Twitter: జులై 4 డెడ్‌లైన్‌.. ఇదే చివరి నోటీస్: ట్విటర్‌కు కేంద్రం హెచ్చరిక

నూతన ఐటీ నిబంధనలు (IT Rules) పాటించేందుకు గానూ ప్రముఖ మైక్రో బ్లాగింగ్‌ సైట్ ట్విటర్‌ (Twitter) కు కేంద్ర ప్రభుత్వం ‘చివరి’ అవకాశం కల్పించింది. జులై 4వ తేదీలోగా

Published : 29 Jun 2022 16:36 IST

దిల్లీ: నూతన ఐటీ నిబంధనలు (IT Rules) పాటించేందుకు గానూ ప్రముఖ మైక్రో బ్లాగింగ్‌ సైట్ ట్విటర్‌ (Twitter)కు కేంద్ర ప్రభుత్వం ‘చివరి’ అవకాశం కల్పించింది. జులై 4వ తేదీలోగా కేంద్రం జారీ చేసిన ఆదేశాలన్నింటినీ ట్విటర్‌ పాటించాలని తెలిపింది. లేదంటే ఆ సంస్థ మధ్యవర్తిత్వ హోదా కోల్పోతుందని హెచ్చరించింది. ఈ మేరకు కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ ఆ సంస్థకు తాజా నోటీసులు జారీ చేసినట్లు అధికారిక వర్గాలు బుధవారం వెల్లడించాయి.

‘‘కంటెట్‌, ఇతర అంశాల్లో నూతన ఐటీ నిబంధనలను (IT Rules) పాటించాలని ఇప్పటికే ట్విటర్‌ (Twitter)కు పలుమార్లు నోటీసులు జారీ అయ్యాయి. కానీ ఆదేశాలను ట్విటర్‌ అనేకసార్లు ఉల్లంఘిస్తూనే వస్తోంది. జూన్‌ 27న మరోసారి ట్విటర్‌ చీఫ్‌ కాంప్లియెన్స్‌ ఆఫీసర్‌కు మరోసారి నోటీసులు జారీ చేశాం. జులై 4వ తేదీలోగా కేంద్రం ఇప్పటివరకు ఇచ్చిన అన్ని ఆదేశాలను/నిబంధనలను ట్విటర్‌ పాటించాలి. ఇదే చివరి నోటీసు. అప్పటికీ నిబంధనలను ఉల్లంఘిస్తే ట్విటర్‌ (Twitter) మధ్యవర్తిత్వ హోదా కోల్పోతుంది’’ అని ఐటీ మంత్రిత్వశాఖ నోటీసుల్లో హెచ్చరించింది.

డిజిటల్ మాధ్యమాల్లో కంటెంట్‌ నియంత్రణ కోసం కేంద్రం నూతన ఐటీ నిబంధనలు (IT Rules) తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ నిబంధనలు గతేడాది మే 26 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ నిబంధనల ప్రకారం వినియోగదారుల సంఖ్య 50 లక్షలు దాటిన సామాజిక మాధ్యమాలు ఓ ఫిర్యాదుల అధికారిని, ఓ నోడల్‌ అధికారిని, అనుసంధానకర్తగా మరో ప్రధాన అధికారిని నియమించుకోవాల్సి ఉంటుంది. ఈ ముగ్గురూ భారత్‌లో నివసిస్తూ ఉండాలి. అయితే ఈ నిబంధనలను ఇతర సామాజిక మాధ్యమ సంస్థలు పాటిస్తున్నప్పటికీ.. ట్విటర్‌ (Twitter) మాత్రం అందుకు విముఖత చూపిస్తోంది. ఈ క్రమంలోనే ట్విటర్‌ (Twitter), కేంద్రం మధ్య గతేడాది తీవ్ర స్థాయిలో విభేదాలు తలెత్తాయి. ఆ తర్వాత ఈ నిబంధనల్లో కొన్నింటిని సంస్థ పాటించగా.. ఇంకా చాలా వాటిని అమలు చేయలేదు.

ఇదిలా ఉండగా.. కేంద్రం ఇటీవల కొన్ని న్యాయ సహాయ సంస్థలు, పాత్రికేయులు, రాజకీయ నేతలు, రైతు సంఘాలకు చెందిన ట్వీట్లను, ఆయా ఖాతాలను నిలిపివేయాలని ట్విటర్‌ను కోరింది. ఈ అభ్యర్థన మేరకు 80 ట్విటర్‌ ఖాతాలను సంస్థ నిలిపివేసింది. కాగా.. ఒకవేళ ట్విటర్‌ మధ్యవర్తిత్వ హోదా కోల్పోతే.. ఈ వేదికపై నెటిజన్లు పెట్టే అభ్యంతరక పోస్టులకు సంబంధించిన కేసుల్లో భారత చట్టాలకు అనుగుణంగా ట్విటర్‌ (Twitter) కూడా క్రిమినల్‌ చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని