Jack Dorsey: ట్విటర్‌ సీఈవోగా మళ్లీ జాక్‌ డోర్సే రానున్నారా..?

సోషల్‌ మీడియా దిగ్గజ సంస్థ ట్విటర్‌ ఎలాన్‌ మస్క్‌ చేతుల్లోకి వెళ్లిన తర్వాత కీలక స్థానంలో ఎవరుంటారనే విషయం ఆసక్తిగా మారింది. 

Published : 13 May 2022 02:34 IST

సంస్థ సహవ్యవస్థాపకుడు ఏమన్నారంటే

ఇంటర్నెట్‌ డెస్క్‌: సోషల్‌ మీడియా దిగ్గజ సంస్థ ట్విటర్‌ ఎలాన్‌ మస్క్‌ చేతుల్లోకి వెళ్లిన తర్వాత కీలక స్థానంలో ఎవరుంటారనే విషయం ఆసక్తిగా మారింది. సీఈఓగా ఎలాన్‌ మస్క్‌ కొనసాగే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఇదే సమయంలో ట్విటర్‌ సహ వ్యవస్థాపకుడు జాక్‌ డోర్సే మళ్లీ ట్విటర్‌ బాధ్యతలు చేపడతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాను మళ్లీ సీఈవో బాధ్యతలు చేపట్టాలని కోరుకోవడం లేదని సంస్థ వ్యవస్థాపకుడు, మాజీ సీఈవో జాక్‌ డోర్సే స్పష్టం చేశారు.

శక్తివంతమైన సామాజిక మాధ్యమంగా ఎదిగిన ట్విటర్‌ను భారీ వ్యయంతో ఇటీవలే ఎలాన్‌ మస్క్‌ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుత ట్విటర్‌ యాజమాన్యంతో ఎలాన్‌ మస్క్‌ విసిగిపోయారనే వార్తలు వినిపించాయి. అంతేకాకుండా ట్విటర్‌ లీగల్‌ హెడ్‌పై మస్క్‌ విమర్శలు, త్వరలోనే సీఈవో పరాగ్‌ అగర్వాల్‌ను తప్పించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ట్విటర్‌ వ్యవస్థాపకుడు జాక్‌ డోర్సేనే మళ్లీ సీఈఓగా నియమించబోతున్నారంటూ సోషల్‌ మీడియాలో వదంతులు మొదలయ్యాయి. వీటికి బదులిచ్చిన జాక్‌.. ‘మళ్లీ ఇంకెప్పుడూ సంస్థ సీఈవోగా ఉండను’ అంటూ బదులిచ్చారు.

ఇదిలాఉంటే, 16 ఏళ్ల క్రితం ట్విటర్‌ స్థాపనలో కీలక వ్యక్తిగా ఉన్న జాక్ డోర్సే.. గతేడాది నవంబర్‌ నెలలో సీఈవో బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే, అందుకు గల కారణాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. అనంతరం భారత్‌కు చెందిన పరాగ్‌ అగర్వాల్‌ సీఈవో బాధ్యతలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. ఇలా పరాగ్‌ అగర్వాల్‌ కీలక బాధ్యతలు చేపట్టిన ఐదు నెలల కాలంలోనే సంస్థ మరొకరి చేతుల్లోకి వెళ్లిపోయింది. దీంతో తదుపరి సీఈవో ఎవరొస్తారనే విషయం చర్చనీయాంశమయ్యింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని