Health Insurance: ఆరోగ్య బీమాలో థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్స్ పాత్ర ఏంటి?

బీమా సంస్థలకు, బీమా చేసిన వ్యక్తికి మధ్య వారదిలా థర్డ్-పార్టీ అడ్మినిస్ట్రేటర్లు(టీపీఏ) పనిచేస్తాయి.

Updated : 13 May 2022 17:14 IST

అనారోగ్యం లేదా ప్రమాదం కార‌ణంగా ఆసుప్ర‌తిలో చేరాల్సి వ‌చ్చిన‌ప్పుడు, శారీర‌కంగా భాధ‌ప‌డ‌డంతో పాటు మాన‌సిక ఒత్తిడి, ఆందోళ‌న ఉంటుంది. ఇలాంటి స‌మ‌యంలో న‌గ‌దు చెల్లించి ట్రీట్‌మెంట్ చేయించుకోవాలంటే నిధుల కొర‌త మ‌రింత ఒత్తిడికి గురిచేస్తుంది. పాల‌సీదారులు నిధుల స‌మ‌స్య‌తో బాధ‌ప‌డ‌కుండా బీమా సంస్థ‌లు న‌గ‌దు ర‌హిత చికిత్స‌ స‌దుపాయాన్ని అందిస్తున్నాయి. ఆరోగ్య బీమాలో టీపీఏలు ఆవిష్క‌ర‌ణ వెనుక ఉన్న ముఖ్య కార‌ణం కూడా ఇదే. 

ఆరోగ్య బీమా పాలసీల క్లెయిమ్ సెటిల్మెంట్‌కు సంబంధించి, ఆసుపత్రుల నెట్వర్కింగ్, నగదు రహిత వైద్య సేవల ఏర్పాటు, క్లెయిమ్ సెటిల్మెంట్ సకాలంలో పూర్తి చేయటం వంటి పలు రకాల సేవలను బీమా సంస్థ నుంచి పాలసీదారునికి అందించ‌డంలో థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్లు సహాయపడతారు. అంటే బీమా సంస్థకి, పాల‌సీదారునికి మ‌ధ్య వారదిగా టీపీఏలు ప‌నిచేస్తాయి. 

టీపీఏ పాలసీదారులకు అందించే సేవలు..
*
న‌గ‌దు రహిత క్లెయిమ్ సెటిల్‌మెంట్స్‌ను ప్రాసెస్ చేయ‌డ‌మే టీపీఏలు చేసే ముఖ్య‌మైన ప‌ని. 
* టీపీఏలు పాల‌సీ దారుల‌కు హెల్త్ కార్డులు జారీ చేస్తాయి. నగదు రహిత ఆసుపత్రి సేవలను పొందేందుకు ఆసుపత్రి అధికారులకు ఈ కార్డులను చూపించాల్సి ఉంటుంది. పాల‌సీదారుని స‌మాచారం, క్లెయిమ్ స్టేట‌స్‌ను ట్రాక్ చేసేందుకు ఈ కార్డులు స‌హాయ‌ప‌డ‌తాయి. 
* ఆసుప్ర‌తిలో చేరాల్సి వ‌స్తే ముందుగా మీరు పాలసీ చేసిన బీమా సంస్థతో ఒప్పందం ఉన్న టీపీఏకి సమాచారం ఇవ్వాలి.
* సమాచారం అందించిన తర్వాత, ఆసుపత్రికి టీపీఏ నుంచి అధికారిక‌ లేఖ వస్తుంది.
* లేఖ అందిన అనంతరం ఆసుపత్రి వర్గాలు, మీ బిల్లులన్నింటిని టీపీఏకు పంపిస్తారు.
* క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రొసీజర్‌ను ప్రారంభించేందుకు గానూ, ఈ బిల్లులను, ఇతర పత్రాలను టీపీఏ బీమా సంస్థకు అందజేస్తుంది.
* మీరు ఒకవేళ టీపీఏ నెట్వర్క్‌లో లేని ఆసుపత్రిని ఎంచుకుంటే, నగదు రహిత క్లెయిమ్ చేసేందుకు వీలుండదు. కానీ ఇందుకు గానూ మీకు అయిన ఖర్చులను బీమా సంస్థ చెల్లిస్తుంది.

గుర్తుంచుకోండి..
సాధార‌ణంగా థ‌ర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేట‌ర్ల‌ను బీమా సంస్థ‌లు నియ‌మిస్తాయి.  పాల‌సీ కొనుగోలు చేసే స‌మ‌యంలో పాల‌సీదారుడు స్వ‌యంగా టీపీఏను ఎంచుకోవ‌చ్చు. పాల‌సీ కొనుగోలు స‌మ‌యంలో ఎంచుకోనివారికి,  బీమా సంస్థే టీపీఏను కేటాయిస్తుంది. ఒక‌వేళ ప్ర‌స్తుతం ఉన్న‌ టీపీఏ అందించే సేవ‌ల‌తో మీరు సంతృప్తి చెంద‌క‌పోతే, పాల‌సీ పున‌రుద్ధ‌ర‌ణ స‌మ‌యంలో టీపీఏను మార్చుకోవ‌చ్చు. క్లెయిమ్ సెటిల్‌మెంట్ విష‌యంలో క్లెయిమ్‌ల‌ను అంగీకరించ‌డం, తిరస్క‌రించ‌డం పూర్తిగా బీమా సంస్థపై ఆధార‌ప‌డి ఉంటుంది. ఈ విష‌యంలో టీపీఏకు సంబంధం ఉండ‌దు. పాల‌సీ సంబంధిత ప‌త్రాలు, ఆసుప‌త్రి బిల్లులు, క్లెయిమ్ సెటిల్‌మెంటుకు కావ‌ల‌సిన ఇత‌ర ప‌త్రాల‌ను పాల‌సీదారుని నుంచి సేక‌రించి, సెటిల్‌మెంట్ ప్రాసెస్ త్వ‌ర‌గా పూర్తి చేసేందుకు టీపీఏ స‌హాయ‌ప‌డుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని