SIP: సిప్‌ చేస్తున్నారా.. ఈ 5 తప్పులు చేయొద్దు!

దీర్ఘకాలంలో పెద్ద మొత్తంలో సంపదను సృష్టించుకోవడానికి సిప్‌ ఒక సులభమైన మార్గం. కానీ, కొన్ని పొరపాట్ల వల్ల ఆశించిన ఫలితాలను అందుకోలేరు. మరి ఆ పొరపాట్లేంటో చూద్దాం...

Updated : 27 Sep 2022 12:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దీర్ఘకాలంలో సంపదను సృష్టించడానికి క్రమానుగత పెట్టుబడి విధానం (SIP) అత్యంత సులభమైన మార్గం. క్రమశిక్షణతో క్రమం తప్పకుండా మదుపు చేస్తూ ఉంటే పెద్ద మొత్తంలో డబ్బును కూడబెట్టుకోవచ్చు. అయినప్పటికీ, కొంతమంది కొన్ని చిన్న చిన్న పొరపాట్లు చేయడం వల్ల వారి SIP రాబడిని పెంచుకోవడంలో విఫలమవుతుంటారు! మరి ఆ తప్పులేంటి? వాటిని ఎలా నివారించొచ్చో చూద్దాం..

క్రమం తప్పొద్దు..

SIP అనేది మీకు ఆర్థిక భరోసానిచ్చే ఓ మంచి అలవాటు. అయితే, క్రమం తప్పుకుండా చెల్లిస్తేనే ఆశించిన ప్రయోజనాన్ని పొందగలుగుతారు. మధ్యలో కొన్ని వాయిదాలను దాటవేస్తే గనక తుది రాబడిలో వ్యత్యాసం గణనీయంగా ఉంటుంది. దీన్ని ఒక ఉదాహరణతో అర్థం చేసుకుందాం...

మీరు జనవరి 2007 నుంచి జూన్ 2022 వరకు నిఫ్టీ 50లో నెలవారీ SIPల ద్వారా రూ. 10,000 పెట్టుబడి పెట్టారని అనుకుందాం. ఇది 15 సంవత్సరాల 6 నెలల వ్యవధి. ఈ 186 నెలల్లో మీరు చేసే పెట్టుబడి మొత్తం రూ.18.60 లక్షలు (186 నెలలు x రూ.10,000). సిప్‌ కాలపరిమితి ముగిసే సమయానికి 11.9% సగటు వార్షిక రేటుతో పెట్టుబడి మొత్తం విలువ రూ.53.6 లక్షలకు చేరుతుంది. కానీ మీరు ప్రతి సంవత్సరం డిసెంబర్‌లో SIPని చెల్లించలేదనుకుందాం. తద్వారా 15 SIPలను కోల్పోయినట్లయితే, మీ మొత్తం పెట్టుబడి విలువ రూ.49.4 లక్షలు మాత్రమే. కేవలం 15 SIPలు అంటే రూ.1.5 లక్షలు (రూ.10,000x15) ఎగవేయడం వల్ల మీరు రూ.4.2 లక్షలు కోల్పోతారు. అందువల్ల, స్టాక్ మార్కెట్లలో దీర్ఘకాలికంగా పెట్టుబడి పెట్టేటప్పుడు ఓపికగా క్రమశిక్షణతో వ్యవహరించాలి.

సిప్‌ మొత్తాన్ని పెంచాలి..

చాలా మంది మదుపర్లు వారి ఆదాయం పెరిగినప్పుడు SIP మొత్తాన్ని కూడా పెంచాలన్న విషయాన్ని విస్మరిస్తారు. ఇది పెద్ద తప్పు. ఎందుకంటే కెరీర్‌లో పురోగతి సాధించినప్పుడు మీ సంపాదన పెరుగుతుంది. జీవనశైలి కూడా మెరుగుపడుతుంది. ఖర్చులు పెరుగుతాయి. అలాంటప్పుడు పెట్టుబడి మొత్తాన్ని కూడా పెంచకపోతే మెరుగైన జీవనశైలిని కొనసాగించడం కష్టం. అటువంటి పరిస్థితులను నివారించడానికి నెలవారీ SIP మొత్తాన్ని క్రమానుగతంగా పెంచుకుంటూ పోవాలి. మీ ఇన్వెస్ట్‌మెంట్ కార్పస్ పెరుగుతున్న కొద్దీ.. కాంపౌండింగ్‌ ఎఫెక్ట్‌ వల్ల రాబడి మరింత అధికమవుతుంది. దీన్ని ఒక ఉదాహరణతో అర్థం చేసుకుందాం...

మీరు నెలవారీ SIP రూ.5,000తో ప్రారంభించారని అనుకుందాం.సగటు వార్షిక రాబడి రేటు 12% అని అనుకుంటే.. ప్రతి ఏడాది మీరు 5 శాతం చొప్పున మీ సిప్‌ను పెంచుకుంటూ పోతే 20 ఏళ్లలో మీ రాబడి ఎలా మారుతుందో చూద్దాం...

పై ఉదాహరణలో, ప్రతి సంవత్సరం నెలవారీ SIP మొత్తంలో కేవలం రూ.1000 (రూ.5,000లో 20%) పెంచడం వల్ల  20 సంవత్సరాల తర్వాత మీ రాబడి రూ.1.81 కోట్లు అవుతుంది. అదే ఒకవేళ మీరు ఏమీ పెంచకపోతే.. రూ.49.66 లక్షలు మాత్రమే అందుకుంటారు. వ్యత్యాసం దాదాపు మూడు రెట్లు ఉండడం గమనించొచ్చు.

IDCW ప్లాన్స్‌ కంటే గ్రోత్‌ ప్లాన్స్‌ మేలు..

సిప్‌ వల్ల పెద్ద మొత్తంలో సంపద సృష్టించుకోవడానికి గల ముఖ్య కారణం కాంపౌండింగ్‌. అంటే ఏటా వచ్చే రాబడి మన అసలులో చేరుతూ ఉంటుంది. దానిపై కూడా రాబడి వస్తుంటుంది. ఒకరకంగా చెప్పాలంటే చక్రవడ్డీ వలేనన్నమాట! కానీ, కొంత మంది మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లలో IDCW ప్లాన్‌ను (గతంలో దీన్ని డివిడెండ్ ప్లాన్ అని పిలిచేవారు) ఎంచుకుంటుంటారు. IDCW ప్లాన్‌ ఎంచుకుంటే మీరు మధ్యమధ్యలో కొంత రాబడిని పొందుతూ ఉంటారు. పర్యవసానంగా, కాంపౌండింగ్‌ ప్రయోజనాన్ని పొందలేరు. అందుకే SIPని ప్రారంభించినప్పుడు గ్రోత్ ప్లాన్‌ని ఎంచుకోండి. దీంట్లో మీకు మధ్యలో ఎలాంటి ఆదాయం అందదు. ఏటా వచ్చే రాబడిని ఫండ్‌ హౌస్‌లు తిరిగి పెట్టుబడి పెడతాయి. ఫలితంగా మీ సంపద మరింత వేగంగా వృద్ధి చెందుతుంది. పైగా IDCW ప్లాన్‌ వల్ల పన్ను ప్రయోజనాలు కూడా ఉండవు.

లక్ష్యాలకు అనుసంధానించాలి..

మీకు భవిష్యత్తులో సాధించాల్సిన విషయాలు చాలా ఉండొచ్చు. కొన్ని స్వల్పకాలికమైతే.. మరికొన్ని 10, 20 లేదా 30 ఏళ్లు పట్టే దీర్ఘకాలిక లక్ష్యాలు ఉంటాయి. కాబట్టి, మీ లక్ష్యాలను పరిగణనలోకి తీసుకోకుండా ఒకటి లేదా రెండు SIPలను ప్రారంభించినట్లయితే అది పెద్ద పొరపాటే అవుతుంది. అందువల్ల, SIPను పదవీ విరమణ, పిల్లల చదువు, పిల్లల పెళ్లి, విదేశీ విహారయాత్ర వంటి స్పష్టంగా నిర్దేశించుకున్న లక్ష్యాలకు అనుసంధానించుకోవాలి. ఒకవేళ మీరు SIPలను మధ్యలోనే నిలిపివేసినట్లయితే లక్ష్యాలను చేరుకోవడం కష్టసాధ్యం అవుతుంది.

ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి..

సిప్‌ ప్రారంభంతో మీరు పెట్టుబడి ప్రయాణం ఆరంభమైందన్నమాట! కాబట్టి దాని నుంచి వచ్చే రాబడి మీ లక్ష్యాలకు అనుగుణంగా ఉందో.. లేదో.. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలి. ఏదైనా స్కీం సరైన రాబడి ఇవ్వడం లేదనుకుంటే మరో దానికి బదిలీ అయ్యే అంశాన్ని పరిశీలించాలి. దాదాపు 18-24 నెలల పాటు ఏదైనా స్కీం మీరు ఆశించిన స్థాయిలో రిటర్న్స్‌ ఇవ్వకపోతే.. దాని నుంచి నిష్క్రమించొచ్చు! మీ పోర్ట్‌ఫోలియోను కూడా ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి. ఉదాహరణకు మీరు మీ పెట్టుబడిని 60% ఈక్విటీలకు, 40% స్థిర-ఆదాయ మార్గాలకు కేటాయించారని అనుకుందాం. ఒకవేళ ఈక్విటీల నుంచి రాబడి ఆశించిన స్థాయిలో లేకపోతే.. వాటి నుంచి కొంత ఉపసంహరించుకొని స్థిర ఆదాయ సాధనాల్లోకి మళ్లించడం మేలు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts