Gautham Adani: అత్యుత్తమ వృద్ధి ముందుంది

తమ కంపెనీల లాభాదాయాలు బాగుండటం, నగదు నిల్వలు మెరుగ్గా ఉండటం, తక్కువ రుణ నిష్పత్తి కారణంగా అదానీ గ్రూపు మునుపెన్నడూ లేనంత బలంగా కనిపిస్తోందని ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ వెల్లడించారు.

Updated : 25 Jun 2024 07:17 IST

ఆకర్షణీయ ఆర్థిక ఫలితాలు, తక్కువ రుణ స్థాయిలే కారణం 
అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ సమావేశంలో గ్రూపు ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ 

దిల్లీ: తమ కంపెనీల లాభాదాయాలు బాగుండటం, నగదు నిల్వలు మెరుగ్గా ఉండటం, తక్కువ రుణ నిష్పత్తి కారణంగా అదానీ గ్రూపు మునుపెన్నడూ లేనంత బలంగా కనిపిస్తోందని ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ వెల్లడించారు. మున్ముందు మరింత పురోగతి చూడబోతున్నారని అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ (ఏఈఎల్‌) వార్షిక సమావేశంలో వాటాదార్లకు తెలిపారు. సోమవారమే ఆయన 62వ సంవత్సరంలోకి ప్రవేశించారు. ‘మనదేశం 2023కు 10 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించే క్రమంలో ఉంది. అప్పటికి మౌలిక రంగం 20-25% వృద్ధితో 2.5 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరొచ్చని అనుకుంటున్నాం. మౌలిక రంగంలో ఓ కీలక కంపెనీగా, భవిష్యత్తు అవకాశాలను సద్వినియోగం చేసుకోనేందుకు సిద్ధంగా ఉన్నామ’ని ఆయన వివరించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..

ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నాన్ని తిప్పికొట్టాం..: అమెరికాకు చెందిన షార్ట్‌ సెల్లింగ్‌ సంస్థ చేసిన నిరాధార ఆరోపణల వల్ల, దశాబ్దాలుగా మనం చేసిన శ్రమపై సందేహాలు నెలకొనే పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది. మన గ్రూపు సమగ్రత, ప్రతిష్ఠలపై  జరిగిన ఈ దాడిని సమర్థంగా తిప్పికొట్టాం. మన గ్రూపు పటిష్ఠ మూలాల నేపథ్యంలో, ఇలాంటి ఆరోపణలు ఏమీ చేయలేవని నిరూపించగలిగాం. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ రూ.20,000 కోట్ల మలివిడత పబ్లిక్‌ ఆఫర్‌ (ఎఫ్‌పీఓ)కు రెండు రోజుల ముందు, మీడియాలో ఒక వర్గం అండతో, మన గ్రూపు పేరు ప్రతిష్ఠలను దెబ్బతీయాలనే లక్ష్యంగా ఈ ఆరోపణలు చేశారు. తద్వారా మన గ్రూప్‌ కొన్నేళ్లుగా ఎంతో కష్టపడి సంపాదించిన మార్కెట్‌ విలువ 150 బిలియన్‌ డాలర్ల మేర హరించుకుపోయేలా ప్రయత్నించారు. ఈ నేపథ్యంలోనే ఎఫ్‌పీఓ ద్వారా సమీకరించిన నిధులను గ్రూపు తిరిగి ఇచ్చేసింది.  

రుణాల చెల్లింపునకు రూ.40,000 కోట్ల సమీకరణ: రాబోయే రెండేళ్లలో రుణ చెల్లింపుల కోసం, గ్రూపు రూ.40,000 కోట్లు సమీకరించింది. మార్జిన్‌ అనుసంధానిత రుణాల కోసం రూ.17,500 కోట్లు ముందస్తుగా చెల్లించనున్నాం. రుణాలు తగ్గించుకోవడం, వ్యాపారాన్ని మెరుగుపర్చుకోవడంపై దృష్టి సారిస్తున్నాం. దీని వల్ల ఆర్థిక స్థితి ఇంకా మెరుగుపడి, భవిష్యత్‌ విస్తరణకు అవసరమైన నిధుల వెసులుబాటు లభిస్తుంది. గుజరాత్‌లోని ఖావ్డా వద్ద 30 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్‌ పార్క్‌.. బెల్జియం, స్విట్జర్లాండ్‌ లాంటి దేశాలకు సరిపోయేంత విద్యుత్‌ను అందించగలదు. ప్రపంచంలోనే అతిపెద్ద మురికివాడ అయిన ధారావి పునర్నిర్మాణ ప్రక్రియ, వచ్చే దశాబ్దకాలంలో ఆ ప్రాంత రూపురేఖలను మార్చబోతోంది. మన గ్రూప్‌ తయారు చేస్తున్న ‘దృష్టి 10 స్టార్‌లైనర్‌ యూఏవీ’ దేశ సరిహద్దుల్లో రక్షణకు ఉపయోగపడుతుంది.

జీవనకాల గరిష్ఠానికి నగదు నిల్వలు: 2023-24లో రూ.82,917 కోట్లతో రికార్డు ఎబిటా నమోదుచేశాం. 45% వృద్ధిని సాధించాం. నికర లాభం 71% పెరిగి రికార్డు గరిష్ఠమైన రూ.40,129 కోట్లకు చేరింది. ఏడాదికాలంలో నికర రుణం, ఎబిటాల మధ్య నిష్పత్తి తగ్గింది. వీటన్నింటి కారణంగా గ్రూపు నగదు నిల్వలు జీనవకాల గరిష్ఠమైన   రూ.59,791 కోట్లుగా నమోదయ్యాయి. ప్రపంచంలోని అనేక దేశాలు అనిశ్చితిలో ఉంటే, స్థిరత్వం, సహకారం, పురోగతికి భారత్‌ బలమైన నిదర్శనంగా మారింది. దేశ సూక్ష్మ ఆర్థిక పరిస్థితులు, ఆశావహ వృద్ధి.. మా విశ్వాసం పెరిగేందుకు ప్రేరణగా నిలిచాయి. మనం అత్యుత్తమ వృద్ధి దశలో ఉన్నాం. ఈ దశాబ్దం చివరికల్లా మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని