Twitter: ట్విటర్‌ ఉద్యోగికి చేదు అనుభవం.. తొలగించి.. నియమించి.. మళ్లీ వేటేశారు!

మస్క్‌ నిర్ణయంతో ట్విటర్‌లో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని వివరిస్తూ ఓ ఉద్యోగి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశాడు. అది చూసిన నెటిజన్లు ఇవేం నిర్ణయాలంటూ మస్క్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Updated : 25 Nov 2022 17:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ట్విటర్‌ కొత్త బాస్‌ ఎలన్‌ మస్క్‌ తీసుకునే నిర్ణయాలు ఉద్యోగులతోపాటు, యూజర్లను సైతం సందిగ్ధంలో పడేస్తున్నాయి. ఇప్పటికే వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించిన మస్క్‌, వారిలో కొందరిని తిరిగి నియమించుకున్నారు. తాజాగా అందులోంచి మరికొంతమందిని తొలగించినట్లు సమాచారం. దీనికి సంబంధించి తనకు ఎదురైన చేదు అనుభవాన్ని వివరిస్తూ ట్విటర్‌ మాజీ ఉద్యోగి బ్లైండ్‌ (ఉద్యోగులు తమ అభిప్రాయాలను పంచుకునే సోషల్‌ మీడియా యాప్‌)లో వివరిస్తూ పోస్ట్ చేశాడు. మరో ఉద్యోగం కోసం తనకు ఎవరైనా సాయం చేయమని కోరాడు. ఈ పోస్ట్‌ స్క్రీన్‌షాట్‌ను పీటర్ యాంగ్‌ అనే రెడిట్‌ ఉద్యోగి ట్విటర్‌లో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. దీంతో ఇవేం నిర్ణయాలంటూ మస్క్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..?

ట్విటర్‌ను మస్క్‌ హస్తగతం చేసుకున్నాక.. నవంబరు తొలి వారంలో వేల మంది ఉద్యోగులను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వారిలో ఓ ఉద్యోగిని ముందు తొలగించి, తిరిగి ఉద్యోగం ఆఫర్‌ చేసి, మళ్లీ ఎలాంటి సమాచారం లేకుండా ఉద్యోగం నుంచి తొలగించారట. ‘‘నవంబరు తొలి వారంలో నన్ను ఉద్యోగం నుంచి తొలగించినట్లు ట్విటర్‌ యాజమాన్యం తెలిపింది. తొలగింపు ప్రక్రియలో భాగంగా నాకు మూడు నెలల జీతం ఇవ్వనున్నట్లు వెల్లడించింది. కొద్దిరోజుల తర్వాత నాకు ప్రత్యేకమైన ప్రతిభ ఉందని.. డాక్యుమెంటేషన్‌, కోడ్ శాంపిల్స్‌లో నా సేవలు సంస్థకు అవసరం ఉన్నట్లు పేర్కొంటూ తిరిగి నన్ను విధుల్లోకి తీసుకున్నారు. ఏమైందో తెలియదు.. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా గత రాత్రి నన్ను తిరిగి ఉద్యోగం నుంచి తొలగిస్తున్నామని, భృతిగా నాకు నాలుగు వారాల జీతం అందుతుందని తెలిపారు.  ఎవరైనా సాయం చేయగలితే నన్ను సంప్రదించండి. నేను హెచ్‌1బీ వీసా మీద ఉన్నాను. కొత్త ఉద్యోగం వెతుక్కునేందుకు నాకు కేవలం 60 రోజుల గడువు మాత్రమే ఉంది’’ అని పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు మస్క్‌ నిర్ణయాన్ని తప్పుబడుతుంటే, మరికొందరు మస్క్‌కు మద్దతుగా ట్వీట్‌లు చేయడం గమనార్హం. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని