Twitter: ట్విటర్‌ బ్లూ సబ్‌స్క్రిప్షన్‌.. ఆండ్రాయిడ్‌ యూజర్లకూ 11 డాలర్లే

Twitter Blue: ఐఓఎస్‌ తరహాలో ఆండ్రాయిడ్‌ యూజర్లకూ ట్విటర్‌ బ్లూ సబ్‌స్క్రిప్షన్‌ను నెలకు 11 డాలర్లుగా ట్విటర్‌ నిర్ణయించింది. అలాగే, వెబ్‌ యూజర్ల కోసం వార్షిక ప్లాన్‌ను తీసుకొచ్చింది.

Published : 19 Jan 2023 18:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎలాన్‌ మస్క్‌ నేతృత్వంలోని ట్విటర్‌ (Twitter) ఆండ్రాయిడ్‌ యూజర్లకు సంబంధించి బ్లూ సబ్‌స్క్రిప్షన్‌ (Twitter Blue) ఛార్జీలను ప్రకటించింది. బ్లూ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోవాలనుకునే ఆండ్రాయిడ్‌ యూజర్లు నెలకు 11 డాలర్లు చొప్పున చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. గతంలో ఐఓఎస్‌ యూజర్లకు ప్రకటించిన ధరనే ఆండ్రాయిడ్‌ యూజర్లకు నిర్ణయించడం గమనార్హం. అలాగే, కొత్తగా వెబ్‌ యూజర్లకు కాస్త చౌక ధరలో వార్షిక ప్లాన్‌ను ట్విటర్‌ తీసుకొచ్చింది.

ట్విటర్‌ బ్లూ గతంలో ఉచితంగా లభించేది. రాజకీయ నాయకులు, ప్రముఖులు, జర్నలిస్టులు, ఇతర ముఖ్యమైన వ్యక్తులకు ఖాతాను వెరిఫై బ్లూ టిక్‌ ఇచ్చేవారు. ఎలాన్‌ మస్క్‌ ఎప్పుడైతే ట్విటర్‌ను సొంతం చేసుకున్నారో అప్పటి నుంచి అందులో మార్పులు చేపడుతూ వస్తున్నారు. ఇందులో భాగంగా ఐఓఎస్‌ యూజర్లకు బ్లూ సబ్‌స్క్రిప్షన్‌ను 11 డాలర్లుగా నిర్ణయించగా.. వెబ్‌ యూజర్లకు 8 డాలర్లుగా పేర్కొన్నారు. తాజాగా ఆండ్రాయిడ్‌ యూజర్లకూ ఐఓఎస్‌ ధరనే ప్రకటించారు. యాపిల్‌ యాప్‌ స్టోర్‌ తరహాలో గూగుల్‌ ప్లేస్టోర్‌కూ ఆఫ్‌సెట్‌ ఛార్జీలు చెల్లించాల్సి ఉన్న నేపథ్యంలో ఈ ధరను నిర్ణయించింది. అలాగే వెబ్‌యూజర్ల కోసం వార్షిక ప్లాన్‌ తీసుకొచ్చింది. ప్రస్తుతం వెబ్‌ యూజర్లు నెలకు 8 డాలర్లు చొప్పున చెల్లిస్తుండగా.. అదే ఏడాదికైతే 84 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం అమెరికా, కెనడా, యూకే, జపాన్‌, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా దేశాల్లో వెబ్‌ యూజర్లకు ఈ అవకాశం ఇస్తున్నారు.

ట్విటర్‌ బ్లూ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకున్న వారికి బ్లూ వెరిఫికేషన్‌ మార్క్‌ ఇవ్వడంతో పాటు ఎక్కువ నిడివి కలిగిన వీడియోలను అప్‌లోడ్‌ చేసేందుకు వీలు కల్పిస్తారు. కన్వర్జేషన్‌లో రిప్లయ్‌ ఇచ్చేటప్పుడు బ్లూ సబ్‌స్క్రైబర్లకు ప్రాధాన్యం ఇస్తారు. ట్వీట్‌ను ఎడిట్‌ చేసుకోవడంతో పాటు ఐకాన్స్‌ను కస్టమైజ్‌ చేసుకోవడం, థీమ్స్‌ను మార్చుకునే వెసులుబాటునూ కల్పిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని