Surge price: క్యాబ్‌ కంపెనీల ‘సర్జ్‌’ బాదుడు.. ఈ టిప్స్‌ ఎప్పుడైనా పాటించారా?

Tips to avoid sudden fare hike: రద్దీ సమయాల్లో క్యాబ్‌ బుక్‌ చేసినప్పుడు ప్రయాణికులపై ‘సర్జ్‌ప్రైస్‌’ భారం పడుతుంటుంది. దీన్నుంచి తప్పించుకోవాలంటే కొన్ని టిప్స్‌ పాటించండి.

Updated : 14 Dec 2022 15:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రూట్‌ తెలీకపోయినా పర్లేదు.. బస్‌ నంబర్ల గురించి చింతే లేదు.. చేతిలో ఓ స్మార్ట్‌ఫోన్‌, సరిపడా క్యాష్‌ ఉంటే చాలు నచ్చిన చోటుకు ప్రయాణించొచ్చు. అంతలా మన ప్రయాణ గతిని మార్చేశాయి ఓలా (Ola), ఉబర్‌ (Uber) వంటి క్యాబ్‌ సంస్థలు. ఒకప్పుడు ప్రయాణికులకు ‘డిస్కౌంట్లు’ రుచి చూపించిన ఈ కంపెనీలు.. ఇప్పుడు ‘సర్జ్‌ప్రైస్‌’ (Surge price) పేరిట భారం మోపుతున్నాయి. మరి ఈ భారం నుంచి తప్పించుకోవడం ఎలా?

సాధారణంగా A అనే చోటు నుంచి B అనే చోటుకు ప్రయాణించాలంటే రూ.200 అవుతుంది అనుకుందాం. అయితే, మనకు అవసరమైనప్పుడు మాత్రం ఒక్కోసారి ఈ ధర రూ.250 నుంచి రూ.300 వరకు చూపిస్తుంది. దీన్నే ‘సర్జ్‌ప్రైస్‌’గా పేర్కొంటున్నాయి క్యాబ్‌ కంపెనీలు. సాధారణంగా తక్కువమంది డ్రైవర్లు అందుబాటులో ఉండి.. ఎక్కువమంది ప్రయాణికులు క్యాబ్‌లు బుక్‌ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఈ విధంగా జరుగుతుందని చెబుతున్నాయి. ఇలాంటి సందర్భంలో మన చేతి చమురు వదులుతుంటుంది. అయితే, ఆ భారం నుంచి ఎలా తప్పించుకోవచ్చో చూద్దాం..

  • సినిమా అయిపోయాకనో, రైల్వే స్టేషన్‌ బయటకొచ్చాకో ఎక్కువ మంది ఒకేసారి క్యాబ్‌లు బుక్‌ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. దీనివల్ల డిమాండ్‌ ఏర్పడి సర్జ్‌ప్రైస్‌ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ ఉన్న చోటు నుంచి కాకుండా కాస్త ముందుకెళ్లి బుక్‌ చేయడం మంచిది.
  • సర్జ్‌ప్రైస్‌ రోజంతా ఉండదు. రోజులో కొద్ది సేపు మాత్రమే. కాబట్టి ఎక్కువ రద్దీ సమయాల్లో క్యాబ్‌ బుక్‌ చేయకుండా ఉండడానికి ప్రయత్నించండి. ఒకవేళ అత్యవసర ప్రయాణమైతే తప్పదనుకోండి.
  • ప్రధాన నగరాల్లో ఓలా, ఉబర్‌తో పాటు ఇతర క్యాబ్‌ సంస్థలు కూడా ఈ సేవలను అందిస్తున్నాయి. సర్జ్‌ప్రైస్‌ చూపిస్తుంటే వాటిలోనూ ప్రయత్నించండి.
  • ప్రయాణానికి ముందే పదేపదే యాప్‌ను ఓపెన్‌ చేసి చూడడం వల్ల కూడా ధరలు పెరిగే అవకాశం ఉంది. క్యాబ్‌ బుక్‌ చేసేటప్పుడు దీన్ని దృష్టిలో పెట్టుకోండి.
  • ప్రయాణానికి కాసేపు ఉందనగా క్యాబ్‌ బుక్‌ చేస్తే ‘సర్జ్‌ప్రైస్‌’కి దొరికిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ప్రయాణానికి ముందుగానే షెడ్యూల్‌ చేసి పెట్టుకుంటే భారం నుంచి తప్పించుకోవచ్చు. పైగా చివరి నిమిషంలో క్యాబ్‌ బుక్‌ అవుతుందా లేదా అన్న చింత కూడా మీకు తప్పుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు