Two Wheeler Loan: బైక్‌ లోన్‌ త్వరగా కావాలా.. ఈ టిప్స్‌ పాటించండి!

బైక్‌ లోన్‌ త్వరగా మంజూరు కావాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం...

Published : 10 May 2022 11:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రద్దీగా ఉండే భారత రోడ్లపై ప్రయాణానికి బైక్‌లు, స్కూటీల వంటి ద్విచక్రవాహనాలు (Two-Wheeler) అనువుగా ఉంటాయి. కరోనా మహమ్మారి వెలుగులోకి వచ్చిన తర్వాత టూ-వీలర్ల (Two-Wheeler)కు గిరాకీ భారీగా పెరిగింది. చాలా మంది వ్యక్తిగత వాహనాల ద్వారా ప్రయాణానికి మొగ్గుచూపడమే ఇందుకు కారణం. అయితే, ఎక్కువ మంది రుణం (Loan) ద్వారానే వాహనాన్ని కొనుగోలు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇప్పటికీ.. ఆ డిమాండ్‌ కొనసాగుతూనే ఉంది. మరి త్వరగా ద్విచక్రవాహన రుణం (Two-Wheeler Loan) మంజూరు కావాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం..

లోన్‌కి దరఖాస్తు చేసుకోవడానికి ముందు ఈ కింది విషయాలపై ఓ స్పష్టతకు రావాలి...

  • వడ్డీరేటు (Interest Rate): డిమాండ్‌ పెరిగిన నేపథ్యంలో బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు పోటీ పడి వడ్డీరేట్ల (Interest Rate)ను తగ్గించాయి. అయితే, తాజాగా ఆర్‌బీఐ వడ్డీరేట్లను పెంచడంతో ఆ ప్రభావం దీనిపైనా ఉంటుంది. మనం ఎంచుకునే కాలపరిమితిని బట్టి వడ్డీరేటు ప్రస్తుతానికి 7-18 శాతం మధ్య ఉంది. దీంట్లో ఎంతమేర మీరు భరించగలరో ముందే నిర్ణయించుకుంటే పని సులువవుతుంది.
  • ఎంత మొత్తం (Principal Amount): వాహన కొనుగోలుకు కావాల్సిన మొత్తాన్ని సంస్థలు రుణరూపంలో అందజేయవు. ఎంతో కొంత డౌన్‌పేమెంట్‌ చెల్లించాల్సి ఉంటుంది. మరి ఎంత మొత్తం రుణం ఇవ్వాలనేది ‘లోన్ టు వాల్యూ రేషియో (LTV)’ ఆధారంగా నిర్ణయిస్తారు. అంటే వాహన విలువలో ఎంత మొత్తం లోన్‌ ఇవ్వవచ్చనేది ఈ నిష్పత్తి తెలియజేస్తోంది. సాధారణంగా బ్యాంకులు వాహన మొత్తం విలువలో 80 శాతం రుణం కింద అందజేస్తాయి. మిగిలిన 20 శాతం సొమ్మును మనమే భరించాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఓ బైక్‌ విలువ రూ.1లక్ష అయితే, బ్యాంకులు రూ.80 వేలు రుణం ఇస్తాయి. మిగిలిన రూ.20 వేలు మనం చేతి నుంచి కట్టాల్సి ఉంటుంది. ఒకవేళ అంతకంటే ఎక్కువ కావాలన్నా కొన్ని బ్యాంకులు ఇవ్వడానికి ముందుకు వస్తున్నాయి. కానీ, వాటిని అధిక నష్టభయంతో కూడుకున్న రుణాలుగా పరిగణించి.. వడ్డీరేటు ఎక్కువ వసూలు చేసే అవకాశం ఉంది.
  • కాలపరిమితి (Tenure): రుణం తిరిగి చెల్లించడానికి 12-48 నెలల కాలపరమితి ఎంచుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.

(Also Read: టూ-వీలర్‌ లోన్‌ ఎంత కాలపరిమితితో తీసుకోవాలి?)

  • ఈఎంఐ: తీసుకొన్న రుణంలో కొంతమొత్తంతో పాటు దానిపై వడ్డీని నెలనెలా చెల్లించాలి. అన్ని రుణాల ఈఎంఐల మొత్తం మీ నెలవారీ ఆదాయంలో 60 శాతం మించకుండా చూసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు.

రుణం త్వరగా మంజూరు కావాలంటే..

👉 సరైన వివరాలు అందజేయాలి: లోన్‌ (Loan) దరఖాస్తులో ఎలాంటి పొరపాట్లు చేయొద్దు. ఇది చాలా చిన్న విషయంగా అనిపిస్తున్నప్పటికీ.. ఏమాత్రం తప్పులు దొర్లినా రుణ మంజూరు ఆలస్యమవుతుంది. కొన్నిసార్లు మన దరఖాస్తును నిరాకరించే ప్రమాదం కూడా ఉంది.

👉 అర్హత ప్రక్రియ: ఒక్కో సంస్థ ఒక్కో రకమైన అర్హతను నిర్ణయిస్తాయి. అవన్నీ ఉంటేనే రుణం మంజూరవుతుంది. కొన్ని సాధారణ అర్హతలు ఏంటో చూద్దాం.

  • నివాసం: ఒక స్థిరమైన నివాస చిరునామా ఉండాలి. భారత పౌరసత్వం పొంది కనీసం 12 నెలలైనా నిండాలి.
  • వయసు: కనీసం వయసు 18 సంవత్సరాలు.. గరిష్ఠంగా రుణ కాలపరిమితి ముగిసే నాటికి 65 ఏళ్ల వయసు ఉండేలా బ్యాంకులు రుణాన్ని మంజూరు చేస్తాయి.
  • సిబిల్‌ స్కోర్‌: 650పై ఉంటే ఉత్తమం.
  • ఉద్యోగం: ఒక స్థిరమైన ఉద్యోగం చేస్తూ ఉండాలి. లేదంటే స్వయం ఉపాధి రంగంలో ఉన్నవారైతే ఐటీ రిటర్నులు సమర్పించాల్సి ఉంటుంది.

👉 పత్రాలన్నీ సిద్ధం: దరఖాస్తు ప్రక్రియ త్వరగా పూర్తి కావాలంటే.. కేవైసీకి కావాల్సిన పత్రాలన్నీ ముందే సిద్ధం చేసుకోవాలి. ఐడీ ప్రూఫ్‌లు, ఆధార్‌ కార్డు, పాన్‌ కార్డు, శాలరీ స్లిప్పులు, ఐటీ రిటర్నులు, బ్యాంకు స్టేట్‌మెంట్లు వంటి డాక్యుమెంట్లన్నీ సిద్ధంగా ఉంచుకుంటే సమయం ఆదా అవుతుంది. 

👉 ఈఎంఐని ముందే నిర్ణయించుకోండి: రుణం పొందేందుకు మీకు అన్ని అర్హతలు ఉంటే.. నెలకు ఎంత వరకు మీరు ఈఎంఐని భరించగలరో ముందే నిర్ణయించుకోండి. దాన్ని బట్టి కాలపరిమితి, రుణ మొత్తాన్ని అంచనా వేసుకోండి. దీనికి ఆన్‌లైన్‌లో ఈఎంఐ కాలిక్యులేటర్లు అందుబాటులో ఉన్నాయి.

ఒకప్పుడు రుణం కోసం బ్యాంకుల్లో గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. పైగా దరఖాస్తు నింపడం చాలా కష్టతరంగా ఉండేది. కానీ, ఇప్పుడు అలా కాదు. అంతా డిజిటల్‌మయం అయిన తర్వాత ప్రక్రియ చాలా సులభమైపోయింది. పైన తెలిపిన వివరాలన్నీ ముందుగానే సరిచూసుకుంటే.. రుణ మంజూరు ప్రక్రియ వేగంగానే పూర్తయిపోతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని