Trump Twitter ban: ట్రంప్‌ ట్విటర్‌ ఖాతాను పునరుద్ధరిస్తాం: మస్క్‌

ట్విటర్‌ కొనుగోలు ప్రక్రియ పూర్తయితే, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖాతాను పునరుద్ధరిస్తానని బిలియనీర్‌ ఎలాన్ మస్క్ తెలిపారు...

Updated : 11 May 2022 11:41 IST

న్యూయార్క్‌: ట్విటర్‌ (Twitter) కొనుగోలు ప్రక్రియ పూర్తయితే, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) ఖాతాను పునరుద్ధరిస్తామని బిలియనీర్‌ ఎలాన్ మస్క్ (Elon Musk) తెలిపారు. న్యూయార్క్‌లో మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ ప్రకటన చేశారు. ట్విటర్‌ను మస్క్‌ కొనుగోలు చేయబోతున్నారని వార్తలు వచ్చినప్పటి నుంచి ట్రంప్‌ ఖాతాను పునరుద్ధరిస్తారని ఊహాగానాలు వచ్చిన విషయం తెలిసిందే. తాజా ప్రకటనతో ఆయన వాటిని ధ్రువీకరించినట్లయింది.

ట్వీట్ల తొలగింపు, ఖాతాలను శాశ్వతంగా నిషేధించే విషయంలో ట్విటర్‌ చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని గతంలో మస్క్‌ అభిప్రాయపడ్డారు. 2021లో క్యాపిటల్‌ హిల్‌పై దాడి సందర్భంగా ట్రంప్‌ ఖాతాపై ట్విటర్‌ శాశ్వత నిషేధం (Trump Twitter Ban) విధించిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా స్పందించిన మస్క్‌ ఆ నిర్ణయాన్ని తప్పిదంగా అభివర్ణించారు. ట్విటర్‌ సహ-వ్యవస్థాపకుడు జాక్‌ డోర్సే సైతం ఇదే అభిప్రాయాన్ని తనతో వ్యక్తం చేశారని తెలిపారు. ‘‘మా ఇద్దరి ప్రకారం.. శాశ్వత నిషేధం ఉండొద్దు’’ అని మస్క్‌ అభిప్రాయపడ్డారు. తర్వాత ఇదే విషయంపై ట్విటర్‌లో స్పందించిన డోర్సే.. మస్క్‌ అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నానని తెలిపారు. మస్క్‌ వ్యాఖ్యలపై ప్రస్తుత ట్విటర్‌ యాజమాన్యం స్పందించడానికి నిరాకరించింది.

ట్విటర్ తన ఖాతాను పునరుద్ధరించినా మళ్లీ అందులో చేరే ఉద్దేశం లేదని ట్రంప్ ఇటీవల తేల్చి చెప్పారు. ఈ ఏడాది మెుదట్లో తాను ప్రారంభించిన ట్రూత్ సోషల్‌పై ఎక్కువ దృష్టి పెడతానని స్పష్టంచేశారు. ఎలాన్ మస్క్ మంచివాడని ట్విటర్‌ను మెరుగుపరుస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని