TVS CNG scooter: బజాజ్‌ బాటలో టీవీఎస్.. త్వరలో CNG స్కూటర్‌..?

TVS CNG scooter: టీవీఎస్ సంస్థ సీఎన్‌జీ ఆప్షన్‌తో ఓ స్కూటర్‌ను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇది 2025 తొలి అర్ధభాగంలో వచ్చే అవకాశం ఉంది.

Published : 11 Jul 2024 15:25 IST

TVS CNG scooter | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచంలోనే తొలి సీఎన్‌జీ (CNG)తో నడిచే బైక్‌ను ఆవిష్కరించి అందరి దృష్టినీ ఆకర్షించింది బజాజ్‌ ఆటో. ఫ్రీడమ్‌ 125 మోటార్‌ సైకిల్‌ను విడుదల చేసి కొత్త అధ్యాయానికి తెర తీసింది. ఈ క్రమంలోనే ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్‌ (TVS) మోటార్స్‌ సైతం సీఎన్‌జీపై దృష్టి సారించింది. సీఎన్‌జీ ఆప్షన్‌తో ఓ స్కూటర్‌ను తీసుకొచ్చేందుకు ఆ కంపెనీ సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది.

దేశంలో మూడో అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీదారుగా ఉన్న టీవీఎస్‌కు 18 శాతం మార్కెట్‌ వాటా ఉంది. ఈ కంపెనీ కొన్నేళ్లుగా ప్రత్యామ్నాయ ఇంధనంపై పని చేస్తోంది. ఇందులోభాగంగా సీఎన్‌జీ సాంకేతికతను అభివృద్ధి చేసింది. ఇందులోభాగంగా స్కూటర్‌ రూపంలో సీఎన్‌జీ ద్విచక్ర వాహనం తీసుకురావాలన్నది టీవీఎస్‌ ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే తొలి సీఎన్‌జీ స్కూటీ అదే అవుతుంది. పాపులర్‌ స్కూటర్‌ అయిన జూపిటర్‌ 125ను సీఎన్‌జీ వేరియంట్‌లో తీసుకొచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే దీనికి ఓ రూపు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.

శాంసంగ్‌ కొత్త ఫ్లిప్‌, ఫోల్డ్‌ ఫోన్లు వచ్చేశాయ్‌.. ధర, ఇతర వివరాలు ఇవే..!

బజాజ్‌ ఫ్రీడమ్‌ తరహాలోనే దీంట్లో సీఎన్‌జీతో పాటు పెట్రోల్‌ ఆప్షన్‌ను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 125 సీసీలో స్కూటర్‌లో పెట్రోల్‌, సీఎన్‌జీ ట్యాంకులను ఎలా అమరుస్తారన్నది ఆసక్తికరం. మరోవైపు ఫ్రీడమ్‌ 125లో రెండు కేజీల సామర్థ్యం కలిగిన సీఎన్‌జీ, పెట్రోల్‌ ట్యాంకులు అమర్చారు. సీఎన్‌జీతో కేజీకి 102 కిలోమీటర్లు మైలేజీ, పెట్రోల్‌తో లీటర్‌కు 65 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని బజాజ్‌ చెబుతోంది. టీవీఎస్‌ ఎంత రేంజ్‌తో తీసుకొస్తుందో చూడాలి మరి. 2024 చివర్లోగానీ, 2025 తొలి అర్ధభాగంలో గానీ ఈ స్కూటర్‌ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని