Rent: మీ ఇంటి అద్దె ఖర్చు తగ్గించుకోవడానికి కొన్ని చిట్కాలు

పట్టణ ప్రాంతాల్లో ఉన్నవారి ఖర్చులో ఇంటి అద్దె గణనీయమైన భాగం. దీన్నీ తగ్గించుకోవడానికి కొన్ని పద్ధతులు ఇక్కడ ఉన్నాయి.

Published : 16 Jan 2023 16:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పట్టణాల్లో అద్దె ఇళ్లల్లో నివసించేవారు గణనీయమైన సంఖ్యలోనే ఉంటారు. నగరాలకు వలసవచ్చేవారిలో ఎక్కువ మంది అద్దెకుండడానికే ఆసక్తి చూపుతారు. ఇందుకు బలమైన ఆర్థిక కారణాలు లేకపోలేదు. రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ చాలా ఖరీదైన వ్యవహారంగా మారడంతో ఇళ్ల ధరలు చాలా మందికి అందుబాటులో ఉండడం లేదు. దీని కారణంగా మధ్య తరగతి ప్రజలు అద్దె ఇళ్లను ఆశ్రయించక తప్పడం లేదు.  కానీ, ఇంటి అద్దెలు కూడా సంపాదనలో గణనీయమైన భాగాన్ని ఆక్రమిస్తున్నాయి. అయితే ఇంటి అద్దెలను తగ్గించుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. అవేంటో చూడండి.

దూరం అనుకోకూడదు

సిటీకి దగ్గర్లో లేక మెయిన్‌ రోడ్‌కు చాలా దగ్గర్లోనే అద్దె ఇల్లు కావాలని ఆశించొద్దు. ఇటువంటి ప్రదేశాల్లో అద్దెలు సాధారణంగానే ఎక్కువగా ఉంటాయి. మెయిన్‌ రోడ్‌కు అర కిలోమీటర్‌, కిలోమీటర్‌ దూరంలో ఇంటిని ఎంచుకోండి. ఇంటి అద్దె గణనీయంగా తగ్గే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ రోజుల్లో ప్రతి మూలకూ అన్ని సౌకర్యాలు వచ్చేస్తున్నాయి. నిత్యావసర వస్తువుల మార్కెట్లు, స్కూల్స్‌, వాహన రవాణా, బ్యాంకింగ్‌ సౌకర్యం చాలా లోపల ప్రాంతాలకు కూడా  అందుబాటులో ఉంటున్నాయి. కాబట్టి ఈ ప్రాంతాల్లో అద్దెకు ఇల్లు చూసుకోవడం మంచిది.

ఇండిపెండెంట్‌ ఇల్లు, తక్కువ ఛార్జీలు

పట్టణాల్లో అపార్ట్‌మెంట్‌ సంస్కృతి చాలా ఎక్కువ. ఇలాంటి నివాసాల్లో అద్దెలు సాధారణంగా ఎక్కువే ఉంటాయి. అదనంగా నిర్వహణ ఛార్జీలు ఉంటాయి. కొన్ని సమయాల్లో నీటి ఛార్జీలు కూడా వసూలు చేస్తారు. ఇవి మధ్యతరగతి కుటుంబానికి అదనపు భారమే అని చెప్పొచ్చు. వీటిలో ఉండడం కంటే కాస్త దూరమైనా ఇండిపెండెంట్‌ పోర్షన్‌లో ఉండడం మంచిది. నిర్వహణ ఛార్జీలు చాలా వరకు ఉండవు. ఉన్నా కూడా చాలా తక్కువే ఉంటాయి. ఇంటి యజమానితో మంచి రిలేషన్‌షిప్‌ మెయింటైన్‌ చేస్తూ, సక్రమంగా అద్దె చెల్లించేవారయితే యజమాని అద్దెను తగ్గించొచ్చు లేదా ప్రతి సంవత్సరం లీజు/అద్దె ఒప్పందాన్ని పునరుద్ధరించేటప్పుడు మీ విశ్వసనీయత కారణంగా అద్దెను పెద్దగా పెంచకపోవచ్చు.

చెల్లింపులు

ఇంటి అద్దె నగదు రూపంలో చెల్లించే రోజులు పోయాయి. ఇప్పుడు యాప్‌లు, క్రెడిట్‌ కార్డుల ద్వారా ఆన్‌లైన్‌లో అద్దెను చెల్లించవచ్చు. క్యాష్‌బ్యాక్‌, ఇతర ఆన్‌లైన్‌ చెల్లింపుల ఆఫర్లతో నెలవారీ అద్దెలో కొద్ది మొత్తాన్ని ఆదా చేసుకోవచ్చు. అద్దె చెల్లింపులను ఆటోమేట్‌ కూడా చేయవచ్చు. యూపీఐ ఉపయోగించి కూడా అద్దెను చెల్లించవచ్చు.

ఇంకొకరికి వసతి, స్థల మార్పు

మీ ఇంటిలో మరొక వ్యక్తికి వసతి కల్పించగలిగితే ఇంటి అద్దెలో కొంత ఆదా చేసుకోవచ్చు. మీ బంధువుల తరఫున వారిని పేయింగ్‌ గెస్ట్‌గా తీసుకోవచ్చు. మీరు సింగిల్‌ వ్యక్తి అయితే నమ్మకమున్న ఇతర వ్యక్తులను ఫ్లాట్‌మేట్‌గా ఎంచుకోవచ్చు.

తరచూ ఇల్లు మారొద్దు

ఇంటికి అద్దెకు దిగేటప్పుడు నీటి పైప్‌లు, స్విచ్ బోర్డులు, ఏసీ, వాషింగ్‌ మెషిన్‌ల కనెక్షన్లు వంటివి ఫిటింగ్‌ చేయించుకోవడం చాలా మంది గృహస్తులు చేసే పనే. తరచూ ఇల్లులు మారేవారికి ఈ అదనపు ఫిటింగ్‌లు వ్యయమవుతాయి. అదనంగా సామాన్ల రవాణా ఖర్చు ఉండనే ఉంటుంది. అంతేకాకుండా ప్రస్తుతమిచ్చే ఇంటి అద్దెకు సమానమైన ఖర్చుతో వేరే ప్రదేశంలో ఇల్లు లభించకపోవచ్చు. ఇంకా కొత్త యాజమాని అద్దె అడ్వాన్సులు ఎక్కువ కాలానికి అడగొచ్చు. ఇవన్నీ కూడా సామాన్యుడికి ఆర్థిక ప్రతిబంధకాలే, కాబట్టి తప్పనిసరైన పరిస్థితుల్లోనే వేరే ఇంటికి మారడం మంచిది.

చివరిగా: ప్రతి నెలా అధిక అద్దె కారణంగా మీరు ఇబ్బంది పడుతున్నప్పుడు.. ఇటువంటి చిన్న చిట్కాలు మీ ఖర్చులను తగ్గించడంలో సహాయపడతాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు