Zepto CEO: 5-10 ఏళ్లలో ₹2.5 లక్షల కోట్లకు.. డీమార్ట్‌నీ అధిగమిస్తాం: జెప్టో సీఈఓ

జెప్టో ఆదాయం ఐదు పదేళ్లలో రూ.2.5 లక్షల కోట్లకు చేరుకుంటుందని ఆ కంపెనీ సీఈఓ ఆదిత్‌ పలిచా పేర్కొన్నారు.

Published : 06 Jul 2024 19:24 IST

దిల్లీ: ప్రముఖ క్విక్‌ కామర్స్ సంస్థ జెప్టో (Zepto) విస్తరణకు మరింత అవకాశం ఉందని కంపెనీ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు ఆదిత్‌ పలిచా అన్నారు. సరిగ్గా నిర్వహిస్తే ఇప్పుడున్న రూ.10 వేల కోట్ల వ్యాపారాన్ని రాబోయే 5-10 ఏళ్లలో రూ.2.5 లక్షల కోట్లకు చేర్చగలమన్న విశ్వాసం వ్యక్తంచేశారు. ఆఫ్‌లైన్‌ రిటైల్‌ విభాగంలో అగ్రగామిగా ఉన్న డీమార్ట్‌ను సైతం 18-24 నెలల్లో అధిగమించగలమన్న ధీమా వ్యక్తంచేశారు. దిల్లీలో నిర్వహించిన జేఐఐఎఫ్‌ ఫౌండేషన్‌ డే కార్యక్రమంలో ఈ మేరకు పలిచా మాట్లాడారు.

దేశంలో కిరాణా, గృహ అవసర వినియోగ వస్తువుల మార్కెట్‌ అన్నిటికంటే పెద్దదని పలిచా అన్నారు. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయించే అన్ని కేటగిరీ వస్తువుల కంటే మించిన మార్కెట్‌ ఇది అని పేర్కొన్నారు. వాటిల్లో విక్రయించే ఎలక్ట్రానిక్స్‌, దుస్తులు, ఫర్నీచర్‌ విక్రయాలన్నింటినీ రెట్టింపు చేసినా ఈ మార్కెట్‌ను అందుకోవడం అసాధ్యమన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 650 బిలియన్‌ డాలర్లుగా ఉన్న ఈ మార్కెట్‌ 9 శాతం వార్షిక వృద్ధితో 2028-29 నాటికి 850 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేశారు.

జియో నుంచి కొత్తగా 5జీ డేటా బూస్టర్‌ ప్లాన్స్‌

2023 ఆర్థిక సవత్సరంలో రూ.2వేల కోట్లుగా ఉన్న జెప్టో ఆదాయం ఏడాదిలోనే ఐదింతలు పెరిగిందని పలిచా పేర్కొన్నారు. మేం చక్కగా వ్యాపారం చేస్తే ప్రస్తుతమున్న రూ.10 వేల కోట్లుగా ఉన్న ఆదాయాన్ని ఐదు పదేళ్లలోనే రూ.2.5 లక్షల కోట్లకు చేర్చగలమన్న విశ్వసాన్ని వ్యక్తంచేశారు. సరైన వైఖరితో వ్యవహరించే వ్యక్తులను నియమించుకోవడం ఒక్కటే తమ ముందు ఉన్న అతిపెద్ద సవాలు అని పేర్కొన్నారు.

ప్రస్తుతం క్విక్‌ కామర్స్‌ మార్కెట్‌లో (10 నిమిషాల డెలివరీ) జెప్టోకి 29 శాతం మార్కెట్‌ వాటా ఉంది. జొమాటోకు చెందిన బ్లింకిట్‌ 40 శాతం వాటాతో అగ్రగామిగా కొనసాగుతోంది. ఇన్‌స్టామార్ట్‌ మిగిలిన వాటా కలిగి ఉంది. గత నెలలో సుమారు 665 మిలియన్‌ డాలర్లు సమీకరించిన జెప్టో.. త్వరలో ఐపీఓకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. మరోవైపు 2025 నాటికి సరకుల డెలివరీ కోసం వినియోగించే గిడ్డంగులను రెట్టింపు చేయాలని ప్రణాళిక వేసుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని