క్రెడిట్‌ స్కోరు.. తగ్గకుండా చూసుకోండి...

తీసుకున్న రుణాలకు వాయిదాలను సక్రమంగా చెల్లిస్తున్నారా? ఒక వ్యక్తి ఆర్థిక క్రమశిక్షణ ఎలా ఉందో తెలుసుకోవాలంటే దీనికి సమాధానం తెలిస్తే చాలు.

Updated : 24 Mar 2023 03:22 IST

తీసుకున్న రుణాలకు వాయిదాలను సక్రమంగా చెల్లిస్తున్నారా? ఒక వ్యక్తి ఆర్థిక క్రమశిక్షణ ఎలా ఉందో తెలుసుకోవాలంటే దీనికి సమాధానం తెలిస్తే చాలు. క్రెడిట్‌ స్కోరు నివేదిక చూసి, ఒక వ్యక్తి ఆర్థిక పరిస్థితి గురించి ఒక అంచనాకు రావచ్చు. బ్యాంకులూ కొత్తగా అప్పు ఇచ్చేటప్పుడు దీన్ని నిశితంగా పరిశీలిస్తాయి. మరి, క్రెడిట్‌ స్కోరు తగ్గకుండా ఏం చేయాలి? తెలుసుకుందాం.

క్రెడిట్‌ స్కోరు 750 పాయింట్లకు మించి ఉందంటే మీ ఆర్థిక క్రమశిక్షణ బాగుందని అర్థం. క్రెడిట్‌ స్కోరు కేవలం మీరు పాత రుణాలను ఎలా చెల్లిస్తున్నారన్నదే చెబుతుంది. అంతేకానీ, మీ ఆదాయం, దానికి ఎంత మేరకు రుణం తీసుకోవాలనే విషయాలను పట్టించుకోదు. అందువల్ల మీ క్రెడిట్‌ స్కోరు 800 పాయింట్లు ఉంది అంటే, మీకు అప్పులు ఇచ్చేందుకు బ్యాంకులకు అభ్యంతరం లేకపోవచ్చు. కానీ, మీ ఆదాయాన్ని పరిశీలించినప్పుడే మీకు నిజంగా ఎంత మేరకు రుణ అర్హత ఉందనేది అర్థం అవుతుంది.

క్రెడిట్‌ కార్డు బిల్లులు, రుణాల వాయిదాలు.. బీమా పాలసీల ప్రీమియం, పోస్ట్‌పెయిడ్‌ ఫోన్‌ బిల్లులు ఇలా ఏదైనా సరే సకాలంలో చెల్లించాలి. క్రెడిట్‌ స్కోరుపై ప్రతికూల ప్రభావం చూపేవి ఇవే. ఆలస్యం చేస్తే మున్ముందు రుణాల లభ్యత అంత తేలిక కాదన్నది గుర్తుంచుకోండి. సాధ్యమైనంత మీ ఆదాయంలో 40 శాతానికి మించి వాయిదాలు ఉండకుండా చూసుకోవడం ఎప్పుడూ మంచిది. బ్యాంకులో కనీసం మూడు నెలల వాయిదాలకు సరిపడా మొత్తం అందుబాటులో ఉంచుకోవాలి. అప్పుడే వాయిదాలు ఎలాంటి ఇబ్బందీ లేకుండా చెల్లించవచ్చు.

ఒకటికి మించి క్రెడిట్‌ కార్డులు ఉండటం ఇప్పుడు సర్వసాధారణం. మీరు మొదటిసారిగా తీసుకున్న కార్డునే ఎప్పటికీ వాడుకోవడం మంచిది. దీనివల్ల మీకు క్రెడిట్‌ చరిత్ర పెరుగుతుంది. దీనికి సకాలంలో చెల్లింపులు చేస్తుంటే.. మీ స్కోరూ పెరిగేందుకు అవకాశం ఉంటుంది.

బ్యాంకులు, క్రెడిట్‌ కార్డు సంస్థలు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు రుణాలను ఇస్తామంటూ సందేశాలు పంపిస్తూనే ఉంటాయి. వీటిని క్లిక్‌ చేయడం, అడిగిన ప్రాథమిక వివరాలు సమర్పించడం వల్ల మీరు రుణానికి దరఖాస్తు చేసుకున్నట్లే అవుతుంది. ఫలితంగా క్రెడిట్‌ స్కోరు తగ్గుతుంది.

ఇతరులు తీసుకున్న రుణానికి మీరు హామీ సంతకం చేశారా? ఎవరికైనా సహ-దరఖాస్తుగా కొనసాగుతున్నారా? వారు రుణ వాయిదాలను సకాలంలో చెల్లించేలా చూసే బాధ్యతనూ మీరు తీసుకోక తప్పదు. వారు చెల్లించకపోతే మీ క్రెడిట్‌ నివేదికపై దాన్ని పేర్కొంటారు. ఫలితంగా స్కోరు తగ్గుతుంది. కాబట్టి, సంతకాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.

సకాలంలో వాయిదాలు, బిల్లులు చెల్లిస్తున్నా సరే.. కొన్నిసార్లు క్రెడిట్‌ నివేదికలో అవి సరిగా నమోదవ్వకపోతే స్కోరు తగ్గే ప్రమాదం ఉంది. కాబట్టి, అధిక రుణాలు, కార్డులు ఉన్నవారు కనీసం ఆరు నెలలకోసారైనా మీ క్రెడిట్‌ నివేదికను తనిఖీ చేసుకోండి. తప్పులు ఉంటే బ్యాంకులను, క్రెడిట్‌ బ్యూరోలను సంప్రదించి, వాటిని సరిచేసుకోండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని