అస్థిరతే.. అసలైన తరుణం...

స్టాక్‌ మార్కెట్లో హెచ్చుతగ్గులు సర్వసాధారణం. చిన్న కారణంతో పడిపోయిన మార్కెట్లు.. మళ్లీ నిలదొక్కుకునేందుకు ఎక్కువ సమయం తీసుకోవు.

Published : 24 Mar 2023 00:44 IST

స్టాక్‌ మార్కెట్‌

స్టాక్‌ మార్కెట్లో హెచ్చుతగ్గులు సర్వసాధారణం. చిన్న కారణంతో పడిపోయిన మార్కెట్లు.. మళ్లీ నిలదొక్కుకునేందుకు ఎక్కువ సమయం తీసుకోవు. అందుకే, వీలైనంత ఎక్కువ కాలం మార్కెట్లో కొనసాగిన వారికే మంచి లాభాలు కనిపిస్తుంటాయి. ప్రస్తుతం కొనసాగుతున్న అనిశ్చితి మదుపరులకు మంచి తరుణంగానే చెప్పొచ్చు.

బీఎస్‌ఈ సెన్సెక్స్‌ జనవరి 14, 2020న 41,952 పాయింట్ల వద్ద ముగిసింది. అప్పటికి ఇది జీవన కాల గరిష్ఠం. కానీ ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్‌ వేగంగా వ్యాప్తి చెందడంతో పెట్టుబడిదారుల్లో భయాందోళనలు సృష్టించింది. మార్చి 23, 2020న మార్కెట్లు దాదాపు 40 శాతం దిగువన 25,981 పాయింట్ల కనిష్ఠ స్థాయికి పడిపోయింది.  ఈ సమయంలో చాలామంది తమ ధైరాన్ని కోల్పోయారు. పెట్టుబడులను వెనక్కి తీసుకునేందుకు తొందరపడ్డారు. కానీ, సంవత్సర కాలం తిరిగే సరికి ఫిబ్రవరి 2021 నాటికి 100 శాతానికి పైగా పెరిగాయి. సెప్టెంబరు 2021లో 60,000 మార్కును దాటాయి. అప్పటి నుంచి రష్యా-ఉక్రెయిన్‌ వివాదం, ఇతర భౌగోళిక- రాజకీయ ఆందోళనల చుట్టే మార్కెట్‌ తిరుగుతోంది.


ఎన్నో సంక్షోభాలు వచ్చినా..

మార్కెట్లు గతంలో ఇలాంటి ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొన్నాయి. ప్రతి సంక్షోభం తర్వాత తదుపరి 3-5-7 ఏళ్ల కాలానికి ప్రతిసారీ రెట్టింపు రాబడితో దూసుకెళ్లాయి. మదుపరులు ఈ విషయాన్ని గుర్తించకుండా, ఇటీవలి సంక్షోభాలనే పట్టించుకుంటారు. ఈ ప్రవర్తన వల్ల రాబడిని ఆర్జించేందుకు ఉన్న అవకాశాలను కోల్పోతుంటారు. చాలామంది మదుపరులు సరైన సమయం కోసం వేచి చూస్తున్నామని చెబుతుంటారు. అయితే, తదుపరి మంచి సమయం, మార్కెట్‌ ర్యాలీలను ఎవరూ ఊహించలేరు.


దిద్దుబాట్లు ఉంటేనే...

ఇక్కడ ఒక ఉదాహరణ గమనిద్దాం.. కారుకు బ్రేకులు ఉంటాయి. కారు వేగాన్ని నియంత్రించేందుకు వీటి అవసరం అని అనుకుంటాం. కానీ, బ్రేకులున్నాయనే మనం కారును వేగంగా నడిపిస్తాం. అవి లేకపోతే ఎంత వేగంగా నడపగలం? అంటే.. కారును నడిపేందుకు సౌకర్యాన్ని ఇచ్చేది బ్రేకులే. అదే విధంగా మన జీవితంలో కష్టాలను మన వేగానికి ఆటంకం కలిగించే బ్రేకులుగా చూస్తాం. కానీ, అవి మనల్ని మరింత శక్తిమంతంగా మారుస్తాయి. విజయం వైపు నడిచేందుకు ఉత్ప్రేరకాలుగా పనిచేస్తాయి. అదే విధంగా పెట్టుబడులు పెట్టేటప్పుడు మార్కెట్‌ అస్థిరత, దిద్దుబాటును బ్రేకులుగానే చూడాలి. ఇవి కొత్త పెట్టుబడులకు ఒక అవకాశం కల్పిస్తాయి. ఇలాంటి దిద్దుబాట్ల తర్వాత మార్కెట్‌లు ప్రతిసారీ పుంజుకుంటున్న పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం.


సంపద సృష్టికి వీలుగా..

ఈక్విటీలు ఒక ప్రత్యేక తరగతికి చెందిన పెట్టుబడి పథకాలు. ఇందులో నష్టభయం ఉంటుంది. అదే సమయంలో మంచి రాబడులకూ అవకాశం కనిపిస్తుంది. దీర్ఘకాలంలో సంపదను సృష్టించే సామర్థ్యం ఈక్విటీలకు ఉంది అని ఇప్పటికే చాలా సందర్భాల్లో రుజువయ్యింది. అత్యాశ, భయంలాంటి భావోద్వేగాలు ఇక్కడ చాలామందిని నష్టాల్లోకి నెట్టేస్తాయి. పెరుగుతున్నప్పుడు కొనడం, తగ్గుతున్నప్పుడు విక్రయం లాంటివి ఇందుకు ఉదాహరణలు. మార్కెట్‌ సూచీలు ఎలా ఉన్నాయన్న దానితో సంబంధం లేకుండా.. పెట్టుబడులు కొనసాగించాలి.


అవకాశాలను చూడాలి..

ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితిని చూస్తే కొంత అస్థిరత కనిపిస్తోంది. దీన్ని మనం మిత్రుడిగా భావించొచ్చు. స్వల్పకాలంలో డబ్బు కోల్పోతామనే భయం ఉంటే పెట్టుబడులు పెట్టకూడదు. దీర్ఘకాలిక పెట్టుబడులకు ఇదొక అవకాశంగా చూడొచ్చు. తక్షణ రాబడులు ఇప్పుడు కష్టం. విజయవంతమైన మదుపరిగా ఉండాలంటే.. మార్కెట్లో వీలైనంత సమయం కొనసాగాలి.


సిప్‌ మార్గంలోనే..

మార్కెట్‌ ఎలా ప్రవర్తిస్తుందనే దానిపై దృష్టి పెట్టడం మానేయాలి. మీ పెట్టుబడితో మీరు ఎలా ప్రవర్తిస్తున్నారు అనేదే ఇక్కడ సాధారణ సూత్రం. మంచి ఫండ్లను ఎంచుకొని, క్రమానుగత పెట్టుబడి విధానం (సిప్‌) ద్వారా మదుపు చేయడం వల్ల కలిసొస్తుంది. మార్కెట్లు పడిపోతున్నప్పుడే సిప్‌ ప్రారంభించాలి. దీనివల్ల మీకు ఎక్కువ యూనిట్లు వస్తాయి. ఉదాహరణకు మీరు నెలకు రూ.1,000 సిప్‌ చేస్తున్నారనుకుందాం.. ఎన్‌ఏవీ రూ.100 ఉంటే 10 యూనిట్లే వస్తాయి. అదే ఎన్‌ఏవీ రూ.50 ఉంటే 20 యూనిట్లు వస్తాయి. మార్కెట్‌ పెరిగినప్పుడు ఈ 20 యూనిట్ల ధర ఎంతవుతుందో చూసుకోండి. కాబట్టి, మార్కెట్‌ తగ్గినప్పుడు సిప్‌ మొత్తాన్ని పెంచడం అలవాటు చేసుకోండి. భవిష్యత్తులో మార్కెట్లు వృద్ధి పథంలో సాగుతున్నప్పుడు సంపద పెరిగేందుకు వీలవుతుంది.

బుల్‌ మార్కెట్‌లో నష్టాలకు అవకాశాలు ఎక్కువ. బేర్‌ మార్కెట్లో అవకాశాలు అధికంగా ఉంటాయి. మార్కెట్లు అస్థిరంగా ఉన్నప్పుడు పెట్టుబడి పెడితే.. దీర్ఘకాలంలో మంచి రాబడిని ఆర్జించేందుకు వీలవుతుంది. ఈ తరుణంలో దూరంగా ఉంటే వచ్చిన అవకాశాన్ని కోల్పోయినట్లు అవుతుంది.

సతీశ్‌ ప్రభు, హెడ్‌- కంటెంట్‌ డెవలప్‌మెంట్‌- ఇండియా, ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని