Mobile number: ఫోన్‌ నంబర్లకు ఛార్జీలు.. ట్రాయ్‌ స్పష్టత

Mobile number: త్వరలో ఫోన్‌ నంబర్లకూ ఛార్జీ వసూలు చేయనున్నట్లు వస్తున్న వార్తలపై ట్రాయ్‌ స్పష్టతనిచ్చింది. అవన్నీ తప్పుడు కథనాలని కొట్టిపారేసింది.

Published : 14 Jun 2024 18:15 IST

దిల్లీ: ప్రస్తుత, కొత్త మొబైల్‌ ఫోన్‌ - ల్యాండ్‌ లైన్‌ నంబర్లకూ ఛార్జీ వసూలుచేయాలని టెలికాం నియంత్రణాధికార సంస్థ ట్రాయ్‌ (TRAI) భావిస్తున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. వీటిని ట్రాయ్‌ ఖండించింది. ఫోన్‌ నంబర్లకు కస్టమర్ల నుంచి ఫీజులు (Charges for Mobile Numbers) విధించే ప్రణాళికేదీ లేదని స్పష్టంచేసింది.

నంబరింగ్‌ వనరుల నియంత్రణ నిమిత్తం ఇటీవల ట్రాయ్‌ ‘రివిజన్‌ ఆఫ్‌ నేషనల్‌ నంబరింగ్‌ ప్లాన్‌’ పేరుతో ఓ చర్చా పత్రాన్ని విడుదల చేసింది. దీంతో ఈ ఛార్జీల వార్తలు వెల్లువెత్తాయి. ఫోన్‌ నంబర్లను కూడా విలువైన ప్రజా వనరులుగా భావిస్తూ, వాటి కేటాయింపునకు ఛార్జీ విధించాలని ట్రాయ్‌ యోచిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే రెగ్యులేటరీ సంస్థ శుక్రవారం దీనిపై ప్రకటన విడుదల చేసింది.

‘‘నంబరింగ్‌ వనరులను సమర్థంగా వినియోగించుకునేందుకు మొబైల్‌, ల్యాండ్‌లైన్‌ నంబర్లకు ఫీజులు వసూలుచేయాలని ట్రాయ్‌ ప్రతిపాదించినట్లు కొన్ని మీడియాల్లో వార్తలు వస్తున్నాయి. ఇది పూర్తిగా అవాస్తవం. ప్రజలను తప్పుదోవ పట్టించేదే. టెలీకమ్యూనికేషన్‌ ఐడెంటిఫైర్స్‌ వనరులపై పూర్తి నియంత్రణ కలిగిన టెలికాం శాఖ ఇటీవల ట్రాయ్‌ని సంప్రదించి నేషనల్‌ నంబరింగ్‌ ప్లాన్‌పై ప్రతిపాదనలు కోరింది. నంబరింగ్‌ వనరుల సమర్థ వినియోగం కోసం సూచనలు ఇవ్వాలని అడిగింది. దీంతో మేం చర్చాపత్రం విడుదల చేశాం. నంబర్ల కేటాయింపు విధానాల్లో కొన్ని సవరణలను మాత్రమే ప్రతిపాదించాం’’ అని ట్రాయ్‌ తమ ప్రకటనలో వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని