Travel Classes: రైళ్లలో 3A, 2A గురించి తెలుసు.. మరి ఈ 3E, EA మాటేంటి?

Travel Classes: రైళ్లలో ప్రయాణం చేసే వారు వాటిలో తరగతుల గురించి తెలుసుకోవడం ముఖ్యం. ఆ వివరాలు తెలుసుకోండి..

Updated : 08 Jul 2024 15:40 IST

Travel Classes | ఇంటర్నెట్‌డెస్క్‌: రైళ్లలో ప్రయాణించేవారికి ఏసీ, నాన్‌ ఏసీ క్లాసుల (Travel Classes) విభజన గురించి తెలిసే ఉంటుంది. ఏసీలో కూడా మళ్లీ తరగతులు ఉంటాయి. ముఖ్యంగా దూర ప్రయాణాలకు ట్రైన్‌ టికెట్లు బుక్‌ చేసే సమయంలో ఈ తరగతుల గురించి అవగాహన ఉండాలి. సాధారణంగా SL, 3A, 2A క్లాసుల గురించి అందరికీ సుపరిచితమే. టికెట్‌ బుక్‌ చేసేటప్పుడు CC, EC, 3E, EA వంటివీ దర్శనమిస్తుంటాయి. ఇంతకీ ఆ కోడ్‌లు ఏ తరగతులను సూచిస్తాయి? మొత్తంగా ఎన్ని రకాల తరగతులు ఉన్నాయి?

1A లేదా ఫస్ట్‌ ఏసీ (1A)

ఇండియన్‌ రైల్వేస్‌లో ఫస్ట్‌ క్లాస్‌ ఏసీ స్లీపర్‌ను 1ఏగా పేర్కొంటారు. ఇందులో 4 లేదా 2 బెర్తులతో కూడిన కంపార్ట్‌మెంట్లే ఉంటాయి. సైడ్‌ అప్పర్‌, సైడ్‌ లోయర్‌ బెర్తులేవీ ఉండవు. 2 బెర్తులుండే కంపార్ట్‌మెంట్‌ను కూప్‌ అని, 4 బెర్తులుంటే దాన్ని క్యాబిన్‌గా పేర్కొంటారు. కంపార్ట్‌మెంట్‌కు లాక్‌ వేసుకోవచ్చు. ఒక్కో బోగీలో  మొత్తం 18-24 బెర్తులు మాత్రమే ఉంటాయి. టికెట్‌ ఖరీదు ఇంచుమించు విమానం ధరకు సమానంగా ఉంటుంది. ఈ కోచ్‌లను H1, H2 అని పేర్కొంటారు.

సెకండ్‌ ఏసీ (2 AC)

దీన్నే సెకండ్‌ ఏసీ లేదా టు-టైర్‌ ఏసీగా పిలుస్తారు. ఈ తరహా కోచ్‌లలో 45-54 సీట్లు ఉంటాయి. ఒక్కో కంపార్ట్‌మెంట్‌లో ఆరు సీట్లు ఉంటాయి. మిడిల్‌ బెర్తులు ఉండవు. ఈ తరహా కోచ్‌లు A అక్షరంతో సూచిస్తారు. కోచ్‌ పొజిషన్‌ ఇచ్చేటప్పుడు A1, A2 అని పేర్కొంటారు. టికెట్‌ జారీ చేసేటప్పుడు ఉదాహరణకు H2 26 అని ముద్రిస్తారు.

థర్డ్‌ ఏసీ (3 AC)

భారతీయ రైల్వేలో మధ్యతరగతికి అందుబాటులో ఉండే ఏసీ క్లాస్‌ ఇది. స్లీపర్‌ క్లాసులో ప్రయాణించలేని వారు ఎక్కువగా ఈ తరగతిని ఎంచుకుంటారు. ఒక్కో కోచ్‌లో 64-72 బెర్తులు ఉంటాయి. ఈ కోచ్‌లపై B అనే అక్షరంతో సూచిస్తారు.

థర్డ్‌ ఎకానమీ (3E)

ఇటీవల కాలంలో కొన్ని రైళ్లలో ఈ తరగతి దర్శనమిస్తుంటుంది. థర్డ్‌ ఏసీ కంటే టికెట్‌ ధర తక్కువగా ఉంటుంది. కాకపోతే ఈ తరహా కోచ్‌లలో 72-81 బెర్తులు ఉంటాయి. గరీబ్‌రథ్‌ వంటి రైళ్లలో ఈ తరహా కోచ్‌లు ఉంటాయి. వీటిల్లో సైడ్‌ మిడిల్‌ బెర్తు ఉంటుంది. ఈ కోచ్‌లను Mతో సూచిస్తారు.

స్లీపర్‌ క్లాస్ (SL)

స్లీపర్‌ కోచ్‌ల గురించి చాలా మందికి సుపరిచితమే. తక్కువ ఖర్చుతో దూర ప్రయాణం చేసే వారు ఈ తరగతిని ఎంచుకుంటూ ఉంటారు. ఇందులో 72-81 బెర్తులు ఉంటాయి. ఒక్కో కంపార్ట్‌మెంట్‌లో 8 బెర్తులు ఉటాయి. ఈ కోచ్‌లను S అక్షరంతో సూచిస్తారు. కొన్నిసార్లు ఆ రైలుకు అదనపు బోగీలను ఏర్పాటు చేసినప్పుడు SE పేరుతో నంబరింగ్‌ ఇస్తారు. 

ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌ (EC)

విమానాల్లోని బిజినెస్‌ క్లాస్‌ను ఇది పోలి ఉంటుంది. ఏసీతో కూడిన సీటింగ్ ఉంటుంది. స్లీపర్‌ బెర్తులు ఉండవు. వందేభారత్‌ రైళ్లలో కోచ్‌లు అందుబాటులోకి రావడంతో వీటి గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ కోచ్‌లను E అక్షరంతో సూచిస్తారు.

ఎగ్జిక్యూటివ్‌ అనుభూతి క్లాస్‌ (EA)

శతాబ్ది వంటి రైళ్లలో ఎగ్జిక్యూటివ్‌ అనుభూతి క్లాస్‌లు కనిపిస్తాయి. టికెట్‌ బుక్‌ చేసేటప్పుడు EA పేరుతో ఈ కోచ్‌లు ఉంటాయి. ఏసీతో కూడిన 56 ఛైర్లు ఉంటాయి. సినిమాలు, మ్యూజిక్‌ ఆనందించేందుకు ఎల్‌సీడీ స్క్రీన్లు ఉంటాయి. హెడ్‌ఫోన్లు ఇస్తారు. ఆటోమేటిక్‌ డోర్స్‌ ఏర్పాటు ఉంటుంది. ఈ కోచ్‌లకు K అక్షరంతో సూచిస్తారు.

ఏసీ ఛైర్‌ కార్‌ (CC)

ఒకవైపు మూడు వరసలు, మరో వైపు రెండు వరుసలతో కూడిన ఛైర్లు ఉంటాయి. పగటి పూట ప్రయాణించే రైళ్లలో ఈ కోచ్‌లు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం వందే భారత్‌లో ఉన్న కోచ్‌లు ఇవే. ఈ కోచ్‌లను C అక్షరంతో సూచిస్తారు.

విస్టాడోమ్‌ (EV)

పర్యాటక ప్రాంతాలకు నడిపే రైళ్లలో విస్టాడోమ్‌ కోచ్‌లను రైల్వే శాఖ నడుపుతోంది. ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి ఈ కోచ్‌లలో అద్దాలతో కూడిన ఏర్పాటు ఉంటుంది. ఇందులో నాన్‌ ఏసీ కోచ్‌లను DV అని, ఏసీ కోచ్‌లను EVగా పేర్కొంటారు. 

ఇవీ ఉన్నాయి..

పైన పేర్కొన్న తరగతులతో పాటు సెకండ్‌ సిట్టింగ్‌ (2S) క్లాసులు కూడా కొన్ని రైళ్లలో ఉంటాయి. వీటిల్లో కూర్చొని ప్రయాణం చేయాల్సి ఉంటుంది. వీటికీ టికెట్లు రిజర్వేషన్‌ చేసుకోవచ్చు. ఇవి కాకుండా అన్‌ రిజర్వుడు కోచ్‌లు (UR) ఉంటాయి. వీటినే సెకండ్‌ క్లాస్‌ అని కూడా పేర్కొంటారు. వీటికి ముందుస్తు రిజర్వేషన్‌ అంటూ ఏమీ ఉండదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని