టాప్ అప్ గృహ రుణ ప్ర‌యోజ‌నాలు, వ‌డ్డీ రేట్లు వివరాలివీ...

టాప్‌-అప్ గృహ రుణాల‌పై వ‌డ్డీ రేటు.. గృహ రుణ వ‌డ్డీ రేటు కంటే కొంచెం ఎక్కువ‌ ఉంటుంది.  

Updated : 07 Jul 2022 15:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టాప్ అప్ గృహ రుణం తీసుకుని ఇంటికి సంబంధించిన నిర్మాణ ప‌నులకే ఖ‌ర్చు పెట్టాల‌ని లేదు. ఇత‌ర వ్య‌క్తిగ‌త అవ‌స‌రాల కోసం కూడా ఈ రుణాన్ని ఖ‌ర్చు పెట్టొచ్చు. అత్య‌వ‌స‌ర ఆర్థిక అవ‌స‌రాలు, వైద్య బిల్లులు చెల్లించ‌డం, ఫ‌ర్నిచ‌ర్ కొనుగోలుకు, పిల్ల‌ల ఫీజుల‌కు, కారు, విహార యాత్ర‌ల‌కు వెళ్లాల‌ని ఆలోచ‌న ఉన్నా లేదా మీ పిల్ల‌ల పెళ్ళిళ్లకి నిధులు అవ‌స‌ర‌మ‌యినా..  టాప్‌-అప్ గృహ రుణాన్ని ప్ర‌య‌త్నించ‌వ‌చ్చు. మీరు దీర్ఘ‌కాలిక రుణం కోసం చూస్తున్న‌ప్పుడు, కొన‌సాగుతున్న ఇంటి రుణం ఇప్ప‌టికే క‌లిగి ఉన్న‌ప్పుడు మ‌ళ్లీ రుణం పొంద‌డానికి కొత్త ఆస్తిని త‌న‌ఖా పెట్ట‌కూడ‌ద‌నుకుంటే టాప్‌-అప్ గృహ రుణం తీసుకోవ‌డం మంచిది. గృహ య‌జ‌మానుల‌కు డ‌బ్బుని సేక‌రించేందుకు ఇది అత్యంత అనుకూల‌మైన మార్గాల్లో ఒకటి.

టాప్‌-అప్ గృహ రుణం తీసుకోవ‌డం వల్ల కలిగే ప్రయోజనాలు..
ఇప్ప‌టికే సుల‌భ‌మైన అర్హ‌త ప్ర‌మాణాల‌తో కొన‌సాగుతున్న గృహ రుణం కార‌ణంగా రుణ‌గ్ర‌హీత‌కు సంబంధించిన రుణ యోగ్య‌త గురించి బ్యాంకుకు తెలుసు కాబ‌ట్టి, టాప్‌-అప్ రుణానికి అద‌న‌పు ప‌త్రాలు అవ‌స‌రం లేదు. రుణం తీసుకున్న వ్య‌క్తి ఐటీ రిట‌ర్న్‌, గుర్తింపు ప‌త్రాలు, ఫోటోగ్రాఫ్‌లు మొద‌లైన డాక్యుమెంట్‌లు క‌లిగి ఉండాలి. టాప్‌-అప్ రుణాన్ని ద‌ర‌ఖాస్తు చేసేనాటికి అప్ప‌టికే కొన‌సాగుతున్న గృహ రుణానికి కచ్చిత‌మైన రుణ చెల్లింపుల‌ను క‌లిగి ఉండాలి. సాధార‌ణంగా బ్యాంకులు 18-70 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు గ‌ల రుణ గ్ర‌హీత‌ల‌కు టాప్‌-అప్ గృహ రుణాన్ని అనుమ‌తిస్తున్నాయి.

రుణ వినియోగంపై ఎలాంటి ప‌రిమితులు లేవు..
వ్య‌క్తిగ‌త రుణం, బంగారం రుణం మాదిరిగానే మీ అవ‌స‌రాల‌కు అనుగుణంగా టాప్‌-అప్ హోమ్ లోన్‌ని ఉప‌యోగించుకునే స్వేచ్ఛ రుణం తీసుకున్న వినియోగ‌దారునికి ఉంటుంది. మీ ఆర్థిక అవ‌స‌రాలు ఉప‌యోగించ‌వ‌చ్చు. అయితే కచ్చిత‌మైన ఇంటి పునరుద్ధరణ రుణం తీసుకుంటే ఇంటి నిర్మాణం ప్ర‌యోజ‌నం కోసం మాత్ర‌మే ఉప‌యోగించాలి.

రుణాన్ని తిరిగి చెల్లించే కాల వ్య‌వ‌ధి
గృహ రుణాన్ని తిరిగి చెల్లించ‌డానికి ఎక్కువ కాలం అవ‌స‌ర‌మే. బంగారు రుణం, వ్య‌క్తిగ‌త రుణం, ప్రాప‌ర్టీపై రుణం వంటి ఎంపిక‌ల‌లో సాధార‌ణంగా బ్యాంకు నిబంధ‌న‌లు, ష‌ర‌తుల‌పై ఆధార‌ప‌డి గ‌రిష్ఠంగా ఒక సంవ‌త్స‌రం నుంచి 5 సంవ‌త్స‌రాల వ‌ర‌కు గ‌రిష్ఠంగా రుణాన్ని తిరిగి చెల్లించే కాల వ్య‌వ‌ధిని బ్యాంకులు ఇస్తాయి. అయితే, టాప్‌-అప్ హోమ్ లోన్‌లో కాల వ్య‌వ‌ధి గృహ రుణం వ్య‌వ‌ధిపై ఆధార‌ప‌డి ఉంటుంది. ఉదా: మీ గృహ రుణంలో మిగిలిన రుణాన్ని చెల్లించాల్సిన కాల వ్య‌వ‌ధి 20 సంవ‌త్స‌రాలు అయితే, బ్యాంకు ష‌ర‌తుల‌కు లోబ‌డి మీరు మీ టాప్‌-అప్ గృహ రుణానికి గ‌రిష్ఠంగా 20 సంవ‌త్స‌రాల వ‌ర‌కు వ్య‌వ‌ధిని పొందొచ్చు.

అద‌నంగా డ‌బ్బులు తీసుకునే అవ‌కాశం
మీరు ఓవ‌ర్ డ్రాఫ్ట్ (OD) సౌక‌ర్యంతో టాప్‌-అప్ గృహ రుణం కోసం ప్ర‌య‌త్నించ‌వ‌చ్చు. కొన్ని బ్యాంకులు గృహ రుణం టాప్‌-అప్‌లో OD సౌక‌ర్యాన్ని అందిస్తాయి. OD స‌దుపాయంతో కూడిన గృహ రుణం టాప్‌-అప్‌పై వ‌డ్డీ రేటు సాధార‌ణ గృహ రుణ వ‌డ్డీ రేటు కంటే కొంచెం ఎక్కువ‌గా ఉంటుంది. కానీ, వ్య‌క్తిగ‌త రుణం వ‌డ్డీ రేటు కంటే త‌క్కువ ఉంటుంది. మీరు దీర్ఘ‌కాలిక లిక్విడిటీ ల‌భ్య‌త ప్ర‌యోజ‌నాన్ని కూడా పొందుతారు. కాబ‌ట్టి OD సౌక‌ర్యంతో కూడిన టాప్‌-అప్ గృహ రుణం ఈ కోణంలో బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది.

త‌క్కువ వ‌డ్డీ రేటు
టాప్‌-అప్ గృహ రుణాల‌పై వ‌డ్డీ రేటు.. గృహ రుణ వ‌డ్డీ రేటు కంటే కొంచెం ఎక్కువ‌ ఉంటుంది. మెరుగైన క్రెడిట్ స్కోర్ ఉన్న వారికి ఈ రుణాల‌పై వ‌డ్డీ రేట్లు 6.75% నుంచి ప్రారంభ‌మ‌వుతున్నాయి. అందువ‌ల్ల టాప్‌-అప్ గృహ రుణాలు చౌకైన రుణ సాధ‌నాల్లో ఒక‌టి. ప్రాసెసింగ్ ఫీజులు 1% దాకా ఉండ‌వ‌చ్చు.

ప‌న్ను ప్ర‌యోజ‌నాలు
నివాస నిర్మాణం, పున‌ర్నిర్మాణం, పొడిగింపు లేదా మ‌ర‌మ్మ‌తు కోసం మాత్ర‌మే రుణాన్ని ఉప‌యోగించిన‌ట్ల‌యితే మీరు టాప్‌-అప్ గృహ రుణంపై ప‌న్ను ప్ర‌యోజ‌నాల‌ను క్లెయిమ్ చేయ‌వ‌చ్చు. రుణాన్ని స్వ‌యం ఆక్ర‌మిత ఇంటి కోసం ఉప‌యోగించిన‌ట్ల‌యితే గ‌రిష్ఠంగా రూ. 30,000 వ‌ర‌కు ప‌న్ను మిన‌హాయింపు ల‌భిస్తుంది. అద్దె కిచ్చిన ప్రాప‌ర్టీ కోసం రుణాన్ని ఉప‌యోగించిన‌ట్ల‌యితే మిన‌హాయింపుపై ప‌రిమితి లేదు. అయితే ఈ రెండూ కూడా గృహ రుణాల వ‌డ్డీ భాగంపై ఏడాదికి రూ. 2 ల‌క్ష‌ల మొత్తం ప‌న్ను మిన‌హాయింపు కింద‌కు వ‌స్తాయి.

టాప్‌-అప్ రుణాన్ని కొత్త ఆస్తిని కొనుగోలు చేయ‌డానికి లేదా నిర్మాణానికి ఉప‌యోగించిన‌ట్ల‌యితే ప్ర‌ధాన వ‌డ్డీ భాగం సెక్ష‌న్లు 80సీ, 24 (బి) కింద నిర్దేశించిన ప‌రిమితికి లోబ‌డి ప‌న్ను మిన‌హాయింపుకు అర్హ‌త ఉంటుంది. అయితే రుణాన్ని నివాస గృహ పున‌రుద్ధ‌ర‌ణ‌, మార్పు, మ‌ర‌మ్మ‌తు కోసం ఉప‌యోగించిన‌ట్ల‌యితే, మిన‌హాయింపు రుణానికి సంబంధించిన వ‌డ్డీ భాగానికి మాత్ర‌మే పొందొచ్చు. ప‌న్ను ప్ర‌యోజ‌నాల‌ను క్లెయిమ్ చేయ‌డానికి టాప్‌-అప్ రుణంతో నివాస ఆస్తిపై చేసిన అన్ని ప‌నుల ర‌సీదులు, డాక్యుమెంట్‌ల‌ను భ‌ద్ర‌ప‌ర‌చ‌డం చాలా ముఖ్యం.

కొన్ని బ్యాంకుల టాప్-అప్ గృహ రుణాల వ‌డ్డీ రేట్లు ఈ దిగువ ప‌ట్టిక‌లో ఉన్నాయి..

గ‌మ‌నికః బ్యాంకులు తెలిపిన అత్య‌ల్ప వ‌డ్డీ రేట్లు మాత్ర‌మే ఇక్కడ ఇచ్చాం. మీ లోన్ మొత్తం, క్రెడిట్ స్కోరు, చేసే వృత్తిపై బ్యాంకు విధించే ఇత‌ర నిబంధ‌న‌లు, ష‌ర‌తులపై ఆధార‌ప‌డి మీకు వ‌ర్తించే వ‌డ్డీ రేటు పెర‌గ‌వ‌చ్చు. ప్రాసెసింగ్ ఫీజులు, ఇత‌ర ఛార్జీలు ఈ ఈఎంఐలో క‌ల‌ప‌లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని