Investments: 15 15 15 రూల్‌తో 15 ఏళ్లలో ₹కోటి సంపద!

మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేయడం ద్వారా రూ.1 కోటి సంపాదించాలనుకుంటున్నారా?....

Updated : 19 Apr 2022 12:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేయడం ద్వారా రూ.1 కోటి సంపాదించాలనుకుంటున్నారా? అయితే, మీకోసం ఆర్థిక నిపుణులు ఒక నియమాన్ని రూపొందించారు. దాన్నే 15-15-15 మ్యూచువల్‌ ఫండ్‌ (Mutual Fund - MF) రూల్‌ అంటారు. నెలకు ఎంత మదుపు చేయాలి? ఎంత కాలం చేయాలి? కనీసం ఎంత రాబడి వచ్చేలా చూసుకోవాలి? వంటి విషయాలను ఇది తెలియజేస్తుంది.

మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేయడం అంటే పరోక్షంగా స్టాక్‌ మార్కెట్‌ (Stock Market)లో పెట్టుబడి పెట్టడమే. అందుకే వీటిలోనూ నష్టభయం ఉంటుంది. మదుపు చేసే వారి తరఫున ఫండ్‌ మేనేజర్లు స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడి పెడతారు. ఎంఎఫ్‌లలో మదుపు చేసేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంట్లో వచ్చే రాబడి దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణాన్ని (Inflation) అధిగమించడమే అందుకు కారణం.

రూల్‌లో ఉన్న 15 సంఖ్య మూడుసార్లు ఉందని గమనించొచ్చు. ఒకటి వృద్ధిరేటు (Growth Rate), మరొకటి కాలపరిమితి (Tenure), చివరది నెలవారీ మదుపు మొత్తాన్ని సూచిస్తుంది. ఏటా 15 శాతం రాబడినిచ్చే ఫండ్లలో మీరు మదుపు చేస్తున్నట్లయితే.. వరుసగా 15 ఏళ్ల పాటు (180 నెలలు), నెలకు రూ.15 వేలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అప్పుడు కాలపరిమితి ముగిసిన తర్వాత మీకు వచ్చే మొత్తం రూ.1 కోటి చేరుతుంది.

మీరు మొత్తం పెట్టుబడి పెట్టేది - రూ.27 లక్షలు (₹15000x180నెలలు)

మీకు వచ్చే లాభం - రూ.73 లక్షలు

ఒకవేళ మీరు మీ పెట్టుబడిని మరో 15 ఏళ్ల పాటు కొనసాగిస్తే.. మీ సంపద పదింతలు పెరుగుతుంది.

30 ఏళ్లలో మీరు పెట్టే పెట్టుబడి - రూ.54 లక్షలు (₹15,000x360నెలలు)

మీ చేతికి వచ్చే మొత్తం - రూ.10.38 కోట్లు

లాభం - రూ.9.84 కోట్లు

15-15-15 రూల్‌ రెండు విషయాలను పరిగణనలోకి తీసుకుంటుంది. ఒకటి క్రమానుగత పెట్టుబడి (SIP) మార్గం. మరొకటి డబ్బు కాంపౌండింగ్‌ (Money Compounding)కు ఉన్న శక్తి. సిప్‌ ద్వారా ఆర్థిక క్రమశిక్షణ అలవడుతుంది. దీర్ఘకాల మదుపు వల్ల మార్కెట్‌ ఒడుదొడుకులను కూడా అధిగమించవచ్చు. మ్యూచువల్‌ ఫండ్ల ద్వారా మదుపు చేస్తున్నాం కాబట్టి మార్కెట్లను నిశితంగా పరిశీలించాల్సిన అవసరం కూడా ఉండదు. అయితే, మీ రాబడిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తే స్టాక్‌ మార్కెట్‌పై కొంత అవగాహన వస్తుంది. మరోవైపు మ్యూచువల్‌ ఫండ్ల నుంచి ఎప్పుడైనా బయటకు రావొచ్చు. పైగా ఏదైనా ఫండ్‌ మంచి రాబడినివ్వకపోతే.. వెంటనే మరోదానికీ బదిలీ అయ్యే అవకాశం ఉంటుంది. డబ్బు కాంపౌండింగ్‌ని ఆసరాగా చేసుకొని తక్కువ నష్టభయంతో సంపదను సృష్టించాలనుకుంటే 15-15-15 రూల్‌ ద్వారా మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేయడం ఉత్తమమైన మార్గమని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని