందుకంటే ఈక్విటీలు దీర్ఘ కాలంలో నిలకడగా ద్రవ్యోల్బణ రేట్లను మించి రాబడులను అందిస్తాయి.

కానీ, ప్రతి నెలా జీతం పొందే వారు సిప్ (సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్) ద్వారా ఈక్విటీలలో పెట్టుబడులు పెట్టడం సులభంగా ఉంటుంది. ఎందుకంటే వారికీ నెల నెలా క్రమం తప్పకుండా జీతం లభిస్తుంది. ఏదైమైనప్పటికీ సరైన రీతిలో ఆదాయం పొందలేని వారు, స్వయం ఉపాధి పొందేవారు తమ పెట్టుబడులను ఎస్‌టీపీ (సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్) ఆప్షన్ ను ఎంచుకోవడం మంచిది. ఎప్పుడైనా మిగులు ఆదాయం సమకూరినప్పుడు, లిక్విడ్ ఫండ్ల‌లో పెట్టుబడులు పెట్టవచ్చు. అనంతరం సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ ద్వారా స్థిరమైన మొత్తాన్ని కావలసిన ఈక్విటీ ఫండ్ కు బదిలీ చేసుకోవచ్చు. అలాగే లిక్విడ్ ఫండ్ల‌లో మిగిలి ఉన్నపెట్టుబ‌డి పై కూడా రాబ‌డి అందుతుంది.

ఈ విధంగా, సిస్టమాటిక్ ట్రాన్స‌ఫ‌ర్ ప్లాన్ ల ద్వారా నిలకడైన ఆదాయం లేనివారు తమ దీర్ఘకాల లక్ష్యాల‌కు కావ‌ల్సిన‌ నిధి స‌మ‌కూర్పున‌కు ఈక్విటీలో పెట్టుబడి పెట్టవచ్చు. ఎస్‌టీపీ లు 3 నుంచి 6 నెలల కాల వ్యవధిలో లేదా కొన్ని సంవత్సరాల వరకు కూడా చేయవచ్చు. ఇది పెట్టుబడిదారుడి ఆసక్తి ని బ‌ట్టి ఉంటుంది.

టర్మ్ బీమా, ఆరోగ్య బీమా:
మీరు స్వయం ఉపాధి పొందేవారా? లేదా నెలవారీ జీతం పొందేవారా? అనే సంబంధం లేకుండా, మొదట మీ భద్రతకు ప్రాధాన్యతను ఇవ్వాలి. దీని కోసం మీరు టర్మ్ బీమా పథకాన్ని కొనుగోలు చేయచ్చు. ఒకవేళ మీకు జరగరానిది ఏదైనా జరిగితే అప్పుడు మీ కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకోడానికి టర్మ్ బీమా సహాయపడుతుంది. టర్మ్ బీమా మొత్తం అనేది మీ వార్షిక ఆదాయానికి కనీసం 10 నుంచి 15 రెట్లుగా ఉంటే మంచిది.

నిత్యం పెరుగుతున్న వైద్య ఖర్చులు మీకు, మీ కుటుంబం స‌భ్యుల కోసం ఆరోగ్య బీమాను కొనుగోలు చేయాల్సిన‌ అవసరం ఉంది. ఒకవేళ మీకు ఆరోగ్య బీమా లేనట్లయితే ఒక్క సంఘటన మీ ఆర్ధిక ప‌రిస్థితిని నాశనం చేయగలదు. అంతేకాకుండా, స్వయం ఉపాధి పొందేవారు క‌చ్చితంగా ఆరోగ్య బీమాను తీసుకోవడం ఏంతో ముఖ్యం. ఎందుకంటే, సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు వర్తించే గ్రూప్ ఆరోగ్య బీమా వీరికి వర్తించదు. ఒక కుటుంబానికి చెందిన స్వయం ఉపాధి పొందే వారు, వారి పిల్లలను ఆరోగ్య బీమాలో చేర్చడానికి ఫ్యామిలీఫ్లోట‌ర్ కవర్ ను కొనుగోలు చేయ‌వ‌చ్చు. అదేవిధంగా వైకల్యం సంభవించినప్పుడు లేదా ఏదైనా ప్రమాదం సంబంధించినప్పుడు వైద్య ఖర్చులు కవర్ అవడానికి అదనంగా ఒక టాప్ అప్ ను కొనుగోలు చేయడం మంచిది

క్రెడిట్ చరిత్రను మెరుగుపరుచుకోడానికి క్రెడిట్ కార్డులను ఉపయోగించండి:
క్రెడిట్ చరిత్ర అనేది మీరు గతంలో తీసుకున్న రుణాలు, క్రెడిట్ కార్డుల వంటి సమాచారాన్ని తెలుపుతుంది. అదే విధంగా వాటి చెల్లింపులను ఎలా నిర్వహించారో అనే విషయం క్రెడిట్ చరిత్ర ఆధారంగా తెలుసుకునే వీలుంది. రుణ సంస్థలు మీరు రుణాన్ని మంజూరు చేసే ముందు మీ క్రెడిట్ చరిత్రను తనిఖీ చేస్తారు. మంచి క్రెడిట్ చరిత్ర అనుకూలంగా ఉంటే రుణం మంజూరు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. క్రెడిట్ చరిత్రను మెరుగుపరుచుకోడానికి ఉన్న ముఖ్యమైన సాధనాల్లో క్రెడిట్ కార్డు వినియోగం ఒకటి. క్రెడిట్ కార్డు చెల్లింపులను సరిగ్గా నిర్వహించినట్లైతే మీ క్రెడిట్ చరిత్ర్ర మెరుగుపడుతుంది. మీకున్న బకాయిలన స‌మ‌యానికి చెల్లించినట్లైతే క్రమంగా మీ క్రెడిట్ చరిత్ర వృద్ధి చెందుతుంది. మంచి క్రెడిట్ స్కోరు ఉంటే మీకు తక్కువ వడ్డీకే రుణాలు లభిస్తాయి.

ఒకవేళ మీకు గతంలో ఎలాంటి క్రెడిట్ చరిత్ర లేకపోయినా, స్థిరమైన ఆదాయం లేకపోయినా బ్యాంకులు మీకు క్రెడిట్ కార్డును మంజూరు చేయడానికి నిరాకరిస్తాయి. అలాంటప్పుడు క్రెడిట్ కార్డు పొందడానికి మీకు మరో అవకాశం ఉంది. అదే ఫిక్స్డ్ డిపాసిట్. ప్రస్తుతం బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్ ఆధారంగా క్రెడిట్ కార్డులను మంజూరు చేస్తున్నాయి. దీనికి క్రెడిట్ చరిత్రతో పనిలేదు. మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన మొత్తంలో సుమారు 80 శాతంతో క్రెడిట్ కార్డు పరిమితిని బ్యాంకు మీకు అందిస్తుంది. ఇలా పొందిన క్రెడిట్ కార్డును సక్రమంగా వినియోగించుకుని మంచి క్రెడిట్ చరిత్రను పొందవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని