Home Insurance: గృహబీమా..ఈ టిప్స్‌తో ప్రీమియం తగ్గించుకోవచ్చు!

ప్రకృతి వైపరీత్యాలు, మానవ సంబంధిత తప్పుల వల్ల వ‌చ్చే ఆర్థిక నష్టం నుంచి గృహ బీమా రక్షణ కల్పిస్తుంది.

Updated : 03 Oct 2022 19:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మొదటిసారి ఇల్లు కొనుగోలు చేసినప్పుడు చాలా ఉత్సుకత ఉంటుంది. ఇంటిని ఎంపిక చేసుకోవడం దగ్గర నుంచి డౌన్‌పేమెంట్‌, బ్యాంకు రుణం, ఈఎంఐ వంటి విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ, గృహ బీమాను మాత్రం విస్మరిస్తారు. ఇల్లు కొనుగోలు అనేది మనం చేసే అతిపెద్ద పెట్టుబడుల్లో ఒకటి. అనేక సంవత్సరాల కష్టాన్ని, సంపాదనను దీనికోసం ఖర్చుచేస్తాం. అందువల్ల దీన్ని కాపాడుకోవడం కూడా ముఖ్యమే. ప్రకృతి వైపరీత్యాలు, మానవ సంబంధిత తప్పుల వల్ల కూడా కొన్నిసార్లు నష్టం వాటిల్లుతుంది. ఇలాంటి ఆర్థిక నష్టం నుంచి గృహ బీమా రక్షణ కల్పిస్తుంది. అందువల్ల మనం కొనుగోలు చేసేది ఇండివిడ్యువల్‌ హౌస్‌ అయినా, అపార్టుమెంటు అయినా, ఇల్లు చిన్నదైనా, పెద్దదైనా బీమా రక్షణ ఉండాలి. ఈ టిప్స్ ద్వారా ప్రీమియం తగ్గించుకోవడంతో పాటు క్లెయిమ్‌లు తిరస్కణకు గురవ్వకుండా చూసుకోవచ్చు. 

ఆన్‌లైన్‌లో కొనుగోలు..

ఆన్‌లైన్‌ ద్వారా గృహ బీమాను కొనుగోలు చేయడం ద్వారా ప్రీమియంను కొంత వరకు తగ్గించుకోవచ్చు. ఆఫ్‌లైన్‌లో మధ్యవర్తుల ద్వారా పాలసీ కొనుగోలు చేసినప్పుడు బీమా సంస్థలు వారికి చెల్లించే కమీషన్‌ను కలిపి ప్రీమియం వసూలు చేస్తాయి. అదే ఆన్‌లైన్‌లో అయితే మధ్యవర్తులు ఉండరు, కాబట్టి కమీషన్‌ ఉండదు. దీంతో తక్కువ ప్రీమియంకే పాలసీ లభించే అవకాశం ఉంటుంది. సమయం, శ్రమ రెండూ ఆదా అవుతాయి. ఒకవేళ ఏదైనా నష్టం వాటిల్లినప్పుడు ఆ నష్టంలో కొంత భాగాన్ని చెల్లించేందుకు మీరు అంగీకరిస్తే.. ప్రీమియం గణనీయంగా తగ్గిస్తారు. కానీ, సహ చెల్లింపుల ఆప్షన్‌ తీసుకోకపోవడమే మంచిది.

సమగ్ర కవరేజీ..

బీమా కవరేజీ ఎంత మొత్తానికి తీసుకోవాలో అంచనా వేయడంలో తప్పులు జరగకుండా చేసుకోవాలి. చాలా మంది ఆస్తి కొనుగోలు చేసినప్పుడు దాని అసలు ధర ఆధారంగా బీమా కవరేజీని ఎంచుకుంటారు. అయితే, ఇంటిలో ఫర్నీచరు, ఫిట్టింగ్స్‌ వంటి కొన్ని తరుగుదల ఆస్తులు వుంటాయి. వీటిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. బిల్డింగ్ ఏరియా, నిర్మాణం వంటి వాటిని పరిగణించాలి. నిర్మాణం, గృహోపకరణాలు, ఇంట్లో ఉన్న వ్యక్తుల కోసం ప్రత్యేక బీమా పాలసీలు అందుబాటులో ఉంటాయి. అయితే వాటన్నింటినీ కలిగి ఉన్న పూర్తి సమగ్ర బీమాను తీసుకోవడం మంచిది. అగ్ని ప్రమాదాలు, దోపిడీ, తీవ్రవాద కార్యకలాపాలు, ఎలక్ట్రికల్‌ లేదా మెకానికల్‌ వైఫల్యం వల్ల ఎదురయ్యే ప్రమాదాలు బీమాలో కవరవుతాయి. అత్యవసర పరిస్థితులు, ప్రమాదాలు, ప్రమాదవ శాత్తు కుటుంబ సభ్యులు ఆసుప్రతిలో చేరాల్సి వచ్చినా సమగ్ర బీమా కవర్‌ చేస్తుంది. 

నగదు రహిత సేవలు..

గృహోపకరణాలకు ఏదైనా నష్టం వాటిల్లినప్పుడు..బీమా సంస్థ వాటిని మరమ్మతు  చేయించేందుకు నగదు రహిత సేనలను అందిస్తుందా, లేదా తెలుసుకోవాలి. 

తెలివిగా క్లెయిమ్‌ చేయండి..

నష్టాన్ని తిరిగి పొందాలంటే క్లెయిమ్‌ చేయాలి. క్లెయిమ్‌ ప్రక్రియ సాఫీగా సాగాలంటే ఆస్తికి సంబంధించిన పత్రాలు, పాలసీ పత్రాలు.. తదితర పత్రాలను సురక్షితంగా ఉంచగలగాలి. అలాగే, మీ ఇంట్లో అన్ని వస్తువుల జాబితాను నిర్వహించాలి. వీటిని యాప్‌ లేదా వెబ్‌సైట్‌ల సాయంతో డిజిటల్‌ పద్ధతిలో ట్రాక్‌ చేయవచ్చు. గడువు ముగిసేలోపు క్లెయిమ్‌ చేయాలి. మీ వద్ద పాలసీ డాక్యుమెంట్లకు సంబంధించిన ఒక సాఫ్ట్‌ కాపీ ఉండేలా చేసుకోండి. ఏదైనా నష్టం జరిగితే వెంటనే బీమా సంస్థకు ఫోన్‌ ద్వారా లేదా ఇ-మెయిల్‌ ద్వారా సంఘటన గురించి సమాచారం తెలియజేయవచ్చు.

అప్‌డేట్‌ చేసుకోండి.. 

పాలసీ నియమాలను ఒకటికి రెండు సార్లు చెక్‌ చేసుకోండి. మీ ఇంటి పరిసర ప్రాంతాలు మారినా, ఇంటిలో మరో గది నిర్మించినా లేదా ఇంకేదైనా నిర్మాణం పనులు చేపట్టినా పాలసీలో అప్‌డేట్‌ చేయాలి. తద్వారా ఆస్తికి ఏదైనా నష్టం వాటిల్లినప్పుడు బీమా తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉండదు. ఇంటికి సెక్యూరిటీ కెమారాలు, ప్రహారీగోడ వంటి రక్షణ ఏర్పాట్లు చేసి కూడా కొంత వరకు ప్రీమియం తగ్గించుకోవచ్చు.

మరమ్మతులు.. 

మీ గృహ బీమా ప్రీమియం ఆదా చేయాలనుకుంటే.. ఎప్పటికప్పుడు ఇంటి మరమ్మతులను చేయించండి. అగ్నిప్రమాదాలను నివారించేందుకు వైరింగ్‌ సంబంధిత రిపేర్లను ఎప్పటికప్పుడు చేయించుకోవాలి. అలాగే, వైపరీత్యాలను తట్టుకునేలా ఇంటి పైకప్పులో చిన్ని చిన్న డ్యామేజీలు ఉంటే.. సమర్థంగా రిపేరు చేయించాలి. ఇలా చేయించడం వల్ల గృహ బీమా తగ్గడంతో పాటు ఏళ్ల తరబడి ఇల్లు బలంగా ఉంటుంది.

చివరిగా..

మీకు ఎంత కవరేజీ కావాలో తెలియకపోతే నిపుణులను సంప్రదించవచ్చు. వారు మీ ఇల్లు, ప్రాంతం, మీ స్థితిగతులను అనుసరించి ఉత్తమమైన పాలసీని సూచిస్తారు. అలాగే, పాలసీలో దేనికి పరిహారం ఇవ్వరు. ఎలాంటి సందర్భాల్లో బీమా వర్తించదు అనే విషయాలను స్పష్టంగా తెలుసుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని