Hero motocorp: ‘హీరో’ ట్రేడ్‌ మార్క్‌ వ్యవహారం.. హీరో మోటోకార్ప్‌కు ఊరట

‘హీరో’ ట్రేడ్‌ మార్క్‌ (Hero trademark) వ్యవహారంలో హీరో మోటోకార్ప్‌కు (Hero MotoCorp) ఊరట లభించింది.

Published : 01 Jul 2022 16:30 IST

దిల్లీ: ‘హీరో’ ట్రేడ్‌ మార్క్‌ (Hero trademark) వ్యవహారంలో హీరో మోటోకార్ప్‌నకు (Hero MotoCorp) ఊరట లభించింది. భవిష్యత్‌లో తీసుకురాబోయే ఎలక్ట్రిక్‌ వాహనాలకు ఆ ట్రేడ్‌ మార్క్‌ను వాడుకోవచ్చని ఆర్బిట్రేషన్‌ ట్రైబ్యునల్‌ తీర్పు వెలువరించింది. ఎలక్ట్రిక్‌ వాహనాలకు హీరో ట్రేడ్‌ మార్క్‌ను వాడకూడదంటూ ఎలక్ట్రిక్‌ టూవీలర్లను తయారు చేసే హీరో ఎలక్ట్రిక్‌ పిటిషన్‌ వేసింది. ఈ కేసులో హీరో మోటోకార్ప్‌కు అనుకూలంగా తీర్పు వెలువడింది. ఈ విషయాన్ని గురువారం రాత్రి రెగ్యులేటరీ ఫైలింగ్‌లో హీరో మోటోకార్ప్‌ పేర్కొంది.  ఎలక్ట్రిక్‌ వాహనాల వ్యాపారంలో ఇప్పటికే రూ.400 కోట్ల మేర హీరో మోటోకార్ప్‌ పెట్టుబడులు పెట్టిందని, బ్రాండ్‌ను నిర్మించడానికి పెద్ద ఎత్తున ఖర్చు చేసిన విషయాన్ని ట్రైబ్యునల్‌ గుర్తించిందని హీరో మోటోకార్ప్‌ తెలిపింది. హీరో ఎలక్ట్రిక్‌ వాదనల్లో మెరిట్‌ లేదని గుర్తించిన  ట్రైబ్యునల్‌.. హీరో మోటోకార్ప్‌కు అనుకూలంగా తీర్పు వెలువరించింది.

ఇదీ కేసు..
కుటుంబ ఆస్తుల పంపకంలో భాగంగా హీరో మోటోకార్ప్‌, హీరో కార్పొరేట్‌ సర్వీసులు బ్రజ్‌మోహన్‌ లాల్‌ ముంజాల్‌కు దక్కాయి. హీరో సైకిల్స్‌, హీరో మోటార్స్‌, ముంజల్‌ సేల్స్‌ కార్పొరేషన్‌ ఆయన సోదరుడు ఓం ప్రకాశ్‌ ముంజాల్‌కు దఖలుపడ్డాయి. ముంజల్‌ షోవా, ముంజల్‌ ఆటో, ఇతర వ్యాపారాలు సత్యానంద్‌ ముంజాల్‌కు దక్కగా.. హీరో ఎలక్ట్రిక్‌, హీరో ఎక్స్‌పోర్ట్‌, సన్‌బీమ్‌ ఆటో వ్యాపారాలు దయానంద్‌ ముంజాల్‌కు దక్కాయి. ప్రస్తుతం హీరో ఎలక్ట్రిక్‌కు నవీన్‌ ముంజాల్‌ ఎండీగా వ్యవహరిస్తున్నారు.

కుటుంబ ఒప్పందం ప్రకారం పర్యావరణహిత వాహనాల తయారీలో ‘హీరో’ ట్రేడ్‌ మార్క్‌ వాడకం తమకే దక్కుతుందంటూ హీరో ఎలక్ట్రిక్‌ దిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ‘విడా పవర్డ్‌ బై హీరో’ పేరిట హీరో మోటోకార్ప్‌ ఎలక్ట్రిక్‌ వాహనాలను తీసుకొచ్చేందుకు సన్నద్ధమవుతున్న వేళ ఈ పిటిషన్‌ వేసింది. దీంతో ట్రైబ్యునల్‌లో ఈ వ్యవహారాన్ని పరిష్కరించుకోవాలని హైకోర్టు సూచించింది. సుప్రీంకోర్టు మాజీ సీజేఐ దీపక్‌ మిశ్రా, విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్‌ ఇందూ మల్హోత్రా, ఇందర్మీత్‌ కౌర్‌ నేతృత్వంలోని ట్రైబ్యునల్‌కు ఈ కేసు అప్పగించింది. ఇరు పక్షాల వాదనలు విన్న ట్రైబ్యునల్‌లో హీరో మోటోకార్ప్‌కు అనుకూలంగా తీర్పు వెలువరించింది. మరోవైపు జులైలోనే విడా పేరుతో ఎలక్ట్రిక్‌ వాహనాలను తీసుకురావాల్సిన హీరో.. ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని