Twitter: ఆఫీసులోనే పడుకొని మరీ కష్టపడింది.. చివరకు ఉద్యోగం పోయింది

Twitter Layoffs: గడువులోగా టార్గెట్‌ అందుకోవడానికి గతంలో ఎస్తర్‌ క్రాఫోర్డ్‌ ఆఫీసులోనే నిద్రించారు. యాజమాన్యం మారిన నేపథ్యంలో కొత్త వేదికను సిద్ధం చేయడానికి ఇలాంటి త్యాగాలు తప్పవంటూ పరోక్షంగా ఎలాన్‌ మస్క్‌కు మద్దతుగా నిలిచారు. తాజా తొలగింపుల్లో ఆమె కూడా తన ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వచ్చింది.

Published : 28 Feb 2023 01:16 IST

 

వాషింగ్టన్‌: ట్విటర్‌ (Twitter)లో ఉద్యోగుల తొలగింపుల (Layoffs) పర్వం కొనసాగుతోంది. వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా కంపెనీ అధిపతి ఎలాన్ మస్క్‌ (Elon Musk) ఇంకా ఉద్యోగులకు ఉద్వాసన  (Layoffs) పలుకుతూనే ఉన్నారు. తాజాగా మరో 200 మంది ఉద్యోగులను ఇంటి బాట పట్టించినట్లు ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ కథనం పేర్కొంది. తొలగించిన విషయాన్ని ఉద్యోగులకు కొందరికి ఇ-మెయిల్స్‌ ద్వారా.. మరికొందరికి లాగిన్‌ యాక్సెస్‌ నిరాకరించడం ద్వారా తెలియజేసినట్లు సమాచారం.

తాజాగా తొలగించిన వారిలో ఎస్తర్‌ క్రాఫోర్డ్‌ అనే ఉన్నతోద్యోగి కూడా ఉండడం గమనార్హం. పనిచేసే ప్రదేశాన్ని ప్రేమించాలంటూ గతంలో ఆఫీసులో నేలపైనే పడుకొని వార్తల్లో నిలిచిన ఆమెను కూడా మస్క్ తొలగించారు. మస్క్‌ తొలగింపుల పర్వాన్ని ప్రారంభించిన కొత్తలో ఉద్యోగులకు అనేక లక్ష్యాలను నిర్దేశించిన విషయం తెలిసిందే. అవి అందుకోని వారిని తొలగిస్తానని హెచ్చరిక చేశారు. దీంతో ప్రొడక్ట్‌ విభాగానికి నేతృత్వం వహిస్తున్న ఎస్తర్‌.. గడువులోగా టార్గెట్‌ అందుకోవడానికి గతంలో ఆఫీసులోనే నిద్రించారు. యాజమాన్యం మారిన నేపథ్యంలో కొత్త వేదికను సిద్ధం చేయడానికి ఇలాంటి త్యాగాలు తప్పవంటూ పరోక్షంగా ఎలాన్‌ మస్క్‌కు ఒకరకంగా మద్దతుగా నిలిచారు. ఆమె వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు రావడంతో పనిచేసే ప్రదేశాన్ని ప్రేమించాలంటూ హితవు పలికారు. కానీ, అవేవీ పరిగణనలోకి తీసుకోకుండా మస్క్‌ ఇప్పుడు ఆమెను తొలగించేశారు.

తన ఉద్వాసనపై ఎస్తర్‌ క్రాఫోర్డ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. కష్టపడడం, ఆశావహ దృక్పథంతో పనిచేయడం తప్పని తెలిసొచ్చిందని వాపోయారు. ఎస్తర్‌ 2020లో ట్విటర్‌లో చేరారు. ఆమె గతంలో ‘స్క్వాడ్‌’ అనే స్క్రీన్‌ షేరింగ్‌ సోషల్‌ మీడియా యాప్‌నకు సీఈఓగా వ్యవహరించారు. దీన్ని ట్విటర్‌ కొనుగోలు చేసింది. దీంతో ఎస్తర్ ఈ కంపెనీలో చేరారు. డిజైన్‌, ఇంజినీరింగ్‌, ప్రొడక్ట్‌ విభాగాల్లో పనిచేశారు. తాజాగా ఆమె ప్రొడక్ట్‌ టీమ్‌కు నేతృత్వం వహించడంతో పాటు ట్విటర్‌ బ్లూ సబ్‌స్క్రిప్షన్‌, భవిష్యత్తులో తీసుకురాబోయే ట్విటర్‌ పేమెంట్స్‌కూ తన సేవలను అందిస్తున్నట్లు సమాచారం.

ఇప్పటి వరకు ట్విటర్‌ ఎనిమిదిసార్లు ఉద్యోగులను తొలగించింది. పాత యాజమాన్యంలో 7,500 మంది ఉద్యోగులు పనిచేయగా.. ఇప్పుడు ఆ సంఖ్య 2,000కు చేరినట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని