EMI: గృహ రుణం భారం కాకుండా ఏంచేయాలి?

గృహరుణ వడ్డీ రేట్లు మారుతు ఉంటాయి. కాబట్టి, ఈఎంఐలు చెల్లించేటప్పుడు రుణగ్రహీతలు ఎలా వ్యూహత్మకంగా వ్యవహరించాలో ఇక్కడ చూడండి.

Published : 21 Jan 2023 17:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గృహ రుణాలు పొందినవారికి గత కొన్నేళ్లు సంతోషకరమైన కాలం. వడ్డీ రేట్లు 20 ఏళ్లలో కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. కొన్ని నెలల క్రితం వరకు గృహ రుణాల వడ్డీ రేట్లు తగ్గడంతో ఈఎంఐల కాలవ్యవధి కూడా తగ్గింది. ఈ తగ్గుదలతో గృహ రుణాలు ఆకర్షణీయంగా మారాయి. చాలా మంది రుణగ్రహీతలు తమ ఈఎంఐల సంఖ్యను తగ్గిపోవడాన్ని చూశారు. కానీ, ఇప్పుడు కొన్ని నెలల నుంచి వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి. దీంతో ఈఎంఐల సంఖ్య కూడా పెరిగిపోతోంది. చాలా మంది రుణగ్రహీతలు ఈఎంఐ కాలవ్యవధి పెరగడాన్ని చాలా తేలికగా తీసుకుంటారు. కానీ, గృహ రుణం అనేది దీర్ఘకాలం పాటు ఉండే మీ అతిపెద్ద ఖర్చులలో ఒకటి అన్నది మర్చిపోకూడదు. రుణ ఈఎంఐల వ్యవహారాన్ని సరిగ్గా నిర్వహించినట్లయితే మీరు చాలా డబ్బు ఆదా చేయొచ్చు.

ప్రీ-ఈఎంఐ

గృహ రుణాన్ని తీసుకున్న మొదట్లో ఆస్తిని స్వాధీనం చేసుకునేవ రకు మీరు ఊహించిన దానికంటే తక్కువ ఈఎంఐ చెల్లిస్తారు. తక్కువ ఈఎంఐ చెల్లించడానికి కారణమేంటంటే.. ఇంటిని స్వాధీనం చేసుకునే వరకు, బ్యాంకులు రుణంపై వడ్డీని మాత్రమే చెల్లించమని అడుగుతాయి. మీరు అలాగే చెల్లిస్తారు. కానీ ఆ కాలవ్యవధిలో అసలు మొత్తాన్ని ఈఎంఐలో చెల్లించడం లేదు. దాంతో రుణ మొత్తం అలాగే ఉంటుంది. ఒకవేళ ప్రాజెక్టు నిలిచిపోయినా లేదా ఆలస్యమైనా మీరు సంవత్సరాలపాటు ప్రీ-ఈఎంఐలో ఉండిపోతారు. ఇది బ్యాంకుకు లాభం కానీ, మీకు కాదు. మీరు గృహ రుణాన్ని తీసుకున్న వెంటనే అసలు+వడ్డీ మొత్తాన్ని చెల్లించడం ప్రారంభించాలి. దీనివల్ల భవిష్యత్‌లో చెల్లించే వడ్డీ భారం ఇప్పటినుంచే తగ్గడం ప్రారంభమవుతుంది. ప్రీ-ఈఎంఐను పక్కనపెట్టి వెంటనే రెగ్యులర్‌ ఈఎంఐకు మారిపోవాలి.

ఈఎంఐ సమీక్ష

గృహ రుణంపై వడ్డీ రేటు ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు. ఆర్‌బీఐ తన పాలసీ రేట్లను మార్చిన ప్రతిసారీ ఇది మారుతుంది. రెపోరేటు పెరిగినప్పుడల్లా రుణాల వడ్డీరేట్లు పెరుగుతాయి. కాబట్టి మీ రుణంపై వడ్డీ రేటు ప్రతి సంవత్సరం కాన్నిసార్లు మారొచ్చు. దీంతో బ్యాంకు కూడా మీ గృహరుణ ఈఎంఐని మార్చి ఉండవచ్చు. లేదా ఈఎంఐని అలాగే ఉంచుతూ రుణ కాలవ్యవధిని మార్చి ఉండవచ్చు. వడ్డీరేటు మారడంతో రుణ బకాయి కూడా కాలక్రమేణా మారిపోతుంది. మీ ఈఎంఐ, వడ్డీరేటు, రుణ కాలపరిమితి మారిందా లేదా అనే విషయాన్ని ప్రతి 3 నెలలకోసారి చూసుకొని గృహ రుణాన్ని సమీక్షించండి.

మీవంతుగా చేయాల్సింది..

గృహరుణాన్ని తీసుకున్న మొదట్లో మీ బడ్జెట్‌కు తగినట్లుగా గృహరుణ ఈఎంఐ ఉండవచ్చు. కాలక్రమేణా మీ జీతం పెరుగుతుంది. సంవత్సరంలో ఒకసారి బోనస్‌ పొందడమే కాకుండా.. అప్పుడప్పుడూ మరేదైనా కొంత నగదు చేతికి అందవచ్చు. అలాంటి సమయాల్లో మీ రుణానికి ముందస్తు చెల్లింపులు చేయడానికి ఈ అవకాశాలన్నింటినీ ఉపయోగించాలి. రుణ చెల్లింపులు చేసిన ప్రతిసారీ రుణానికి సంబంధించిన కాలవ్యవధిని తగ్గించమని బ్యాంకును అడగండి. ఈఎంఐని తగ్గించమని అడగడం సరైనది కాదు. రుణం అంటేనే వడ్డీతో ముడిపడి ఉన్న అంశం. రుణ కాలపరిమితిని తగ్గించుకోవడం ద్వారా భవిష్యత్‌లో మీరు చెల్లించే వడ్డీని కూడా తగ్గించుకున్నట్లే అని భావించండి. అంతేకాకుండా వడ్డీ రేట్లు తగ్గినప్పుడు మీరు బ్యాంకును ఈఎంఐ అలాగే ఉంచమని, దానికి బదులుగా రుణ కాలవ్యవధిని తగ్గించమని అడగండి. దీనివల్ల దీర్ఘకాలం చెల్లించే అధిక వడ్డీని తగ్గించుకునే అవకాశం ఉంటుంది.

వడ్డీ రేట్లు దాదాపు 2% పెరిగి, రుణ ఈఎంఐ మొత్తాన్ని మార్చకుండా ఉంచినట్లయితే.. రూ.ఒక కోటి రుణంపై దాదాపు రూ.48 లక్షలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని పై పట్టికలో చూడొచ్చు. ఈఎంఐ మొత్తాన్ని పెంచడం లేదా ముందస్తు చెల్లింపులను చేయడం ద్వారా వడ్డీ రేట్ల పెరుగుదలను ఎదుర్కోవడం ఉత్తమం.

రుణాన్ని ముందుగానే క్లోజ్‌ చేయొచ్చా?

రుణ కాలవ్యవధి ముగిసే సమయానికన్నా ముందే రుణ ఖాతాను క్లోజ్‌ చేయాలనే ఆలోచన మీకు రావచ్చు. కానీ, తొందరపడకండి. రుణం ముగిసే సమయానికి, ఈఎంఐ చాలా వరకు అసలుతో కూడుకున్నది, వడ్డీ మొత్తం చిన్న భాగమేనని గుర్తుంచుకోండి. మీ దగ్గర మిగులు డబ్బు ఉన్నప్పుడు, గృహ రుణాన్ని ముందుగానే పూర్తి చేసే బదులుగా.. ఆ డబ్బును మీ ఇన్వెస్ట్‌మెంట్‌ పోర్ట్‌ఫోలియోకు తరలించడం ఉత్తమం. పైగా గృహ రుణం మంచి ఆదాయ పన్ను మినహాయింపులను కూడా అందిస్తుంది. కాబట్టి మీకు ఇతర పన్ను మినహాయింపులు ఉంటే తప్ప రుణాన్ని కొనసాగించడం మంచిది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు