Innova Crysta: టయోటా ఇన్నోవా క్రిస్టా లిమిటెడ్‌ ఎడిషన్‌ @ ₹17.45 లక్షలు

భారత్‌లో అత్యంత ఆదరణ పొందిన ప్రముఖ కార్లలో ఒకటైన ఇన్నోవా క్రిస్టా జీఎక్స్‌ పెట్రోల్‌ మోడల్‌లో తాజాగా టయోటా పరిమిత ఎడిషన్‌ విడుదల చేసింది...

Published : 02 Sep 2022 13:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌లో అత్యంత ఆదరణ పొందిన ప్రముఖ కార్లలో ఒకటైన ఇన్నోవా క్రిస్టా జీఎక్స్‌ పెట్రోల్‌ మోడల్‌లో తాజాగా టయోటా పరిమిత ఎడిషన్‌ను విడుదల చేసింది. మాన్యువల్‌ వేరియంట్‌ ధర రూ.17.45 లక్షలు (ఎక్స్‌షోరూం) కాగా.. ఆటోమేటిక్‌ వేరియంట్‌ ధర రూ.19.02 లక్షలు (ఎక్స్‌షోరూం). లిమిటెడ్‌ ఎడిషన్‌ ప్యాకేజీలో భాగంగా డీలర్‌ స్థాయిలో అందించే కొన్ని పరికరాలను ఎలాంటి రుసుము లేకుండానే కారుకు అమరుస్తారు. క్రిస్టా పెట్రోల్‌ వేరియంట్‌ కార్ల విక్రయాలను పెంచడానికే ఈ లిమిటెడ్‌ ఎడిషన్‌ను తీసుకొచ్చినట్లు కంపెనీ తెలిపింది. 

టైర్లలో ఒత్తిడి నియంత్రణా వ్యవస్థ, వైర్‌లెస్‌ ఛార్జర్‌, హెడ్‌-అప్‌ డిస్‌ప్లే వంటి పరికరాలను డీలర్లు అమర్చి ఇస్తారు. ఈ మూడు పరికరాలను విడిగా తీసుకుంటే రూ.55,000 అదనంగా చెల్లించాల్సి ఉంటుందని కంపెనీ తెలిపింది. కానీ, లిమిటెడ్‌ ఎడిషన్‌లో భాగంగా వీటిని ఉచితంగా అందజేస్తున్నారు. ఈ ఆఫర్‌ అక్టోబరు చివరి వరకు అందుబాటులో ఉంటుందని సమాచారం. లేదా స్టాక్‌ పూర్తయ్యే వరకు కొనసాగించొచ్చని డీలర్లు తెలిపారు.

ప్రస్తుతం టయోటా ఇన్నోవా క్రిస్టా డీజిల్‌ వేరియంట్‌ బుకింగ్‌లను నిలిపివేశారు. ఇప్పటికే బుక్‌ చేసుకున్నవారు కారు డెలివరీ కోసం వేచిచూస్తున్నారు. బుక్‌ చేసుకొని కారు కేటాయింపు ప్రక్రియ పూర్తయిన వినియోగదారులకు డీజిల్‌ వేరియంట్‌ను అందిస్తామని కంపెనీ తెలిపింది. మిగిలినవారు పెట్రోల్‌ వేరియంట్‌కు మారే అవకాశం ఉంటే పరిశీలించాలని సూచించింది. పెట్రోల్‌ కారు డెలివరీకి 30-45 రోజుల నిరీక్షణ సమయం ఉన్నట్లు తెలిపింది.

టయోటా కొత్తగా తీసుకొస్తున్న ఇన్నోవా హైక్రాస్‌ను నవంబరులో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. పెట్రోల్‌-హైబ్రిడ్‌ వేరియంట్లలో దీన్ని తీసుకురానున్నారు. ధరల్ని వచ్చే ఏడాది జనవరిలో ప్రకటిస్తారని తెలుస్తోంది. కంపెనీ అంతర్గతంగా దీన్ని టయోటా సీ-ఎంపీవీగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని