TVS- ola electric: ఈవీ రేస్‌ షురూ.. టీవీఎస్‌ నుంచి ఓలాకు గట్టి పోటీ!

TVS iqube: విద్యుత్‌ స్కూటర్ల విభాగంలో టీవీఎస్‌ కంపెనీ ఓలాకు గట్టిపోటీనిస్తోంది. ఓలా మార్కెట్‌ లీడర్‌ స్థానానికి సవాల్‌ విసిరే అవకాశం ఉందని నొమురా అభిప్రాయపడింది.

Updated : 02 Mar 2023 16:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విద్యుత్‌ వాహన విభాగంలోనూ పోటీ మొదలైంది. పెట్రోల్‌ ధరలు అధికంగా ఉండడంతో విద్యుత్‌ వాహనాలవైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. దీంతో వీటికి డిమాండ్‌ పెరుగుతోంది. విక్రయాలు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ విషయంలో ఓలా ఎలక్ట్రిక్‌ (Ola electric) అగ్రస్థానంలో ఉండగా.. ఈ కంపెనీకి టీవీఎస్‌ (TVS) నుంచి గట్టి ఎదురు కానుందని గ్లోబల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ గ్రూప్‌ నొమురా అభిప్రాయపడింది. తాజా వాహన విక్రయ గణాంకాలను ఉటంకించింది.

విద్యుత్‌ వాహన విక్రయాల్లో గతేడాది 7,357 యూనిట్లతో హీరో ఎలక్ట్రిక్‌ అగ్రస్థానంలో నిలిచింది. ఒకినావా (5,900), యాంపియర్‌ (4300), ఓలా (3 వేలు), టీవీఎస్‌ (2,238) ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఏడాదిలో చాలా మార్పు వచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓలా ఎలక్ట్రిక్‌ మార్కెట్‌ లీడర్‌గా అవతరించింది. 17,600 వాహనాలతో అగ్రస్థానంలో నిలిచింది. 12,600 వాహన విక్రయాలతో టీవీఎస్‌ మోటార్‌ రెండో స్థానంలో నిలిచింది. ఏథర్‌ (10 వేలు), హీరో ఎలక్ట్రిక్‌ (5,900), ఒకినావా (3,800) ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

ఫిబ్రవరి నెల గణాంకాలను చూస్తే.. టీవీఎస్‌ వాహన విక్రయాలు భారీగా వృద్ధి చెందడాన్ని నొమురా ప్రస్తావించింది. గత కొన్ని నెలలుగా 17వేల స్థాయిలో ఉన్న ఓలాకు టీవీఎస్‌ నుంచి గట్టి పోటీ ఎదురుకావొచ్చని పేర్కొంది. ఏడాది కాలంగా టీవీఎస్‌ వేగంగా దూసుకోస్తోందని నొమురా అనలిస్టులు అభిప్రాయపడ్డారు. కాగా.. ఓలా ఎలక్ట్రిక్‌ ప్రస్తుతం ఓలా ఎస్‌1, ఎస్‌1 ప్రో, ఎస్‌1 ఎయిర్‌ పేరిట మూడు రకాల వాహనాలను వివిధ బ్యాటరీ వేరియంట్లలో విక్రయిస్తోంది. టీవీఎస్‌ ఐక్యూబ్‌ పేరిట మూడు వేరియంట్లను విక్రయిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని