EV Price hike: ధరలు పెంచిన ఓలా, టీవీఎస్‌, ఏథర్‌.. కొత్త ధరలివే..

TVS, Ather, Ola hike prices: విద్యుత్‌ వాహన తయారీ సంస్థలు తమ స్కూటర్ల ధరలు పెంచాయి. సబ్సిడీ నిబంధనలు అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నాయి.

Published : 01 Jun 2023 18:45 IST

దిల్లీ: విద్యుత్‌ ద్విచక్ర వాహనాలకు ఇచ్చే సబ్సిడీలో (Subsidy) కేంద్ర ప్రభుత్వం కోత పెట్టడంతో ఆయా విద్యుత్‌ వాహన తయారీ కంపెనీలు వాహన ధరలను పెంచాయి. ప్రముఖ వాహన కంపెనీలైన ఓలా (Ola Electric), టీవీఎస్‌ (TVS), ఏథర్‌ ఎనర్జీ (Ather Energy) తమ స్కూటర్ల ధరలను సవరించాయి. కొత్త సబ్సిడీ నిబంధనలు నేటి నుంచి (జూన్‌ 1) అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఈ ధరల పెంపును చేపట్టాయి. ఇటీవల విద్యుత్‌ ద్విచక్ర వాహన కంపెనీలకు ఇచ్చే రాయితీల్లో కేంద్రం కోత పెట్టిన సంగతి తెలిసిందే. ఒక్కో కిలోవాట్‌ బ్యాటరీకి గతంలో రూ.15వేలు చెల్లించాల్సిన చోట ఇకపై రూ.10వేలు మాత్రమే చెల్లించాలని కేంద్రం నిర్ణయించింది. అలాగే వాహన ధరలో 40 శాతంగా ఉన్న సబ్సిడీ గరిష్ఠ పరిమితిని సైతం 15 శాతానికి తగ్గించింది. ఈ నేపథ్యంలో వాహన ధరలను పెంచుతూ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. 

ప్రముఖ టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ ఐక్యూబ్‌ పేరిట విద్యుత్‌ ద్విచక్ర వాహనాలను విక్రయిస్తోంది. ఫేమ్‌-2 సబ్సిడీలో కోత నేపథ్యంలో ఆయా వాహన శ్రేణిపై రూ.17వేల నుంచి రూ.22 వేల వరకు ధర పెంచుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఏథర్‌ ఎనర్జీ సైతం తన 450ఎక్స్‌ మోడల్ ధరను పెంచింది. దీంతో ఈ స్కూటర్‌ ధర రూ.1.45 లక్షలకు (ఎక్స్‌షోరూమ్‌, బెంగళూరు) చేరింది. అలాగే 450ఎక్స్‌ ప్రో ప్యాక్‌ ధర రూ.1.65 లక్షలకు పెరిగింది. ఒక్కో స్కూటర్‌పై రూ.8 వేలు మేర పెరిగింది. సబ్సిడీ నిబంధనల్లో మార్పు కారణంగా రూ.32వేల వరకు కోత పడుతున్నప్పటికీ.. వినియోగదారులపై ధరల భారం పడకూడదన్న ఉద్దేశంతో పరిమితంగానే ధర పెంచినట్లు ఏథర్‌ ఎనర్జీ చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ రవ్‌నీత్‌ ఎస్‌ పోఖేలా తెలిపారు.

ఓలా ఎలక్ట్రిక్‌ సైతం అన్ని మోడళ్లపైనా ధరల పెంపును ప్రకటించింది. దీంతో ఎస్‌ప్రో ధర రూ.1,39,999; ఎస్‌1 (3KWh) ధర రూ.1,29,999, ఎస్‌1 ఎయిర్‌ (3KWh) ధర రూ.1,09,999కు పెరిగింది. మునుపటితో పోలిస్తే ఒక్కో స్కూటర్‌ ధర రూ.15వేల వరకు పెరిగింది. కస్టమర్లకు భారం కాకూడదన్న ఉద్దేశంతో స్వల్పంగానే ధర పెంచినట్లు ఓలా సైతం తెలిపింది. మరోవైపు హీరో ఎలక్ట్రిక్‌ మాత్రం తన విద్యుత్‌ వాహనాల ధరలను పెంచడం లేదని ప్రకటించింది. విద్యుత్‌ వాహనాలను ప్రోత్సహించడంతో పాటు, ధరలు చూసి వెనకడుగు వేయకూడదన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని