ఇంటి విలువ‌ను పెంచుకోండిలా.. 

స‌మ‌యానికి, అవ‌స‌రానికి త‌గిన‌ట్లుగా ఇంటిని ఆధునీక‌రించ‌డం ద్వారా ఇంటి విలువ‌తో పాటు జీవ‌న‌కాలం పెరుగుతుంది 

Updated : 15 Dec 2021 22:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొంత‌ మంది ఇంటిని కొనుగోలు చేసి ఫర్నీచర్, పెయింటింగ్‌ వంటి వాటికి ఒకేసారి ఎక్కువ మొత్తంలో పెట్టుబ‌డి పెడ‌తారు. ఆ త‌ర్వాత ప‌ట్టించుకోరు. మ‌రికొంతమంది ఇళ్లలో ఒక‌టీ లేదా అంత‌కంటే ఎక్కువ గ‌దుల‌కు సంబంధించి పూర్తి ప‌ని చేయించ‌కుండా అలానే వ‌దిలేస్తుంటారు. ఈ రెండు ప‌ద్ధతులు మంచివి కావు. ఇంటి నిర్మాణం పూర్తయిన త‌ర్వాత ఇంటిలో ఉన్న ప్ర‌తి గ‌దినీ పూర్తి చేయ‌డం, స‌మ‌యానుగుణంగా ఆధునీక‌రించ‌డం ద్వారా కూడా ఆ ఇంటి విలువ పెరుగుతుంది.

ఆధునిక వ‌స‌తులు, పార్కింగ్ స్థ‌లం: ఇంటి విలువ పెరుగుద‌లకు కొంత స‌మ‌యం ప‌డుతుంది. ఇది రియ‌ల్ ఎస్టేట్ మార్కెట్‌పై ఆధార‌ప‌డి ఉంటుంది. ఇంటిని మ‌రింతగా ఆధునికీకరించడం/ తిరిగి పెట్టుబ‌డులు పెట్ట‌డం ద్వారా విలువ‌ను పెంచుకోవ‌చ్చు. ఉదాహ‌ర‌ణ‌కు, ప్ర‌స్తుతం ఇంటిలో ఉన్న గ‌దులుకు అద‌నంగా మరొక కొత్త‌ గ‌దిని నిర్మించేందుకు రూ.2 ల‌క్ష‌లు ఖ‌ర్చు చేస్తే చ‌ద‌ర‌పు అడుగులు కూడా పెరుగుతాయి. అప్పుడు ఇంటి విలువ ల‌క్ష‌ల్లో పెరుగుతుంది. అదేవిధంగా వంట‌గ‌ది వంటివి ప్ర‌స్తుతం ఉన్న ట్రెండ్‌కి త‌గిన‌ట్లు ఆధునికీకరించడం, పార్కింగ్ స్థ‌లం, స్టోరేజ్ గ‌దుల ఏర్పాటు వంటివి ఇంటి విలువ‌ను పెంచుతాయి. ఇంటి విక్ర‌యంలో వీటి ప్ర‌భావం చాలానే ఉంటుంది. 

మ‌రికొన్ని సంవ‌త్స‌రాలు కొత్త దానిలా: ఇంటి నిర్మాణం ఎంత ముఖ్య‌మో నిర్వ‌హ‌ణ అంతే ముఖ్యం. నిర్వ‌హ‌ణ బాగుంట‌నే ఇంటి లైఫ్ టైమ్ పెరుగుతుంది. ఈ చిన్న విష‌యాన్ని చాలా మంది విస్మ‌రిస్తుంటారు. ఇంటికి సంబంధించి చిన్న చిన్న మ‌ర‌మ్మ‌త్తులు వ‌చ్చిన‌ప్పుడు, అవి పెద్దవి కాక‌ముందే రిపేర్ చేయించాలి. పెయింటింగ్స్‌ వంటివి చేయిస్తుంటే ఇళ్లు కొత్త దానిలా ఉంటుంది. దీంతో విలువ పెరిగే అవ‌కాశం ఉంది. 

పెట్టుబ‌డుల‌పై స్ప‌ష్ట‌త ఉండాలి: ఇంటిపై రీ-ఇన్వెస్ట్ చేసేవారు ఎందుకు పెట్టుబ‌డి పెడుతున్నామనే అంశంపై స‌రైన స్ప‌ష్ట‌త ఉండాలి. అమ్మాల‌నుకుంటున్నారా? ఎక్కువ అద్దె కావాల‌నుకుంటున్నారా? మీరు నివ‌సించేందుకా? ఈ ప్ర‌శ్న‌లకు స‌మాధానం తెలిస్తే ఇంటిని ఆధునికీరించేందుకు ఎంత పెట్టుబ‌డి పెట్టాలి? అనే దానిపై అవ‌గాహ‌న ఉంటుంది. ఉదాహ‌ర‌ణ‌కు ఒకే ర‌కంగా ఉన్న రెండు ఇళ్లు అమ్మ‌కానికి వ‌చ్చిన‌ప్పుడు, ఆధునికీకరించిన ఇంటికి కొనుగోలుదారులు ప్రాధాన్య‌ం చూపుతారు. అందుకే ఇంటిపై ఖర్చు చేసేముందు ఎందుకు చేస్తున్నారో స్ప‌ష్ట‌త ఉండాలి.

విక్ర‌యించేందుకు: ఇంటిని అమ్మేందుకు అయితే, ఇంటిని కొనుగోలు చేసేవారి వైపు నుంచి ఆలోచించాలి. ఇంటిని ఆధునికీకరించేందుకు మ‌రీ ఎక్కువ‌ ఖ‌ర్చుపెట్ట‌క‌పోవ‌డం మేలు.

అద్దెకు ఇచ్చేందుకు: ఇంటిలో అద్దెకు దిగేవారు తాము చెల్లించిన అద్దె విలువ‌కు స‌రిపోయే సౌక‌ర్యాలు ఇంటిలో ఉన్నాయా లేదా చూస్తారు. అందంగా, అన్ని సౌక‌ర్యాలు ఉన్న ఇంటిని అద్దెకు తీసుకునేందుకు మొగ్గుచూపుతారు. అద్దెకు ఇచ్చే ముందు చిన్న చిన్న రిపేర్లు ఉంటే చేయించి, పెయింటింగ్ వేయించ‌డం ద్వారా ఇళ్లు ఆక‌ర్షణీయంగా మారుతుంది. దీంతో ఎక్కువ అద్దె వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది. అయితే, ఆఫీసు లేదా ఏదైనా వ్యాపారాలకు ఇచ్చినట్టయితే వారి ప్రకారంగా చేయించడం మంచిది.

నివ‌సించేందుకు: అదే ఇంట్లో మీరు నివ‌సించాల‌నుకుంటే కొత్త‌ ఫ‌ర్నీచ‌ర్‌, పెయింటింగ్ వంటివి చేసుకోవాలి. కాస్త ఖ‌ర్చయినా నాణ్య‌త‌, మ‌న్నిక‌గా ఉండే వ‌స్తువుల‌నే ఇంటి కోసం ఎంపిక చేసుకోవాలి. ఇంటిలో చిన్న పిల్ల‌లు ఉన్న వారు.. వారి ర‌క్ష‌ణ విష‌యంలో త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. ఇంటిని ఆధునికీకరించేందుకు కూడా రుణాలు ల‌భిస్తాయి. వీటిపై ప‌న్ను మిన‌హాయింపు కూడా ఉంటుంది. స్వీయ ఆక్ర‌మిత ఇంటికి రూ.30 వేలు వ‌ర‌కు ప‌న్ను మిన‌హాయింపు క్లెయిమ్ చేసుకోవ‌చ్చు. అద్దెకు ఇచ్చిన ఇంటి రిపేర్ల‌కు ప‌న్ను మిన‌హాయింపు ప‌రిమితి లేదు.

ముగింపు: ఇంటిపై తిరిగి ఖ‌ర్చు చేసే ముందు ఎందుకు చేస్తున్నారో స్ప‌ష్ట‌త ఉండాలి. ఇంటిని అమ్మేందుకు, అద్దెకు ఇచ్చేందుకు లేదా నివ‌సించేందుకు అనేది నిర్ణ‌యించుకొని దానికి త‌గిన‌ట్లుగా పెట్టుబ‌డి పెట్టాలి. ఇంటిని ఏ రకంగా మార్చాల‌నుకుంటున్నారో దానికి త‌గినట్లుగా బ‌డ్జెట్ సిద్ధం చేసుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని