Car waiting period: ఈ కార్లు ఇప్పుడు బుక్‌ చేస్తే.. 2024లో వస్తాయి..

దేశంలో కార్లకు వెయిటింగ్‌ పిరియడ్‌ విపరీతంగా పెరిగిపోతోంది. కొన్ని కార్లకు దాదాపు రెండేళ్ల వరకు వెయింటింగ్‌ పిరియడ్‌ ఉంటోంది.

Published : 20 Oct 2022 21:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో మునుపటితో పోలిస్తే కార్ల వినియోగం విపరీతంగా పెరిగింది. ఒకప్పుడు కేవలం సంపన్న వర్గాలకే పరిమితమైన కార్లు.. నేడు ఎగువ మధ్యతరగతి వారూ కొనుగోలు చేస్తున్నారు. అదే సమయంలో ధనిక వర్గాలకు చెందిన వారు అత్యాధునిక ఫీచర్లతో కూడిన కార్లకోసం ఆసక్తి కనబరుస్తున్నారు. అలా ఓ కారు మార్కెట్లోకి అడుగు పెడుతోందంటే చాలు దాని కోసం ఎగబడుతున్నారు. దీంతో కార్లకు ఎక్కడా లేని డిమాండ్‌ కనిపిస్తోంది. నిన్న మొన్నటి వరకు కార్ల అమ్మకాల్లేక వెలవెలబోయిన కార్ల తయారీ కంపెనీలు.. నేడు డిమాండ్‌కు తగినట్లుగా డెలివరీలు చేయలేక ఇబ్బంది పడుతున్నాయి. చిప్‌ల కొరత, సప్లయ్‌ చైన్‌లో అవరోధాలు దీనికి కారణమని పేర్కొంటున్నాయి. దీంతో కార్లకు వెయిటింగ్‌ పిరియడ్‌ విపరీతంగా పెరిగిపోతోంది. కొన్ని కార్లకు దాదాపు రెండేళ్ల వరకు వెయింటింగ్‌ పిరియడ్‌ ఉందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అలా దేశంలో అత్యధిక వెయిటింగ్‌ పిరియడ్‌ కలిగిన కార్లను ఇప్పుడు చూద్దాం..

  • మహీంద్రా స్కార్పియో-ఎన్‌ (Mahindra Scorpio-N): స్కార్పియో జనరేషన్‌లో మహీంద్రా అండ్‌ మహీంద్రా ఈ ఏడాది విడుదల చేసిన మోడల్‌ ఇది. స్కార్పియోకు ఉన్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని మరిన్ని హంగులు జోడిస్తూ దీన్ని తీసుకొచ్చింది. ఈ ఎస్‌యూవీకి బుకింగ్స్‌ ప్రారంభించిన కొన్ని గంటల్లోనే లక్ష బుకింగ్స్‌ అందాయంటే డిమాండ్‌ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ కారకు 21-24 నెలల వెయిటింగ్‌ పిరియడ్‌ ఉంది.
  • మహీంద్రా ఎక్స్‌యూవీ- 700 (Mahindra XUV 700): మహీంద్రాకు చెందిన మరో పాపులర్‌ ఎస్‌యూవీ XUV 700. ప్రస్తుతం ఈ కారుకు దాదాపు 18 నెలల వెయిటింగ్‌ పిరియడ్‌ఉంది. పెట్రోల్‌ వేరియంట్లు మాత్రం దీనికంటే ముందే డెలివరీ అయ్యే అవకాశం ఉంది. 
  • కియా కరెన్స్‌ (Kia Carens): భారత్‌ మార్కెట్లో కియా విడుదల చేసిన అన్ని కార్లకూ మంచి క్రేజ్‌ ఉంది. అందులో కరెన్స్‌ మోడల్‌ ఒకటి. 7 సీటర్‌ వెహికల్‌ అయిన ఈ కారును ఇంటికి తెచ్చుకోవాలంటే 17 నెలల సమయం పడుతోంది.
  • కియా సోనెట్‌ (Kia Sonet): సబ్‌ కాంపాక్ట్‌ ఎస్‌యూవీల్లో అత్యధిక డిమాండ్‌ ఉన్న మోడల్‌ ఇది. టాటా నెక్సాన్‌, హ్యుందాయ్‌ వెన్యూ, మారుతీ సుజుకీ బ్రెజా వంటి కార్లకు గట్టి పోటీనిస్తున్న ఈ కారును సొంతం చేసుకోవాలంటే 11-12 నెలలు వెయిట్‌ చేయాల్సిందే!
  • పై మోడళ్లన్నీ దాదాపు ఏడాది వెయిటింగ్‌ పిరియడ్‌ కలిగి ఉండగా.. హోండా సిటీ హైబ్రిడ్‌ (10 నెలలు), మారుతీ సుజుకీ ఎర్టిగా సీఎన్‌జీ (10 నెలలు), హ్యుందాయ్‌ క్రెటా (9 నెలలు), హ్యుందాయ్‌ వెన్యూ (7 నెలలు), టయోటా అర్బన్‌ క్రూయిజర్‌ (6 నెలలు), మహీంద్రా థార్‌ (6 నెలలు), సుజుకీ గ్రాండ్‌ విటారా (6 నెలలు) వంటి మోడళ్లకు ఆరు నెలల నుంచి 10 నెలల వెయిటింగ్‌ పిరియడ్‌ ఉంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని