Twitter Deal On Hold: ట్విటర్‌ కొనుగోలు ఒప్పందం తాత్కాలికంగా నిలిపివేత!

విద్యుత్తు కార్ల సంస్థ టెస్లా, అంతరిక్ష పరిశోధనా సంస్థ స్పేస్‌ఎక్స్‌ అధిపతి ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) కీలక ప్రకటన చేశారు....

Updated : 13 May 2022 17:10 IST

ట్వీట్‌ చేసిన ఎలాన్‌ మస్క్‌

శాన్‌ఫ్రాన్సిస్కో: విద్యుత్తు కార్ల సంస్థ టెస్లా, అంతరిక్ష పరిశోధనా సంస్థ స్పేస్‌ఎక్స్‌ అధిపతి ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) కీలక ప్రకటన చేశారు. ట్విటర్‌ (Twitter) కొనుగోలు ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. శుక్రవారం ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. స్పామ్‌, నకిలీ ఖాతాలు 5 శాతం కంటే తక్కువ ఉంటాయన్న లెక్కలకు సంబంధించిన ఆధారాలను ఇంకా అందజేయాల్సి ఉందన్నారు. మస్క్‌ ప్రటకన తర్వాత ట్విటర్‌ షేర్లు ప్రీ-మార్కెట్‌ ట్రేడింగ్‌లో 20 శాతానికి పైగా పతనమయ్యాయి. మరోవైపు మస్క్‌ ప్రకటనపై ట్విటర్‌ యాజమాన్యం ఇంకా స్పందించలేదు.

ప్రముఖ అంతర్జాతీయ సామాజిక మాధ్యమం ‘ట్విటర్‌’ కొనుగోలు ఒప్పందం గత నెల ఖరారైన విషయం తెలిసిందే. తొలుత 9.2% వాటా కొనుగోలు చేసిన మస్క్‌ తర్వాత సంస్థ మొత్తాన్నీ తన అధీనంలోకి తీసుకున్నారు. దాదాపు 44 బిలియన్‌ డాలర్లకు ఒప్పందం కుదిరింది. ఒక్కో షేరు 54.20 డాలర్ల చొప్పున మొత్తం 46.5 బిలియన్‌ డాలర్లతో ట్విటర్‌ను కొనుగోలు చేసేందుకు సిద్ధమని మస్క్‌ ప్రకటించారు.

జనవరి-మార్చి త్రైమాసికం నాటికి ట్విటర్ యాక్టివ్‌ యూజర్లలో స్పామ్‌, నకిలీ ఖాతాలు ఐదు శాతం కంటే తక్కువేనని కంపెనీ ఇటీవల వెల్లడించింది. అయితే, దీనిపై ఇంకా వివరాలు అందజేయాల్సి ఉందని మస్క్‌ తాజాగా తెలిపారు. అందుకే కొనుగోలు ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. ట్విటర్‌ మార్పుల్లో భాగంగా స్పామ్‌బోట్లను కూడా తొలగిస్తానని మస్క్‌ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.

ఒప్పందాన్ని అధికారికంగా పూర్తి చేయడానికి కావాల్సిన నిధులను మస్క్‌ సమకూర్చుకుంటున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఇప్పటికే ఆయన కొన్ని టెస్లా షేర్లను కూడా విక్రయించారు. మరోవైపు పలువురు బడా పెట్టుబడిదారులతో చర్చలు జరిపి కొనుగోలు ఒప్పందంలో భాగం కావడానికి వారిని ఒప్పించారు. అలాగే బ్యాంకుల నుంచి కూడా రుణాలను సమకూర్చుకునే ప్రక్రియను ముందుకు తీసుకెళ్తున్నారు. మరోవైపు ఈ డీల్‌ పూర్తికావడంపై వాల్‌స్ట్రీట్‌ వర్గాల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మస్క్ తాజా ప్రకటనతో ఆ అనుమానాలు మరింత బలపడినట్లయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని