TVS Raider: స్మార్ట్‌ ఫీచర్లతో టీవీఎస్‌ కొత్త బైక్‌.. లుక్కేయండి!

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్‌ మరో కొత్త బైక్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. అత్యాధునిక ఫీచర్లతో కొత్త TVS Raider 125 తీసుకొచ్చింది.

Updated : 20 Oct 2022 17:18 IST

@Source: టీవీఎస్‌ Twitter

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్‌ (TVS) మరో కొత్త బైక్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. 125 సీసీ సెగ్మెంట్‌లో గతంలో రైడర్‌ బైక్‌ను విడుదల చేసిన ఆ కంపెనీ.. మరిన్ని అత్యాధునిక ఫీచర్లను జోడించి కొత్త Raider 125ను తాజాగా తీసుకొచ్చింది. ఇంజిన్‌లో పెద్దగా మార్పులు చేయనప్పటికీ సాంకేతికంగా మాత్రం అనేక హంగులతో ఈ బైక్‌ను తీర్చిదిద్దింది. దీని ధరను రూ.99,999 (ఎక్స్‌షోరూమ్‌)గా నిర్ణయించింది. బుకింగ్స్‌ ప్రారంభమైనట్లు కంపెనీ తెలిపింది.

సోర్స్‌-టీవీఎస్‌ వెబ్‌సైట్‌

కొత్త రైడర్‌ 125 గురించి చెప్పాల్సి వస్తే దీని ఫీచర్ల గురించే మాట్లాడుకోవాలి. ఇందులో 5 అంగుళాల టీఎఫ్‌టీ ఇన్సుస్ట్రుమెంట్‌ క్లస్టర్‌ను అమర్చారు. టైమ్‌, ట్రిప్‌ మీటర్‌, ఓడో మీటర్‌, ఫ్యూయల్‌, యావరేజ్‌ స్పీడ్‌, రైడింగ్‌ మోడ్‌, గేర్‌ పొజిషన్‌ వంటి ఇండికేటర్లు ఉన్నాయి. దీనికి తోడు టీవీఎస్‌కు చెందిన స్మార్ట్‌ కనెక్ట్‌ టెక్నాలజీ ద్వారా మరిన్ని స్మార్ ఫీచర్లు అందిస్తున్నారు. మొత్తం 99 రకాల కనెక్ట్‌డ్‌ ఫీచర్లు అందిస్తున్నట్లు కంపెనీ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. వాయిస్‌ అసిస్టెంట్‌, కాల్‌ మేనేజ్‌మెంట్‌, నావిగేషన్‌, నోటిఫికేషన్‌ అలర్ట్‌, వెదర్‌, స్పోర్ట్స్‌ అప్‌డేట్స్‌ వంటి స్మార్ట్‌ ఫీచర్లు ఉన్నాయి. అండర్‌ సీట్‌ స్టోరేజీ, యూఎస్‌బీ ఛార్జర్‌, సైడ్‌ స్టాండ్‌ ఇండికేషన్‌ అండ్‌ ఇంజిన్‌ కటాఫ్‌, హెల్మెట్‌ అటెన్షన్‌ ఇండికేషన్ వంటివి ఉన్నాయి.

ఇక ఇంజిన్‌ పరంగా చూస్తే.. ఇందులో 124.8 సీసీ ఎయిర్‌ అండ్‌ ఆయిల్‌ కూల్‌ ఇంజిన్‌ను అమర్చారు. 11.4 హెచ్‌పీ పవర్‌ను 11.2 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్‌ గేర్‌ బాక్స్‌ ఇచ్చారు. ఎకో, పవర్‌ అనే రెండు రకాల మోడ్స్‌ అందిస్తున్నారు. కేవలం 5.9 సెకన్లలోనే 0-60 వేగాన్ని అందుకుంటుందని, గరిష్ఠంగా 99 కిలోమీటర్ల స్పీడ్‌తో దూసుకెళ్తుందని కంపెనీ పేర్కొంది. ఎల్‌ఈడీ హెడ్‌, టెయిల్‌ ల్యాంప్‌ను అమర్చారు. డిస్క్‌, డ్రమ్‌ బ్రేక్‌ వేరియంట్లలో ఈ బైక్‌ వస్తోంది. నాలుగు రంగుల్లో అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని