టీసీఎస్‌ CEO వేతనం తెలుసా..? వారి కంటే తక్కువే!

CEOs salaries: మన దేశంలో ఐటీ కంపెనీ అనగానే తొలుత గుర్తొచ్చేది టీసీఎస్‌. అగ్రస్థానం ఆ కంపెనీదే. అయితే, సీఈఓల వేతనాల పరంగా మాత్రం ఆ సంస్థ ఐదో స్థానంలో నిలుస్తోంది.

Published : 17 Mar 2023 19:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (TCS) సీఈఓ రాజేశ్‌ గోపీనాథన్‌ తన పదవికి రాజీనామా చేశారు. కె. కృతివాసన్‌ తదుపరి సీఈఓగా వ్యవహరించనున్నట్లు టీసీఎస్‌ వెల్లడించింది. సెప్టెంబరు 15 వరకు రాజేశ్‌ తన విధుల్లో కొనసాగుతారని కంపెనీ పేర్కొంది. గడిచిన ఆరేళ్లుగా టీసీఎస్‌కు సీఈఓగా వ్యవహరించిన రాజేశ్‌ గోపీనాథన్‌ వేతనం ఎంతో తెలుసా? అక్షరాల ఏడాదికి రూ.25.75 కోట్లు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గానూ ఆయన ఈ మొత్తాన్ని వేతనంగా అందుకున్నారు. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 26 శాతం మేర ఆయన వేతనం పెరిగింది. అయితే, వేతనపరంగా ఇతర ఐటీ కంపెనీల సీఈఓలతో పోల్చుకుంటే రాజేశ్‌ గోపీనాథన్‌ వేతనం కాస్త తక్కువే కావడం గమనార్హం.

వేతనాల విషయంలో హెచ్‌సీఎల్‌ సీఈఓ సి విజయ్‌కుమార్‌ అగ్రస్థానంలో ఉన్నారు. ఆయన 2021-22 ఆర్థిక సంవత్సరానికి గానూ ఆయన 123.13 కోట్లు వేతనంగా అందుకున్నారు. టాప్‌-5 కంపెనీల్లో అతి ఎక్కువ వేతనం పొందుతున్న సీఈఓ ఆయనే కావడం గమనార్హం. ఆ తర్వాతి స్థానంలో విప్రో సీఈఓ థియరీ డెలాపోర్టే రెండో స్థానంలో ఉన్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ.79.8 కోట్లు వేతనంగా అందుకున్నారు. ఇన్ఫోసిస్‌ సీఈఓ సలీల్‌ పరేఖ్‌ రూ.71.02 కోట్లతో మూడో స్థానంలో ఉండగా.. టెక్‌ మహేంద్రా సీఈఓ సీపీ గుర్నానీ రూ.63.4 కోట్లతో నాలుగో స్థానంలో నిలిచారు. ఆ తర్వాతి స్థానంలో రాజేశ్‌ గోపీనాథన్‌ ఉన్నారు. కాగా.. ఇటీవల ఇన్ఫోసిస్‌ ప్రెసిడెంట్‌ మోహిత్‌ జోషి తన పదవికి రాజీనామా చేసి భావి ఎండీ, సీఈఓగా టెక్‌ మహీంద్రాలో చేరారు. డిసెంబర్‌లో పదవీ విరమణ చేయనున్న సీపీ గుర్నానీ స్థానంలో జోషి బాధ్యతలు స్వీకరిస్తారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు