India Australia: 6000కి పైగా రకాల ఉత్పత్తులపై సున్నా సుంకం

భారత్‌-ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఆర్థిక సహకారం, వాణిజ్య ఒప్పందం (IndAus ECTA) వల్ల విద్యార్థులు, నిపుణులు, పర్యాటకుల మార్పిడి సులభతరం కావడంతో పాటు, ప్రస్తుతం ఉన్న అవకాశాలను పూర్తిగా ఉపయోగించుకోవడానికి రెండు దేశాలకు అవకాశం ఏర్పడుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు....

Published : 02 Apr 2022 21:25 IST

వాణిజ్య ఒప్పందంపై భారత్‌-ఆస్ట్రేలియా సంతకాలు

దిల్లీ: భారత్‌-ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఆర్థిక సహకారం, వాణిజ్య ఒప్పందం (IndAus ECTA) వల్ల విద్యార్థులు, నిపుణులు, పర్యాటకుల మార్పిడి సులభతరం కావడంతో పాటు, ప్రస్తుతం ఉన్న అవకాశాలను పూర్తిగా ఉపయోగించుకోవడానికి రెండు దేశాలకు అవకాశం ఏర్పడుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ ఒప్పందంపై ఇరు దేశాల ప్రధానుల సమక్షంలో మన వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌, ఆస్ట్రేలియా వాణిజ్య మంత్రి దాన్‌ తెహన్‌ శనివారం వర్చువల్‌ సమావేశంలో సంతకం చేశారు.

తాజా ఒప్పందం అమల్లోకి వస్తే భారత ఎగుమతిదార్లు జౌళి, తోలు, ఫర్నిచర్‌, జువెలరీ, యంత్రాలు సహా 6000కి పైగా రకాల ఉత్పత్తులను ఇకపై ఆస్ట్రేలియాకు సుంకం లేకుండా ఎగుమతి చేయొచ్చు. ఈ ఆర్థిక సహకారం, వాణిజ్య ఒప్పందానికి కేంద్ర మంత్రివర్గం, ఆస్ట్రేలియా పార్లమెంటు ఆమోదం లభిస్తే ఇరు దేశాలు కలిసి నిర్ణయించిన తేదీ నుంచి ఇది అమల్లోకి రానుంది. ఎగుమతుల విలువలో సుమారు 96.4 శాతానికి ఈ సున్నా సుంకం వర్తిస్తుంది. ప్రస్తుతం 4- 5 శాతం సుంకం వర్తిస్తున్న చాలా ఉత్పత్తులు సున్నా సుంకం పరిధిలోకి రానున్నాయి.

ఇంత తక్కువ సమయంలో ఒప్పందం ఖరారు కావడానికి ఇరు దేశాల మధ్య ఉన్న నమ్మకమే కారణమని మోదీ తెలిపారు. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలకు ఇది మైలురాయిగా నిలవనుందని వ్యాఖ్యానించారు. సరఫరా వ్యవస్థలు మరింత బలపడి.. ఇండో-పసిఫిక్‌ ప్రాంత సుస్థిరతకూ దారితీస్తుందని తెలిపారు. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మోరిసన్‌  తాజా ఒప్పందంపై హర్షం వ్యక్తం చేశారు. ఇరు దేశాల బంధం మరింత పటిష్ఠం కానుందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని