Twitter: మస్క్‌ మరో కీలక నిర్ణయం.. ట్విటర్‌ ‘సేఫ్టీ కౌన్సిల్‌’ రద్దు

Twitter: ట్విటర్‌లో విద్వేషపూరిత ప్రసంగాలు సహా ఇతర సమస్యల్ని సమర్థంగా ఎదుర్కోవడానికి ట్రస్ట్‌ అండ్‌ సేఫ్టీ కౌన్సిల్‌ అనే స్వతంత్ర బృందం ఉండేది. దాన్ని ఇప్పుడు ఎలాన్‌ మస్క్‌ రద్దు చేశారు.

Updated : 13 Dec 2022 12:30 IST

శాన్‌ఫ్రాన్సిస్కో: ట్విటర్‌ (Twitter) అధిపతి ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ట్విటర్‌ (Twitter) సంస్థలో ‘ట్రస్ట్‌ అండ్‌ సేఫ్టీ కౌన్సిల్‌’ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. విద్వేష ప్రసంగాలు, బాలలపై ఆకృత్యాలు, ఆత్మహత్యలు, స్వీయ హాని సహా ఇతర సమస్యలను ట్విటర్‌ (Twitter)లో సమర్థంగా ఎదుర్కొనేందుకు 2016లో అప్పటి యాజమాన్యం ఈ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసింది. దీంట్లో 100 మంది స్వతంత్ర సభ్యులు ఉండేవారు. పలు పౌర, మానవతా సంస్థలకు చెందిన వ్యక్తులు తమ సేవల్ని అందించేవారు.

సోమవారం రాత్రి ఈ కౌన్సిల్‌ సమావేశం కావాల్సి ఉంది. కానీ, కొన్ని గంటల ముందు పూర్తిగా కౌన్సిల్‌నే రద్దు చేస్తున్నట్లు మస్క్‌ (Elon Musk) బృందం సభ్యులకు మెయిల్‌ పంపింది. ట్విటర్‌ (Twitter)ను మరింత భద్రమైన, సమాచారంతో కూడిన వేదికగా తీర్చిదిద్దుతామని దాంట్లో పేర్కొన్నారు. పైగా ఈ చర్యల్ని గతంతో పోలిస్తే చాలా వేగంగా చేపడతామని చెప్పారు. ఈ క్రమంలో అందరి సలహాల్ని తీసుకుంటామని పేర్కొన్నారు.

ఈ కౌన్సిల్‌ ఇప్పటి వరకు ఒక స్వతంత్ర బృందంగా వ్యవహరిస్తూ వచ్చింది. హింస, ద్వేషం సహా ఇతర సమస్యల్ని ఎదుర్కోవడానికి కావాల్సిన సలహాలు, సూచనలను ట్విటర్‌కు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉండేది. కానీ, నిర్ణయాలు తీసుకునే అధికారం మాత్రం ఉండేది కాదు. అలాగే ప్రత్యేకమైన సమస్యల్ని సమీక్షించిన దాఖలాలూ లేవు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని