వాహన బీమా.. క్లెయిం తిరస్కరించకుండా...

రోజువారీ జీవితంలో వాహనాలకు ప్రత్యేక స్థానం ఉంది. చాలామందికి అత్యంత ఖరీదైన ఆస్తుల్లో ఇవీ ఒకటి. రోడ్డుపై వెళ్లేప్పుడు ప్రమాదాలు పొంచే ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో వాహన బీమా ఆర్థికంగా జరిగే నష్టానికి పరిహారం ఇస్తుంది.

Updated : 07 Apr 2023 04:18 IST

రోజువారీ జీవితంలో వాహనాలకు ప్రత్యేక స్థానం ఉంది. చాలామందికి అత్యంత ఖరీదైన ఆస్తుల్లో ఇవీ ఒకటి. రోడ్డుపై వెళ్లేప్పుడు ప్రమాదాలు పొంచే ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో వాహన బీమా ఆర్థికంగా జరిగే నష్టానికి పరిహారం ఇస్తుంది. వాహనదారులు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల కొన్నిసార్లు బీమా క్లెయింలను తిరస్కరించే అవకాశాలుంటాయి.  ఇందుకు కారణాలేమిటి? ఆ తప్పులను నివారించేందుకు పాటించాల్సిన జాగ్రత్తలేమిటి? తెలుసుకుందాం.
కొత్త వాహనం తీసుకునేటప్పుడు నిబంధనల మేరకు బీమా పాలసీ తప్పనిసరి. కానీ, పునరుద్ధరణ విషయంలో చాలామంది అంత శ్రద్ధ చూపరు. చాలామంది పాలసీని పునరుద్ధరించడం మర్చిపోతారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడే దాన్ని తీవ్రతను అర్థం చేసుకుంటారు. ప్రమాదం జరిగిన క్షణం వరకూ పాలసీ అమల్లో ఉంటేనే బీమా కంపెనీ క్లెయిం చెల్లిస్తుంది. కాబట్టి, పాలసీ తేదీ గడువు ముగిసేలోపే దాన్ని పునరుద్ధరించుకోవాలి. ప్రస్తుతం బీమా సంస్థలు వెబ్‌సైట్లు, యాప్‌ల ద్వారా పునరుద్ధరణ చేసుకునేందుకు అవకాశాన్ని కల్పిస్తున్నాయి. మీ బీమా సంస్థ యాప్‌ మీ ఫోన్‌లో ఉంటే ప్రతి విషయంలోనూ సహాయకారిగా ఉంటుంది. క్లెయింను దాఖలు చేయడంతోపాటు, పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకోవడం, సందేహాలుంటే తీర్చుకోవడం లాంటివన్నీ చేయొచ్చు.
* పూర్తి స్థాయి బీమా ఉంటేనే...: వాహన బీమా పాలసీలో రెండు విభాగాలు ఉంటాయి. ఒకటి తృతీయ పక్షానికి నష్టం వాటిల్లినప్పుడు పరిహారం చెల్లించే ‘థర్డ్‌ పార్టీ ఇన్సూరెన్స్‌’. రోడ్డుపై వాహనం తిరగాలంటే.. ఈ బీమా తప్పనిసరి. అయితే, మీ వాహనానికి ఏదైనా నష్టం వాటిల్లితే ఈ బీమా పరిహారం ఇవ్వదు. దీనికోసం ప్రత్యేకంగా ‘ఓన్‌ డ్యామేజ్‌’ పాలసీ తీసుకోవాల్సిందే. కొంతమంది ఈ రెండు పాలసీల మధ్య వ్యత్యాసం తెలియక క్లెయిం చేస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో పూర్తి స్థాయి బీమా లేని క్లెయింలను తిరస్కరిస్తారు. పూర్తిస్థాయి పాలసీ ఉన్నప్పుడు ప్రమాదాలతోపాటు, వరదలు, తుపానులు, భూకంపాలు, కొండ చరియలు విరిగిపడటం లాంటి సందర్భాల్లో వాహనానికి జరిగిన నష్టానికి పరిహారం కోసం క్లెయిం చేసుకోవచ్చు.
* లైసెన్స్‌ అమల్లో ఉందా: కొంతమంది సరైన డ్రైవింగ్‌ లైసెన్సు లేకుండా వాహనాన్ని నడుపుతుంటారు. ఇలాంటి సమయంలో ఏదైనా ప్రమాదం జరిగిందనుకోండి. అప్పుడు బీమా సంస్థ పరిహారం ఇవ్వదు. మోటార్‌ వాహనాల చట్టం ప్రకారం చెల్లుబాటులో ఉన్న డ్రైవింగ్‌ లైసెన్సు లేకుండా వాహనాన్ని నడిపేందుకు వీల్లేదు. అందువల్ల బీమా సంస్థ ఇలాంటి క్లెయింలను స్వీకరించదు.
* మత్తులో నడిపితే..: మద్యం లేదా మాదక ద్రవ్యాల ప్రభావంతో డ్రైవింగ్‌ చేయడం ప్రమాదకరం. ఇది నేరం కూడా. డ్రగ్స్‌, మద్యం సేవించి డ్రైవింగ్‌ చేసినప్పుడు జరిగిన ప్రమాదాల క్లెయింలను బీమా సంస్థలు తిరస్కరిస్తాయి.
ఇతర అవసరాలకు: పాలసీలో పేర్కొన్న అవసరాలకు మాత్రమే వాహనాన్ని వినియోగించాలి. వాహనాన్ని ఏ రకంగా వాడుతున్నారు అన్నది ప్రీమియం నిర్ణయించే అంశాల్లో ఒకటి. కాబట్టి, వాహనం వ్యక్తిగతంగా వాడినప్పుడు, వాణిజ్య అవసరాల కోసం వాడినప్పుడు ప్రీమియంలో వ్యత్యాసం ఉంటుంది. వ్యక్తిగత వినియోగానికి తీసుకున్న వాహనాలను వాణిజ్య, అద్దె, రేసింగ్‌లాంటి వాటి కోసం వినియోగించినప్పుడు క్లెయిం తిరస్కణ తప్పదు.
బీమా సంస్థకు తెలియకుండా: ప్రమాదం జరిగినప్పుడు ముందుగా ఆ విషయాన్ని బీమా సంస్థకు తెలియజేయాలి. చాలామంది దీన్ని పట్టించుకోరు. సొంతంగా మరమ్మతులు చేయిస్తుంటారు. తర్వాత క్లెయిం దరఖాస్తు చేస్తారు. ఇది చాలా సందర్భాల్లో క్లెయిం తిరస్కరణకు కారణం కావచ్చు. ప్రమాదం జరిగిన వెంటనే బీమా సంస్థకు చెబితే.. వారు ఒక సర్వేయర్‌ను సంఘటన స్థలానికి పంపిస్తారు. సర్వేయర్‌ జరిగిన నష్టాన్ని, మరమ్మతు ఖర్చును అంచనా వేస్తారు. దీన్నిబట్టే పరిహారం అందుతుంది.


మినహాయింపులు: వాహన బీమాలో కొన్ని తప్పనిసరి మినహాయింపులు ఉంటాయి. వీటిని తీసేసిన తర్వాతే పరిహారం లభిస్తుంది. ఇది రూ.1,000 నుంచి రూ.1,500 వరకూ ఉంటుంది. బీమా సంస్థను బట్టి, ఈ మొత్తం మారుతుంది. మీ క్లెయిం రూ.10వేలు అనుకుంటే.. తప్పనిసరి మినహాయింపు రూ.1,500 పోను మిగతా రూ.8,500 పరిహారమే అందుతుంది. వాహనంలోని కొన్ని విడిభాగాలకూ క్లెయిం వర్తించకపోవచ్చు. పాలసీ తీసుకునేటప్పుడు ఈ విషయాన్ని ఒకటికి రెండుసార్లు తెలుసుకోవాలి.
క్లెయిం ప్రక్రియ ఎలాంటి ఇబ్బందీ లేకుండా సాగాలంటే.. బీమా సంస్థ నెట్‌వర్క్‌ కేంద్రాల్లోనే వాహనాన్ని మరమ్మతు చేయించడం మంచిది. మీరు సొంతంగా మరమ్మతు చేయించుకున్నప్పుడు క్లెయిం ఫారాన్ని పూరించి, అవసరమైన అన్ని బిల్లులనూ అందించాలి. అప్పుడే బీమా సంస్థ పరిహారం అందిస్తుంది.
టీఏ రామలింగం, చీఫ్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌, బజాజ్‌ అలియాంజ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని