Home Loan: మొదటి సారి ఇల్లు కొంటున్నారా? ఈ టిప్స్‌ మీ కోసమే..!

అధిక మొత్తంతో కూడుకున్న ఆస్తి కొనుగోలు సమయంలో గృహ రుణం ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి దీని విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం.

Updated : 17 Nov 2022 14:01 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గృహ రుణం.. ఒకటి, రెండు సంవత్సరాల్లో తీర్చగలిగేది కాదు. సుదీర్ఘకాలం కొనసాగుతుంది. రుణ గ్రహీత ఆర్థిక భవిష్యత్‌ను, ఆదాయాన్ని ప్రభావితం చేస్తుంది. మరోవైపు సొంత ఇంటిని ఏర్పాటు చేసుకోవడంలో సాయపడడంతో పాటు పన్ను ప్రయోజనాలను అందిస్తుంది. కాబట్టి రుణం తీసుకుని ఇల్లు కొనుగోలు చేయడంలో తప్పు లేదు. అయితే, గృహ రుణం తీసుకున్న వారు ఆర్థిక క్రమశిక్షణతో వ్యవహరించడం చాలా అవసరం. అప్పుడే ఈఎంఐలు సకాలంలో చెల్లించడంతో పాటు రోజువారీ అవసరాలు, ఇతర పెట్టుబడులను సమర్థంగా నిర్వహించగులుగుతారు. గృహ రుణం తీసుకునే ముందు ఈ కింది అంశాలను పరిగణనలోకి తీసుకోవడం వల్ల త్వరగా రుణ ఆమోదం పొందడంతో పాటు, చెల్లింపులు సకాలంలో చేయగలుగుతారు.

క్రెడిట్‌ స్కోరు..

గృహ రుణం కోసం బ్యాంకులకు దరఖాస్తు చేసుకున్నప్పుడు బ్యాంకులు ముందుగా చూసేది దరఖాస్తుదారుని క్రెడిట్‌ స్కోరు. మీ రుణ అర్హత, రుణ మొత్తం, రుణంపై వర్తించే వడ్డీ రేటు.. ఇలా అన్నింటినీ క్రెడిట్‌ స్కోరు ప్రభావితం చేస్తుంది. 800 పాయింట్లు లేదా అంతకంటే ఎక్కువ క్రెడిట్‌ స్కోరు నిర్వహించేవారికి రుణం త్వరగా మంజూరు అవుతుంది. అలాగే, వడ్డీ రేటు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఉన్న రుణాలకు సంబంధించిన ఈఎంఐలు, క్రెడిట్‌ కార్డు బిల్లులు సకాలంలో చెల్లించడం ద్వారా మంచి క్రెడిట్‌ స్కోరు సాధించవచ్చు.

ఉమ్మడి గృహ రుణం..

గృహ రుణాన్ని ఉమ్మడిగా కూడా తీసుకోవచ్చు. ఇలా తీసుకోవడం వల్ల రుణం త్వరగా లభించే అవకాశం కూడా ఉంటుంది. సహ-దరఖాస్తుదారుడు ఉంటే ఇద్దరి ఆదాయాలను పరిగణనలోకి తీసుకుంటారు. కాబట్టి రుణ అర్హత పెరుగుతుంది. చెల్లింపుల బాధ్యతను కూడా ఇద్దరు పంచుకోవడం వల్ల భారం తగ్గుతుంది. అలాగే, నిబంధనలకు లోబడి పన్ను మినహాయింపు ప్రయోజనాలను ఇద్దరు క్లెయిం చేసుకోవచ్చు. దరఖాస్తుదారుల్లో ఒకరైనా మహిళ ఉంటే.. కొన్ని బ్యాంకులు 5-50 బేసిస్‌ పాయింట్లు తక్కువ వడ్డీకే రుణం ఇస్తున్నాయి. 

వడ్డీ రేటు..

గృహ రుణం వడ్డీ రేటు అన్ని బ్యాంకుల్లో ఒకేలా ఉండదు. స్వల్ప వ్యత్యాసాలు ఉంటాయి. స్వల్ప తేడానే కదా అని అనుకోవద్దు. వడ్డీరేట్లలో 20 నుంచి 50 బేసిస్‌ పాయింట్ల వ్యత్యాసం కూడా దీర్ఘకాలంలో ఎక్కువ మొత్తాన్ని ఆదా చేసుకోవడంలో సాయపడుతుంది. కాబట్టి, వేరు వేరు బ్యాంకులు అందించే గృహ రుణ వడ్డీ రేట్లను, ప్రాసెసింగ్‌, ఇతర హిడెన్‌ ఛార్జీలను తెలుసుకున్న తర్వాత ఏ బ్యాంకులో రుణం తీసుకోవాలో నిర్ణయించుకోండి.

డౌన్‌పేమెంట్‌..

ఇంటిని కొనుగోలు చేసినప్పుడు బ్యాంకులు మొత్తం ఇంటి విలువను రుణంగా ఇవ్వవు. కొంత డౌన్‌పేమెంట్‌గా కొనుగోలుదారుడు చెల్లించాలి. బ్యాంకులు దరఖాస్తుదారుని రుణ అర్హతను బట్టి ఇంటి విలువలో 75-90% వరకు రుణం ఇస్తుంటాయి. అయితే, అంత మొత్తం రుణం తీసుకోవడం మంచిదికాదు. ఇంటి విలువలో ఎక్కువ శాతం డౌన్‌పేమెంట్‌ (కనీసం 30-40%) రూపంలో కొనుగోలుదారుడే స్వయంగా చెల్లించడం మంచిది. దీనివల్ల తక్కువ కాలంలోనే రుణం తీర్చగలరు. లేదంటే రుణ చెల్లింపులకు ఎక్కువ కాలపరిమితి ఎంచుకోవాల్సి వస్తుంది. దీంతో వడ్డీ కోసం అధిక మొత్తం చెల్లించాల్సి వస్తుంది. 

కొత్త ఇంటిని కొనుగోలు చేస్తుంటే..

కొత్తగా నిర్మిస్తున్న ఆస్తిని కొనుగోలు చేస్తేంటే.. బిల్డర్లు కొన్ని బ్యాంకులతో మంచి సంబంధాలను కలిగి ఉంటారు. అటువంటి చోట రుణ ప్రాసెస్‌ త్వరగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది. ఆస్తికి సంబంధించిన అనేక వివరాలు వారి దగ్గర ఉంటాయి. కాబట్టి ఆస్తి పత్రాలు, ఆస్తికి సంబంధించిన ఇతర విషయాల్లో మీకు ఇబ్బందులు దాదాపు ఉండవు. రుణం త్వరగా మంజూరు కావడంతో పాటు, వడ్డీ రేటు తగ్గే అవకాశం ఉంటుంది. 

పత్రాలు..

రుణం మంజూరు చేసేటప్పుడు బ్యాంకులు అనేక పత్రాలపై మీ వద్ద సంతకం తీసుకుంటాయి. సంతకం పెట్టేటప్పుడు అన్ని పత్రాలను వివరంగా చదవండి. నియమ నిబంధనలలో చిన్న పాయింటు కూడా భవిష్యత్‌లో మీకు ఇబ్బంది కావచ్చు. అలాగే బ్యాంకులు అడిగిన అన్ని పత్రాలు (గుర్తింపు కార్డు, ఆదాయపు రిటర్నులు, జీతం పే స్లిప్‌లు, బ్యాంక్‌ స్టేట్‌మెంట్లు, ఇంటి యజమాని రుజువులు, ఆస్తి పత్రాలు) ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి అన్ని పత్రాలను సిద్ధం చేసుకోవాలి.

చివరిగా

మొదటి సారి ఇల్లు కొనుగోలు చేసేటప్పుడు ఉత్సాహం ఉండడం సహజమే. అయితే, కంగారు పడకుండా రుణం, ఆస్తి గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాకే ముందడుగు వేయడం మంచిది. దీర్ఘకాలం లో ఇబ్బందులు పడకుండా ఇది సహాయపడుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని